తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3: చంద్రుడిపైకి ప్రయాణానికి సర్వం సిద్ధం; రేపే చంద్రయాన్ 3 ప్రయోగం

Chandrayaan-3: చంద్రుడిపైకి ప్రయాణానికి సర్వం సిద్ధం; రేపే చంద్రయాన్ 3 ప్రయోగం

HT Telugu Desk HT Telugu

13 July 2023, 12:13 IST

  • Chandrayaan-3: చంద్రయాన్ 3 కి రంగం సిద్ధమైంది. జులై 14, శుక్రవారం చంద్రుడిపైకి ప్రయాణం ప్రారంభం కానుంది. అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ సామర్ధ్యం మరోసారి ప్రపంచానికి తెలియనుంది.

ప్రయోగానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్ 3
ప్రయోగానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్ 3

ప్రయోగానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్ 3

Chandrayaan-3: చంద్రయాన్ 3 కి రంగం సిద్ధమైంది. జులై 14, శుక్రవారం చంద్రుడిపైకి ప్రయాణం ప్రారంభం కానుంది. అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ సామర్ధ్యం మరోసారి ప్రపంచానికి తెలియనుంది.

Fourth nation to land on Moon: నాలుగో దేశంగా..

చంద్రుడిపై అడుగుపెట్టే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అడుగు వేసింది.చంద్రయాన్ (Chandrayaan) పేరుతో భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టులో భాగంగా చంద్రయాన్ 3 ప్రయోగానికి సర్వం సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి శుక్రవారం, జులై 14, మధ్యాహ్నం 2.35 గంటలకు లాంచ్ వెహికిల్ ‘మార్క్’ ద్వారా చందమామ పైకి ప్రయాణం ప్రారంభమవుతుంది. నాలుగేళ్ల క్రితం నాటి చంద్రయాన్ 2 వైఫల్యం తరువాత అన్ని పొరపాట్లు సరిదిద్దుకుని చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. చంద్రుడి ఉపరితలంపైకి స్పేస్ క్రాఫ్ట్ ను విజయవంతంగా ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. 2019 లో చంద్రయాన్ 2 ప్రయోగం చివరి దశలో, చంద్రుడి ఉపరితలంపై దిగే సమయంలో విఫలమై, భారతీయులను విషాదంలో ముంచెత్తింది. దాంతో, ఈ సారి చంద్రుడి ఉపరితలంపై దిగే విషయానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు.

When will Chandrayaan-3 start and end?: ప్రయోగం ఎప్పుడు? ఎలా?

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి శుక్రవారం, జులై 14, మధ్యాహ్నం 2.35 గంటలకు చందమామ పైకి భారత అంతరిక్ష నౌక ప్రయాణం ప్రారంభమవుతుంది. అనంతరం, 16 నిమిషాల తరువాత ప్రొపల్షన్ మోడ్యూల్ రాకెట్ నుంచి విడిపోతుంది. ఆ తరువాత, భూమి చుట్టూ 5 - 6 సార్లు దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంది. ఈ పరిభ్రమణం సమయంలో ప్రొపల్షన్ మోడ్యూల్ భూమికి 170 కిమీల సమీపంలోకి వస్తుంది. అలాగే, భూమికి 36,500కిమీల గరిష్ట దూరంలోకి వెళ్తూ, చంద్రుడికి దగ్గరవుతుంది. ఆ తరువాత వేగం పుంజుకుంటూ, సుమారు నెల రోజుల పాటు చంద్రుడి దిశగా ప్రయాణిస్తుంది. ఆ తరువాత చంద్రుడి ఉపరితలానికి సుమారు 100 కిమీల దూరంలో చంద్రుడి కక్షలోకి చేరుతుంది. కక్షలో నిర్ధారిత ప్రదేశానికి చేరుకున్న తరువాత, ల్యాండర్ మోడ్యూల్ క్రమంగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కు ప్రయాణం ప్రారంభిస్తుంది.

After safe landing: ఆగస్ట్ 23, లేదా 24 తేదీల్లో ల్యాండింగ్

ఇస్రో అంచనా ప్రకారం ఆగస్ట్ 23 లేదా 24 తేదీల్లో చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ఒక అంతరిక్ష నౌక ల్యాండ్ కావడం ఇదే ప్రథమం. చంద్రుడి ఉత్తర ధృవం కన్నా దక్షిణ ధృవం విశాలంగా ఉంటుందని, అందువల్ల ఆ ప్రాంతంలో ల్యాండ్ చేయాలని నిర్ణయించామని ఇస్రో వెల్లడించింది. ఆ ప్రాంతంలో నీటి జాడలు లభించే అవకాశం ఉండడం మరో కారణమని తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన తరువాత, ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో ఉన్న రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై ఆ రోవర్ దాదాపు 14 రోజుల పాటు తిరుగుతుంది. అందులోని కెమెరాలు వివిధ కోణాల్లో చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి, భూమికి పంపిస్తాయి.

తదుపరి వ్యాసం