తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాత సర్కారుకు మంగళహారతి.. ఈసారీ అదే అనవాయితీ

పాత సర్కారుకు మంగళహారతి.. ఈసారీ అదే అనవాయితీ

HT Telugu Desk HT Telugu

08 December 2022, 18:32 IST

    • సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ విజయం ఖాయమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సగం మార్కును సునాయసంగా అధిగమించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ శ్రేణుల ఉత్సాహం
హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ శ్రేణుల ఉత్సాహం (Pramod Adhikari)

హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ శ్రేణుల ఉత్సాహం

కాంగ్రెస్ 68 స్థానాలకు గానూ 40 స్థానాల్లో విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) 21 స్థానాలు గెలుచుకుంది. 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్వతంత్రులు 3 స్థానాలను గెలుచుకున్నారు. ఆప్ రాష్ట్రంలో తన ఖాతా తెరవడంలో విఫలమైంది. అసెంబ్లీ ఎన్నికలు రాగానే అధికారంలో ఉన్న పార్టీని గద్దె దింపడం, ప్రతిపక్షాన్ని గద్దెనెక్కించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడంతో ఆ ఆనవాయితీకి బ్రేక్ పడుతుందని అంతా భావించారు. అయితే ఆప్ కేవలం 1.10 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. దీంతో ఆనవాయితీపై పెద్దగా ప్రభావం కనిపించలేదు.

హిమాచల్‌లో ఓట్ల శాతం పరంగా చూస్తే కాంగ్రెస్ దాని ప్రధాన ప్రత్యర్థి కంటే స్వల్ప ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్‌కు 43.91 శాతం ఓట్లు లభించగా, బీజేపీకి 42.99 శాతం ఓట్లు లభించాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తేలడంతో రాష్ట్రంలో ఓటమిని అంగీకరిస్తూ హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ తన రాజీనామాను సమర్పించారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు సిమ్లాలోని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ‘నా రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశాను. విషయాలను విశ్లేషించుకోవాలి. కొన్ని అంశాలు ఫలితాల దిశను మార్చేశాయి. ..’ అని జైరాం ఠాకూర్ అన్నారు.

ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్.. చండీగఢ్‌లో తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ప్లాన్ చేస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హిమాచల్ రాష్ట్రంలో పార్టీ పనితీరుకు దోహదపడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం అన్నారు.

‘మేం హిమాచల్ ఎన్నికల్లో గెలిచాం. ప్రజలు, మా కార్యకర్తలు, నాయకుల కృషి వల్ల ఈ ఫలితం వచ్చింది. ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా మాకు సహాయపడింది. సోనియా గాంధీ ఆశీస్సులు కూడా మాతో ఉన్నాయి..’ అని ఖర్గే విలేకరులతో అన్నారు.

‘మా పరిశీలకులు, ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు అక్కడికి (హిమాచల్ ప్రదేశ్) వెళ్తున్నారు. గవర్నర్‌ను ఎప్పుడు కలవాలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఎప్పుడు పిలవాలో వారు నిర్ణయిస్తారు’ అని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.

తదుపరి వ్యాసం