తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ గ్రూప్ పై కిడ్నీ రాకెట్ ఆరోపణలు; తీవ్రంగా ఖండించిన అపోలో గ్రూప్

Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ గ్రూప్ పై కిడ్నీ రాకెట్ ఆరోపణలు; తీవ్రంగా ఖండించిన అపోలో గ్రూప్

HT Telugu Desk HT Telugu

06 December 2023, 11:24 IST

  • Apollo Hospitals: ప్రముఖ హాస్పిటల్స్ గ్రూప్ అపోలో హాస్పిటల్స్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. పేదలను ప్రలోభపెట్టి అక్రమంగా వారి కిడ్నీలను సంపన్న కిడ్నీ రోగులకు మారుస్తున్నారని ఆ ఆసుపత్రి గ్రూప్ పై ఆరోపణలు వచ్చాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

ప్రతీకాత్మక చిత్రం

Apollo Hospitals: మయన్మార్ కు చెందిన పేద గ్రామీణ యువతను ప్రలోభ పెట్టి వారి కిడ్నీలను, అదే దేశానికి చెందిన సంపన్న కిడ్నీ రోగులకు అమర్చే కుట్ర అపోలో హాస్పిటల్ లో కొనసాగుతోందని టెలీగ్రాఫ్ (యూకే) పత్రిక ఒక సంచలన కథనం ప్రచురించింది. అందుకు ఆ పేద మయన్మార్ యువతకు పెద్ద మొత్తంలో డబ్బు అందజేస్తున్నారని ఆరోపించింది.

చట్ట వ్యతిరేకం, అనైతికం..

కిడ్నీ మార్పిడి ప్రక్రియ నిబంధనలకు, జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు లోబడి సాగాలి. అయితే, అందుకు విరుద్ధంగా అపోలో ఆసుపత్రుల్లో మయన్మార్ యువత కిడ్నీలను అదే దేశానికి చెందిన సంపన్నులకు అమర్చే కార్యక్రమం కొనసాగుతుందని టెలీగ్రాఫ్ (Telegraph UK)) ప్రధానంగా ఆరోపించింది. మయన్మార్ యువతను ఢిల్లీకి రప్పించి, వారిని డబ్బుతో ప్రలోభపెట్టి, వారు తమ కిడ్నీలను అమ్ముకునేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. ఆ కిడ్నీలను మయన్మార్ కు చెందిన, విదేశాల్లో, ముఖ్యంగా యూకేలో స్థిరపడిన సంపన్నులకు అమరుస్తున్నారని విమర్శించింది. ఇది చాలా పెద్ద వ్యాపారమని, ఈ కార్యక్రమంలో ఏజెంట్ గా వ్యవహరించే వ్యక్తిని ఉదహరిస్తూ, టెలీగ్రాఫ్ వ్యాఖ్యానించింది.

ఇలా చేస్తారు..

టెలీగ్రాఫ్ పత్రిక కథనం ప్రకారం.. ఈ కిడ్నీ రాకెట్ చాలా పకడ్బందీగా సాగుతుంది. ముందుగా, కిడ్నీ మార్పిడి అవసరమైన వ్యక్తి బ్లడ్ గ్రూప్ కు సరిపోయే మయన్మార్ కు చెందిన గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద కిడ్నీ దాతను గుర్తిస్తారు. అతడిని డబ్బుతో ప్రలోభపెడ్తారు. అతడు అంగీకరించిన తరువాత, కిడ్నీ అవసరమైన వ్యక్తి, కిడ్నీ దాత కుటుంబ సభ్యులేనని నిర్ధారించే తప్పుడు పత్రాలను సిద్ధం చేస్తారు. తద్వారా చట్ట పరమైన అడ్డంకులను అధిగమిస్తారు.

చట్టం ఏం చెబుతోంది?

భారత్ లోని ఇండియాస్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ ప్రకారం రోగి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, మనవలు, మనవరాళ్లు మాత్రమే శరీర అవయవాలను డొనేట్ చేయవచ్చు. మానవీయ కారణంతో మినహాయిస్తే, ఇతరులెవరూ డొనేట్ చేయడానికి వీలు లేదు.

Apollo Hospitals reacts: అపోలో ఆసుపత్రి ఖండన

ఈ ఆరోపణలను అపోలో హాస్పిటల్స్ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు తమను షాక్ కు గురి చేశాయని వ్యాఖ్యానించింది. తమ గ్రూప్ ఆసుపత్రుల్లో ఎలాంటి అనైతిక, చట్ట వ్యతిరేక వైద్య కార్యకలాపాలకు పాల్పడడం లేదని స్పష్టం చేసింది. అయినా, ఈ ఆరోపణలపై అంతర్గత విచారణకు ఆదేశించామని తెలిపింది. ఈ కిడ్నీ రాకెట్ లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు తన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయన్న ఆరోపణలను డాక్టర్ సందీప్ గులేరియా ఖండించారు. అవి నిరాధార, హాస్యాస్పద ఆరోపణలు అన్నారు. గతంలో, 2016 లో కూడా డాక్టర్ గులేరియాపై ఈ అక్రమ కిడ్నీ మార్పిడి ఆరోపణలు రావడం గమనార్హం.

ప్రభుత్వ స్పందన

భారత్ లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్ గ్రూప్స్ లో ఒకటైన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ పై తీవ్రమైన అక్రమ కిడ్నీ మార్పిడి ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ అయిన ఇంద్ర ప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ పై వచ్చిన ఈ ఆరోపణలపై విచారణ జరపాలన కేంద్ర హోం శాఖ పరిధిలో ఉండే ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (NOTTO)’ ఆదేశించించింది.

తదుపరి వ్యాసం