తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Border Crossing: యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వేలాది భారతీయులు

US border crossing: యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వేలాది భారతీయులు

HT Telugu Desk HT Telugu

03 November 2023, 10:17 IST

  • US border crossing: గత సంవత్సర కాలంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన సుమారు 97 వేల మంది భారతీయులను (indians crossing US border illegally) సరిహద్దుల్లో యూఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

US border crossing: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారతీయుల (indians crossing US border illegally) సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, 2019 - 2020 సంవత్సరంతో పోలిస్తే, యూఎస్ లోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన భారతీయుల సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరిగింది.

97 వేల మంది..

అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన భారతీయుల సంఖ్య 96,917. వీరిని సరిహద్దుల వద్ద యూఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2019 - 2020 సంవత్సరంలో ఇలా యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించి అరెస్టైన భారతీయుల సంఖ్య కేవలం 19,883. ఈ డేటాను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (UCBP) అధికారులు వెల్లడించారు.

మెక్సికో, కెనడా సరిహద్దుల నుంచి..

ప్రధానంగా కెనడా, మెక్సికో సరిహద్దుల నుంచి ఎక్కువగా భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించి, అరెస్టైన 96,917 మంది భారతీయుల్లో.. కెనడా బోర్డర్ నుంచి 30,010 మంది, మెక్సికో సరిహద్దుల నుంచి 41,770 మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించినవారే కావడం గమనార్హం. యూఎస్ లోకి అక్రమంగా వెళ్లిన ఇతర భారతీయులను చూసి చాలా మంది తాము కూడా అలా వెళ్లాలనుకుని అధికారులకు దొరికిపోయారు.

పెరుగుతున్న సంఖ్య..

ఇప్పటివరకు మెక్సికో, గ్వాంటెమాలా, హోండురస్, ఈక్వెడార్ దేశాల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఇలా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే ఇండియా, ఇతర దేశాల వారి సంఖ్య బాగా పెరిగింది. కాగా, సింగిల్ గా యూఎస్ లోకి అక్రమంగా ఎంటర్ కావాలనుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. గత సంవత్సర కాలంలో ఇలా సింగిల్ గా యూఎస్ లోకి అక్రమంగా వెళ్లాలనుకున్నవారు దాదాపు 84 వేల మంది. వీరు కాకుండా, పెద్దల తోడు లేని 730 మంది పిల్లలు కూడా యూఎస్ లోకి అక్రమంగా వెళ్లాలనుకుని పోలీసులకు దొరికిపోయారు.

తదుపరి వ్యాసం