తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Same Sex Marriages: స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. సుప్రీం విచారణకు ఒక్కరోజు ముందు..

Same Sex Marriages: స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. సుప్రీం విచారణకు ఒక్కరోజు ముందు..

17 April 2023, 15:21 IST

    • Same Sex Marriages - Central Government: స్వలింగ వివాహాలపై దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. ఈ విషయంపై నిర్ణయం న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదని పేర్కొంది.
ప్రతీకాత్మక చిత్రం (Photo: HT Photo)
ప్రతీకాత్మక చిత్రం (Photo: HT Photo)

ప్రతీకాత్మక చిత్రం (Photo: HT Photo)

Same Sex Marriages - Central Government: స్వలింగ సంపర్కుల వివాహాలకు (Same Sex Marriages) చట్టబద్ధత కల్పించే విషయంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకత వ్యక్తం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పిటిషన్లను విచారించవద్దని సుప్రీం కోర్టు (Supreme Court)ను కోరింది. ఈ మేరకు స్వలింగ వివాహాల అంశంపై రెండో అఫిడవిట్‍ను సుప్రీం కోర్టులో దాఖలు చేసింది కేంద్రం. వివాహాల గుర్తింపు అనేది చట్టపరమైన అంశం అని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని అభిప్రాయం వ్యక్తం చేసింది. స్వలింగ వివాహాలకు ప్రస్తుత వివాహ వ్యవస్థతో సమానమైన గుర్తింపు కల్పిస్తే సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఇందుకు ఒక్క రోజు ముందు తాను సమర్పించిన డాక్యుమెంట్లలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.

వివక్ష కిందికి రాదు

Same Sex Marriages - Central Government: స్వలింగ వివాహాలకు ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా చట్టబద్ధత కల్పించకపోవడం వివక్ష కిందికి రాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మతాలకు చెందిన వివాహాల చట్టాలు కూడా పురుషుడు, మహిళ మధ్య జరిగిన వివాహాలనే చెల్లుబాటయ్యేవిగా పరిగణిస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఉన్నత నాగరికులుగా తమను తాము భావించుకుంటున్న కొందరు మాత్రమే.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పిటిషన్లు వేశారని, అది ఎక్కువ మంది అభిప్రాయం కాదని, అందుకే వాటిని సుప్రీం కోర్టు విచారణ జరపకూడదని కేంద్రం కోరింది.

న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదు

Same Sex Marriages - Central Government: వివాహలకు చట్టబద్ధత కల్పించే అంశం న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదని, పార్లమెంటు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత విషయంపై కోర్టులు దూరంగా ఉండాలని సుప్రీంను కేంద్రం కోరింది. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు, మతపరమైన సంప్రదాయాలు, అంశాలను పరిగణనలోకి తీసుకొని పార్లమెంటు చట్టాలను చేస్తుందని, చట్టాల రూపకల్పన న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదని కేంద్రం తన అఫిడవిట్‍లో పేర్కొంది.

పిటిషన్లను కొట్టేయాలి

Same Sex Marriages - Central Government: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని సుప్రీం కోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ అంశంపై చర్చకు పార్లమెంటును సరైన వేదికగా అభిప్రాయపడింది. ఉన్నత నాగరికులుగా స్వయంగా భావించుకొని కొందరు వేసిన పిటిషన్లను చాలా మంది ప్రజల అభిప్రాయంగా భావించవద్దని సుప్రీం కోర్టుకు కేంద్రం సూచించింది.

Same Sex Marriages: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‍కే కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించనుంది.

తదుపరి వ్యాసం