తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump | రేపే అందుబాటులోకి డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా యాప్‌

Donald Trump | రేపే అందుబాటులోకి డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా యాప్‌

Hari Prasad S HT Telugu

20 February 2022, 13:18 IST

    • క్యాపిటల్‌ హిల్‌పై ట్రంప్‌ అనుచరుల దాడి తర్వాత ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా యాప్‌లన్నీ డొనాల్డ్‌ ట్రంప్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్‌ సొంతంగా సోషల్‌ మీడియా యాప్‌ లాంచ్‌ చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో) (REUTERS)

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రారంభించిన సోషల్‌ మీడియా యాప్‌ 'Truth Social' సోమవారం(ఫిబ్రవరి 21) నుంచే అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ను ముందుగా యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారని రాయ్‌టర్స్‌ తెలిపింది. 

బడా టెక్‌ కంపెనీల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయడానికి సొంతంగా సోషల్‌ మీడియా యాప్‌ లాంచ్‌ చేయబోతున్నట్లు గతేడాది అక్టోబర్‌లోనే ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే కొత్తగా సృష్టించిన ట్రంప్‌ మీడియా & టెక్నాలజీ గ్రూప్‌ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను ఇప్పటికే చాలా మంది టెస్ట్‌ దశలో వినియోగించారు. ఆ యూజర్లు అడిగిన ప్రశ్నలకు నెట్‌వర్క్‌ చీఫ్‌ ప్రోడక్ట్‌ ఆఫీసర్ బిల్లీ బీ సమాధానాలు ఇచ్చారు. 

ఈ సందర్భంగానే సోమవారం నుంచి యాప్‌ స్టోర్‌లో ఈ యాప్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. మీ ఫేవరెట్‌ ప్రెసిడెంట్‌ మిమ్మల్ని త్వరలోనే కలవబోతున్నారు అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌.. ఓ ట్వీట్‌ చేశారు. అందులో ట్రంప్‌ వెరిఫైడ్‌ ట్రూత్‌ సోషల్‌ అకౌంట్‌ నుంచి చేసిన పోస్ట్‌ కూడా ఉంది. 

గతేడాది అమెరికా ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత జనవరి 6న ట్రంప్‌ అనుచరులు క్యాపిటల్‌ హిల్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులను ట్రంప్‌ రెచ్చగొట్టేలా పోస్ట్‌లు చేశారంటూ ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటివి ఆయనపై నిషేధం విధించాయి. అప్పటి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ తన అభిమానులకు దూరంగా ఉంటున్నారు.

తదుపరి వ్యాసం