తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Political Analysis: కన్నడ కాంగ్రెస్‌లో ‘రామయ్య’ ‘శివ’ ధనస్సు విరిచేనా...?

Political Analysis: కన్నడ కాంగ్రెస్‌లో ‘రామయ్య’ ‘శివ’ ధనస్సు విరిచేనా...?

HT Telugu Desk HT Telugu

20 April 2023, 17:18 IST

    • ‘ప్రభుత్వ మార్పు సంప్రదాయంతోపాటు పాలక బీజేపీపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌..  సిద్ధరామయ్యపై ఆశలు పెట్టుకుంది..’ - పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ రీసెర్చర్ ఐవీ మురళీకృష్ణ రాజకీయ విశ్లేషణ.
కేపీసీసీ ప్రెసిడెంట్ శివకుమార్‌ అర్థబలాన్ని తట్టుకుని సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కాగలరా?
కేపీసీసీ ప్రెసిడెంట్ శివకుమార్‌ అర్థబలాన్ని తట్టుకుని సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కాగలరా? (PTI)

కేపీసీసీ ప్రెసిడెంట్ శివకుమార్‌ అర్థబలాన్ని తట్టుకుని సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కాగలరా?

కర్ణాటక ఎన్నికల వేళ సిద్ధరామయ్య పాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సిద్ధరామయ్యపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది. రాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న 75 ఏళ్ల సిద్ధరామయ్య ప్రస్తుతం కాంగ్రెస్‌లో అంతర్గత పోరును ఎదుర్కొంటూనే రాష్ట్రంలో పార్టీని అందెలమెక్కించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించిన ఆయన ఒకవైపు పార్టీ అధిష్టానం నుండి మరోవైపు స్థానిక నాయకత్వం నుండి వస్తున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులేస్తున్నారు.

ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన సర్వేలో అందరికంటే ఎక్కువగా 32 శాతం మంది సిద్ధరామయ్య సీఎం కావాలని భావించారంటే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉందో తెలుస్తోంది. రాష్ట్రంలో గత 45 ఏండ్లలో పూర్తి కాలం (2013-18) ముఖ్యమంత్రిగా కొనసాగిన ఘనత సిద్ధరామయ్యకే దక్కడం కూడా ఇక్కడ గమనార్హం. దీంతో రాష్ట్ర ప్రజలు, రాజకీయ అనిశ్చితి కాకుండా సుస్ధిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని భావించవచ్చు.

సిద్ధరామయ్యపైనే కాంగ్రెస్‌ ఆశలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బలహీన పడుతున్న కాంగ్రెస్‌కు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. మే నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని ఆ పార్టీ భావిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గత 38 సంవత్సరాలుగా ఏ పార్టీ రెండోసారి వరుసగా అధికారం చేపట్టలేదనే చరిత్రతో విజయంపై కాంగ్రెస్‌కు ఆశలు రెట్టింపయ్యాయి. ప్రభుత్వ మార్పు సంప్రదాయంతోపాటు పాలక బీజేపీపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌ మాజీ సీఎం సిద్ధరామయ్యపై ఆశలు పెట్టుకుంది. ఏ కోణంలో చూసినా సిద్ధరామయ్య కర్ణాటక కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్నారు.

కర్ణాటక ప్రజలు ‘సిద్ధు’గా పిలుచుకునే సిద్ధరామయ్యది వ్యవసాయ కుటుంబం, కురుబ సామాజిక వర్గం. 1983లో మొదటిసారి భారతీయ లోక్‌దల్‌ పార్టీ నుండి చాముండేశ్వరీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అనంతరం రామకృష్ణహెగ్డే ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆయన కర్ణాటక సీనియర్ నేత హెచ్‌.డి.దేవెగౌడ పాటు జనతాదల్‌ పార్టీలో చేరారు.

దేవెగౌడ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన 1996లో జే.హెచ్‌.పాటిల్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం రాజకీయ పరిణామాలతో దేవెగౌడ ప్రారంభించిన జనతాదల్‌ (ఎస్‌)లో చేరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్‌-జేడీ (ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2005లో దేవెగౌడతో ఏర్పడిన విభేదాలతో జేడీ (ఎస్‌)ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో దేవెగౌడ కుటుంబానికే ప్రాధాన్యత ఉందని, ఇతరులను రాజకీయంగా ఎదగనీయడం లేదని విమర్శిస్తూ అప్పట్లో పార్టీ నుండి బయటికి వచ్చారు.

బలప్రదర్శనగా ‘సిద్ధమహోత్సవ్‌’

రాష్ట్రంలో బీజేపీకి దన్నుగా ఉంటున్న సంఘ్ పరివార్‌ను, లింగాయత్‌లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయంగా సిద్ధరామయ్య బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ప్రాధాన్యతిస్తూ ‘అహిండా’ అనే ఒక సోషల్‌ ఇంజినీరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆశలన్నీ ‘అహిండా’పైనే ఉన్నాయి. సిద్ధరామయ్య గత ఆగస్టు 3న ‘సిద్ధమహోత్సవ్‌’ పేరిట తన 75వ పుట్టిన రోజును 16 లక్షల మంది జనసమూహంతో బలప్రదర్శన నిర్వహించి రాష్ట్ర రాజకీయాల్లో తనకున్న పట్టును నిరూపిస్తూ పాలక బీజేపీకి, కాంగ్రెస్‌లోని తన ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు.

2013లో సిద్ధరామయ్య నేతృత్వంలోనే అధికారం చేపట్టిన కాంగ్రెస్‌కు 2014 నుండి దేశవ్యాప్తంగా ‘మోడీ’ ప్రభావంతో రాష్ట్రంలో బీజేపీ నుండి పెను సవాళ్లు ఎదురయ్యాయి. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధరామయ్య కొన్ని సాహస నిర్ణయాలు తీసుకున్నారు. 2015లో టిప్పు సుల్తాన్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. సున్నితమైన ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో బీజేపీ పెద్దఎత్తున నిరసనలు చేసినా ఆయన ఎక్కడికక్కడ పరిస్థితులు చేయి దాటకుండా సమర్థంగా వ్యవహరించారు.

పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐలపై ఉన్న కేసులను సిద్ధరామయ్య తొలగించారని, ఆయన హిందూ వ్యతిరేకని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సిద్ధరామయ్య తన పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యర్థుల నుండే కాకుండా స్వపక్షం నుండి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన కాంగ్రెస్‌ అధిష్టానంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం.

2018 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్జీ రాకపోవడంతో రాష్ట్రంలో బీజేపీని అధికార పగ్గాల నుండి దూరం పెట్టాలనే లక్ష్యంతో కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. తక్కువ స్థానాలే ఉన్నా, ప్రత్యేక పరిస్థితుల్లో జేడీ(ఎస్‌)కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చినా పార్టీ వ్యూహాలను సిద్ధరామయ్య సహనంతో అంగీకరించారు. అనేక పరిణామాలతో 15 నెలలకే ఈ ప్రభుత్వం కూలింది.

దేవెగౌడ కుటుంబంతో విభేదాలున్న సిద్ధరామయ్య ఈ సంకీర్ణ ప్రభుత్వంపై మొదటి నుండి అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయన అనుచరులుగా ఉన్న ఎమ్మేల్యేలు బీజేపీ పక్షాన చేరారనే విమర్శలొచ్చాయి. ఈ రాజకీయ పరిణామాల మధ్య ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం కూడా జరిగినా, ఆయన వాటన్నింటినీ ఖండిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్‌ గెలుపును తన భుజస్కందాలపై వేసుకున్నారు.

బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారైన సిద్ధరామయ్య సొంతపార్టీలో మాత్రం వర్గపోరును ఎదుర్కొంటున్నారు. ఆయన ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కాదని, ఇతర పార్టీ నుండి వచ్చిన ఆయనకు ఇప్పటికే పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు పార్టీలో అంతర్గతంగా దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డీ.కే.శివకుమార్‌ వర్గం నుండి సవాళ్లు ఎదురవుతున్నాయి.

మే 10న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంటుందని పలు సర్వేలలో వెల్లడికావడంతో పార్టీలో ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర పోటీ నెలకొంది. సిద్ధరామయ్య, శివకుమార్‌ వర్గాలుగా పార్టీలో చీలికలున్నా ఎన్నికల్లో ఐకమత్యంగా పోరాడడం ఆ పార్టీకి సానుకూలమైన అంశం. దేశ వ్యాప్తంగా బలహీన పడుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్‌ నిలబడడానికి ప్రధానంగా ఆర్థిక వనరులను సమకూరుస్తున్న శివకుమార్‌ను ఈ సారి కచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన అనుచరులు పట్టుబట్టడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

‘సిద్ధు’కు చివరి ఎన్నికలు

కాంగ్రెస్‌లో గుంభనంగా ఉన్న అంతర్గత వ్యవహారాలను గమనిస్తున్న సిద్ధరామయ్య వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఆర్థికంగా బలమైన శివకుమార్‌ నుండి గట్టిపోటీ తప్పదని భావిస్తున్న సిద్ధరామయ్య పార్టీ అధిష్టానం, కిందస్థాయి కార్యకర్తల నుండి సానుభూతిని కోరుకుంటూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. అయినా పార్టీ అధిష్టానం నుండి సానుకూల స్పందన లభించలేదు. ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తే పార్టీ అధిష్టానం ఆమోదించలేదు.

రాజకీయ సమీకరణాల దృష్ట్యా ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న బాదామిలో గెలుపుపై అపనమ్మకంతో ఉన్న ఆయన కోలార్‌తోపాటు ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్న వరుణ నుండి పోటీ చేయాలని భావించారు. అయితే పార్టీ అధిష్టానం ఆయనకు 60వేల మంది లింగాయత్‌ ఓటర్లున్న వరుణ నియోజకవర్గంలో టికెట్‌ ఇచ్చింది. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠం కంటే ముందే మొదటి అడుగులోనే కఠిన పరీక్ష ఎదుర్కోనున్నారు.

సిద్ధరామయ్యకు హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఒకవైపుంటే, మరోవైపు ఆయనకు పార్టీలో ప్రత్యర్థిగా భావిస్తున్న డీ.కే.శివకుమార్‌కు హిందూ సానుభూతిపరుడనే పేరుంది. పార్టీలో ‘శివ’ ధనస్సును ‘రామయ్య’ ఎలాంటి ప్రణాళికలతో విరుస్తాడో చూడాలి. మే 13న వెలువడే ఫలితాల్లో కాంగ్రెస్‌ సంపూర్ణ మెజార్టీ సాధిస్తే సిద్దరామయ్యకు ఢోకా ఉండకపోవచ్చు. ఒకవేళ పీపుల్స్‌పల్స్‌ సర్వేలో వెల్లడయినట్టు హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే జేడీ(ఎస్‌)తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధరామయ్య ముందుకు రాకపోవచ్చు.

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న సిద్ధరామయ్య పేరిట ‘లీడర్‌ రామయ్య’ బయోపిక్‌ తీయాలని నిర్ణయంతో గత శ్రీరామనవమి రోజున ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఒకవైపు బీజేపీ సిద్ధరామయ్యను హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేస్తుంటే మరోవైపు శ్రీరామనవమి రోజున ఆయన బయోపిక్‌ పోస్టర్‌ విడుదల రాజకీయ వ్యూహాల్లో భాగమే. ప్రజానేత సిద్ధరామయ్య బయోపిక్‌ ఎన్నికల్లో తమకు ప్రయోజనం కలిగిస్తుందని కాంగ్రెస్‌ భావిస్తుంది. ఒకవైపు బలమైన బీజేపీని ఎదుర్కొంటూ, మరోవైపు పార్టీలో అంతర్గత పోరును కట్టడిచేస్తూ సిద్ధరామయ్య తన చిరకాల కోరిక తీర్చుకుంటారో లేదో వేచిచూడాలి.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

సెల్‌నెం: 9949372280

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ రీసెర్చర్ ఐవీ మురళీకృష్ణ శర్మ

(డిస్‌క్లెయిమర్: విశ్లేషణలో తెలియపరిచిన అభిప్రాయాలు వ్యాసకర్త, లేదా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థ వ్యక్తిగతం. హెచ్‌టీ తెలుగుతో వీటికి సంబంధం లేదు)

తదుపరి వ్యాసం