తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bjp Attacks Tharoor : వివాదంలో శశిథరూర్‌ మ్యానిఫెస్టో

BJP attacks Tharoor : వివాదంలో శశిథరూర్‌ మ్యానిఫెస్టో

HT Telugu Desk HT Telugu

01 October 2022, 13:26 IST

    • BJP attacks Tharoor కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో నిలిచిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌  మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అధ్యక్ష ఎన్నిక కోసం థరూర్ ప్రత్యేకంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో తీవ్రమైన తప్పిదం చోటుచేసుకుంది. భారత మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్‌, లడాఖ్‌లు లేకపోవడంతో థరూర్‌పై బీజేపీ విమర్శల దాడి ప్రారంభించింది. 
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన శశిథరూర్‌
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన శశిథరూర్‌ (HT_PRINT)

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన శశిథరూర్‌

BJP attacks Tharoor కాంగ్రెస్ అధ‌్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతోన్న శశిథరూర్‌కు పోటీకి ముందే బీజేపీ నుంచి దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. థరూర్‌ మేనిఫెస్టోలో ప్రచురించిన భారత మ్యాప్‌లో జమ్మూకశ్మీర్‌, లడాఖ్‌ లేకపోవడం దుమారానికి కారణమైంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ట్విటర్‌లో థరూర్‌కు వ్యతిరేకంగా ట్రోల్ నడవడంతో స్పందించిన శశిథరూర్‌ జరిగిన తప్పునకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

''మేనిఫోస్టోలో ప్రచురించిన మ్యాప్‌పై ట్రోల్స్‌ తుపాను కొనసాగడంపై విచారం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ ఇలాంటి పనులు చేయరని సోషల్‌ మీడియా బాధ్యతలు చూస్తోన్న ఓ చిన్న వాలంటీర్ల బృందం పొరపాటు చేసినట్లు థరూర్‌ ప్రకటించారు. విషయం వెలుగు చూసిన వెంటనే దాన్ని సవరించినట్లు చెప్పారు. ఈ తప్పుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. తమ మానిఫెస్టో ఇదిగో'' అంటూ తన ట్విటర్‌లో హిందీ, ఆంగ్ల భాషల్లో రూపొందించిన మేనిఫెస్టో కాపీలను జత చేశారు.

ఏం జరిగిందంటే….

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న శశిథరూర్‌ గత శుక్రవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.అందులో మేనిఫెస్టో బుక్‌లెట్‌లో భారత చిత్రపటంలో జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు లేవు. కాంగ్రెస్‌ యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే ఈ ఫొటోలో కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలు లేకపోవడం వివాదాస్పదమైంది. ఈ తప్పిదాన్ని కొందరు సోషల్‌మీడియా యూజర్లు గమనించి ట్వీట్లు చేయడంతో ఇది కాస్త వివాదానికి దారితీసింది.

థరూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పొరపాటును గమనించిన థరూర్‌ కార్యాలయం వెంటనే దాన్ని సరిదిద్దుకుంది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌తో ఉన్న అఖండ భారత చిత్రపటంతో కొత్త మేనిఫెస్టో విడుదల చేసింది.

థరూర్‌ ఈ తరహా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2019 డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనల గురించి ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అందులోనూ భారత చిత్రపటానికి సంబంధించి ఇలాంటి తప్పిదమే దొర్లింది. అప్పుడు థరూర్‌పై భాజపా నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో ఆ ట్వీట్‌ను ఆయన తొలగించారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి శశి థరూర్‌తో పాటు సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే, ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠి కూడా నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం వీరి నామినేషన్‌ పత్రాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పోటీలో ఉండేది ఎవరన్నది తేలుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8వ తేదీ వరకు గడువు ఉంది. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబరు 17న ఎన్నిక నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్టోబరు 19న ఫలితాన్ని వెల్లడించనున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం