తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Satyendra Jain | `కోవిడ్‌తో జ్ఞాప‌క శ‌క్తి కోల్పోయా`; ఈడీతో స‌త్యేంద్ర జైన్‌

Satyendra Jain | `కోవిడ్‌తో జ్ఞాప‌క శ‌క్తి కోల్పోయా`; ఈడీతో స‌త్యేంద్ర జైన్‌

HT Telugu Desk HT Telugu

18 June 2022, 17:08 IST

  • మ‌నీ లాండ‌రింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ బెయిల్ పిటిష‌న్‌ను సీబీఐ ప్ర‌త్యేక కోర్టు కొట్టివేసింది. త‌న‌కు గ‌తంలో కోవిడ్ సోకింద‌ని, దాంతో జ్ఞాప‌క శ‌క్తి కోల్పోయాన‌ని విచార‌ణ సంద‌ర్భంగా ఈడీకి జైన్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్
ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్ (HT_PRINT)

ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్

న‌గదు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో మే 30 స‌త్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అదుపులోకి తీసుకుంది. అనంత‌రం, ఆయ‌న‌ను జూన్ 27 వ‌ర‌కు జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపాల‌ని కోర్టు ఆదేశించింది. దాంతో, బెయిల్ కోరుతూ జైన్ కోర్టును ఆశ్ర‌యించారు.

మ‌నీ లాండ‌రింగ్ కేసు లేదు

స‌త్యేంద్ర జైన్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది హ‌రిహ‌ర‌న్ వాదించారు. త‌న క్ల‌యింట్‌పై ఎలాంటి మనీ లాండ‌రింగ్ కేసు లేద‌ని, గ‌త 13 రోజులుగా జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నార‌ని, అందువ‌ల్ల బెయిల్ మంజూరు చేయాల‌ని కోర్టును కోరారు. ఢిల్లీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న జైన్‌.. దేశం విడిచి పారిపోయే అవ‌కాశాలు లేవ‌న్నారు. సాక్షుల వాంగ్మూలాల‌ను కూడా తీసుకున్నార‌ని, ఇప్ప‌టికే స‌త్యేంద్ర జైన్ 7సార్లు ఈడీ ముందు హాజ‌ర‌య్యార‌ని వివరించారు. అయితే, జైన్ కు బెయిల్ ల‌భిస్తే.. సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌మాద‌ముంద‌ని అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌వీ రాజు వాదించారు.

ఆ కంపెనీలో చిన్న వాటా

ఈడీ చెబుతున్న కంపెనీలో జైన్‌కు చాలా చిన్న వాటా ఉంద‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. ఈడీ ఆరోప‌ణ‌ల్లో ఉన్న భూమి ఆ కంపెనీ కొనుగోలు చేసింద‌న్నారు. కంపెనీ పేరున ఉన్న ఆస్తులు షేర్‌హోల్డ‌ర్ల‌వి ఎలా అవుతాయ‌ని ప్ర‌శ్నించారు. అలాగే, ఈడీ చెబుతున్న ట్ర‌స్ట్‌తో స‌త్యేంద్ర జైన్‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. అదీకాక‌, త‌న క్ల‌యింట్ ఆరోగ్యం బాగాలేద‌ని, గ‌తంలో కోవిడ్ రావ‌డంతో, ఆయ‌న ప్ర‌స్తుతం మెమొరీ లాస్‌తో, నిద్ర లేమితో బాధ‌ప‌డ్తున్నార‌ని వెల్ల‌డించారు.

స‌హ‌క‌రించ‌డం లేదు

కేసు విచార‌ణ‌లో స‌త్యేంద్ర జైన్ స‌హ‌క‌రించ‌డం లేద‌ని అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. ప్ర‌తీ ప్ర‌శ్న‌కు గుర్తు లేద‌ని చెప్తున్నార‌ని, కోవిడ్‌తో త‌న‌కు మ‌తిమ‌రుపు వ‌చ్చిందంటున్నార‌ని వివ‌రించారు. మ‌నీలాండ‌రింగ్‌కు సంబంధం ఉన్న ట్ర‌స్ట్ గురించి ప్ర‌శ్నిస్తే.. మ‌తిమ‌రుపును స‌మాధానంగా చెబుతున్నార‌న్నారు. మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డిన కంపెనీల డైరెక్ట‌ర్ల‌యిన వైభ‌వ్ జైన్‌, అంకుశ్ జైన్ స‌త్యేంద్ర జైన్ బినామీల‌ని వెల్ల‌డించారు. వాద‌న‌ల అనంత‌రం బెయిల్ పిటిష‌న్‌ను తిరస్క‌రిస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది.

తదుపరి వ్యాసం