తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Ukraine Crisis | రష్యా నిర్ణయంపై ఇండియా ఆందోళన

Russia Ukraine Crisis | రష్యా నిర్ణయంపై ఇండియా ఆందోళన

Hari Prasad S HT Telugu

22 February 2022, 8:54 IST

    • రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో భారత రాయబారి తిరుమూర్తి ఈ అంశంపై మాట్లాడారు.
ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సమావేశంలో మాట్లాడుతున్న భారత రాయబారి తిరుమూర్తి
ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సమావేశంలో మాట్లాడుతున్న భారత రాయబారి తిరుమూర్తి (HT_PRINT)

ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సమావేశంలో మాట్లాడుతున్న భారత రాయబారి తిరుమూర్తి

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని ఇండియా అభిప్రాయపడింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కోసం దౌత్యమార్గాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదుల ప్రాంతాలైన డోనెస్క్‌, లుడాన్‌స్క్‌లను రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడంపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. 

ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి అయిన టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ఉద్రిక్తతలను తగ్గించడానికే ప్రాధాన్యమివ్వాలని అన్నారు. దౌత్యమార్గంలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తేల్చి చెప్పారు. మిన్‌స్క్‌ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. 

మిలిటరీ ఉద్రిక్తతలు కాకుండా చర్చలకు ప్రాధాన్యమివ్వాలని తిరుమూర్తి చెప్పారు. ఉక్రెయిన్‌లోని భారత పౌరుల భద్రతే తమకు ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్‌లో 20 వేలకుపైగా భారత పౌరులు, విద్యార్థులు ఉన్నారని, వాళ్లు సురక్షితంగా ఉండేలా చూడటమే తమ మొదటి ప్రాధాన్యమని అన్నారు. అన్ని పక్షాలు సంయమనం పాటించి, దౌత్యమార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని తిరుమూర్తి సూచించారు.

తదుపరి వ్యాసం