తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal Pradesh Exit Poll Results: హిమాచల్‍లో నువ్వా నేనా.. ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

Himachal Pradesh Exit Poll Results: హిమాచల్‍లో నువ్వా నేనా.. ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

05 December 2022, 18:30 IST

    • Himachal Pradesh Exit Poll Results 2022: హిమాచల్ ప్రదేశ్‍లో అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. హంగ్ వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వివరాలు ఇవే.
Himachal Pradesh Exit Poll Results: హిమాచల్‍లో ‘హోరాహోరీ’.. ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్
Himachal Pradesh Exit Poll Results: హిమాచల్‍లో ‘హోరాహోరీ’.. ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్ (PTI)

Himachal Pradesh Exit Poll Results: హిమాచల్‍లో ‘హోరాహోరీ’.. ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్

Himachal Pradesh Exit Poll Results 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హోరాహోరీ తప్పేలా లేదు. అధికార భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అనేలా పోటీ ఉంది. నేటి (డిసెంబర్ 5) సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుందని పీపుల్స్ పల్స్ (People Pulse) సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అయితే హస్తం పార్టీకి కాస్త అనుకూలంగా ఫలితాలు ఉంటాయని అంచనాలు వెలువరించాయి. హిమాచల్ ప్రదేశ్‍లోని 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరిగింది. 75.6 శాతం పోలింగ్ నమోదైంది. నేడు గుజరాత్‍లో రెండో దశ పోలింగ్ ముగిశాక.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. పూర్తి వివరాలు ఇవే.

పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం..

Himachal Pradesh Exit Poll Results 2022: హిమాచల్ ప్రదేశ్‍లో పోలింగ్ తర్వాత పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం హిమాచల్ ప్రదేశ్‍లో కాంగ్రెస్ పార్టీకి 29 నుంచి 39 సీట్లు దక్కే అవకాశం ఉంది. అధికార బీజేపీకి 27 నుంచి 37 సీట్లు కైవసం అవుతాయి. ఇతరులు 2 నుంచి 5 సీట్ల వరకు సాధించి ఛాన్స్ ఉంది. ఆమ్‍ఆద్మీ పార్టీ ఖాతా తెరిచే అవకాశాలు లేవు. హిమాచల్ ప్రదేశ్‍లో మొత్తంగా 68 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అధికారం చేజిక్కించుకోవాలంటే 35 సీట్లు సాధించాల్సి ఉంటుంది.

  • కాంగ్రెస్: 29 నుంచి 39
  • బీజేపీ: 27 నుంచి 37
  • ఆమ్ఆద్మీ: 0
  • ఇతరులు: 2 నుంచి 5

0.4 ఓట్ల శాతమే తేడా

Himachal Pradesh Exit Poll Results 2022: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్-జీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.4 శాతంగా ఉంటుందని పీపుల్స్ పల్స్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌ పార్టీకి 45.9 శాతం, బీజేపీకి 45.5 శాతం, ఆమ్‌ఆద్మీ పార్టీకి 2.1 శాతం, ఇతరులకు 6.5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది.

ప్రచారం సాగిందిలా..

Himachal Pradesh Exit Poll Results 2022: ప్రియాంక గాంధీ ప్రచారం వల్ల హిమాచల్ ప్రదేశ్‍లో కాంగ్రెస్‍కు లాభం చేకూరిందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. అయితే రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర ప్రభావం చూపించలేకపోయిందని అభిప్రాయపడింది. మరోవైపు బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ.. హిమాచల్ ప్రదేశ్‍లో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ తమ పార్టీనే గెలిపించి.. డబుల్ ఇంజిన్ సర్కార్ ను కొనసాగించాలని ప్రజలను కోరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‍నాథ్ సింగ్, అనురాగ్ సింగ్ థాకూర్ సహా ప్రముఖ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు

స్వతంత్రులది కీలకపాత్ర కానుందా!

68 అసెంబ్లీ స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్‍లో అధికారం దక్కాలంటే 35 సీట్లు గెలవాలి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ తప్పేలా కనిపించడం లేదు. ఒకవేళ హంగ్ ఏర్పడితే.. స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచే వారే కీలకంగా మారనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో వారు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ కూడా పేర్కొంది.

ప్రతీసారి అధికార మార్పు

2017 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 16 సీట్లలో కేవలం 1 శాతం తేడాతోనే కాంగ్రెస్ ఓటమిపాలైంది. దీంతో ఓట్ల శాతంతో స్వల్ప మార్పులు కూడా పార్టీల ఫలితాలను మార్చేస్తుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లను గెలిచింది. 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్‍లో అధికార పార్టీ వరుసగా రెండోసారి ఎప్పుడూ గెలవలేదు. ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారింది. ఈ సెంటిమెంట్ కూడా కాంగ్రెస్‍కు ఈసారి కలిసి వస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే పేర్కొంది. 2017తో పోలిస్తే కాంగ్రెస్‍కు ఓట్ల శాతం 4.2 శాతం పెరుగుతుందని, బీజేపీ 3 శాతం ఓట్లను కోల్పోయే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. మొత్తంగా 38 స్థానాల్లో ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది.

ప్రభావం చూపిన అంశాలు ఇవే..

ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, యాపిల్ పంటలకు కనీస మద్దతు ధరతో పాటు మరిన్ని కారణాలు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. నిత్యావసరాల ధర పెరుగుదల, నిరుద్యోగం విషయంపై అధికార బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వెల్లడించింది. ఇది కాంగ్రెస్‍కు ఉపయోగపడిందని అంచనా వేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‍లో అగ్నిపథ్ పథకంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుత మఖ్యమంత్రి జైరామ్ థాకూర్ పనితీరు పట్ల 33 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పీపుల్స్‌ పల్స్‌ సర్వే చెప్పింది.

బీజేపీపై వ్యతిరేకత

హిమాచల్ ప్రదేశ్‍లో గత ఐదేళ్ల బీజేపీ పాలనపై 26 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి చేశారని పీపుల్స్ పోల్స్ సర్వేలో తేలింది. 28 శాతం మందిలో కొంత మేరకు అసంతృప్తి ఉందని చెప్పినట్టు పేర్కొంది. కేవలం 22 శాతం మంది మాత్రమే బీజేపీ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించింది. బీజేపీ ప్రభుత్వంతో పోలిస్తే అంతకముందు ఐదు సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందని 37 శాతం మంది చెప్పాలని ఈ సర్వే వెల్లడించింది. 31 శాతం మంది ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారని తెలిపింది.

ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని హిమాచల్ ప్రజలు కోరుకుంటున్నారో కూడా పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జయరామ్‌ ఠాకూర్‌కు 24 శాతం మంది మద్దతు తెలుపగా, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సీఎం కావాలని 22 శాతం మంది కోరుకుంటున్నారని తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీ హిమాచల్ ప్రదేశ్ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌.. సీఎంగా ఉండాలని 22 శాతం మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో తేలింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో పోలింగ్ తర్వాత పీపుల్స్‌ పల్స్‌ సంస్థ.. నవంబర్‌ 15 నుంచి నవంబర్‌ 22 వరకు సర్వేను నిర్వహించింది. మొత్తంగా 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 96 పోలింగ్‌స్టేషన్లలో 1,920 శాంపిళ్లను సేకరించింది.

తదుపరి వ్యాసం