తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nupur Sharma | ఎవరు ఈ నూపూర్​ శర్మ? అసలేంటి వివాదం?

Nupur Sharma | ఎవరు ఈ నూపూర్​ శర్మ? అసలేంటి వివాదం?

HT Telugu Desk HT Telugu

06 June 2022, 17:14 IST

    • Nupur Sharma comment | మహమ్మద్​ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు నూపూర్​ శర్మ. ఆమెను బీజేపీ సస్పెండ్​ చేసింది. అసలు ఎవరు ఈ నూపూర్​ శర్మ?
నూపూర్​ శర్మ
నూపూర్​ శర్మ (Twitter)

నూపూర్​ శర్మ

Nupur Sharma comment | 'నూపూర్​ శర్మ..' ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇంత వరకు వార్తల్లో పెద్దగా కనిపించని నూపూర్​ శర్మ.. ఇప్పుడు పత్రికల్లోని మొదటి పేజీల్లో దర్శనమిస్తున్నారు. ఈమె వల్ల అనేక దేశాల ముందు భారత ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకి.. అసలేవరు ఈ నూపూర్​ శర్మ?

లాయర్​.. టు పొలిటీషియన్​..

నూపూర్​ శర్మ వృత్తి రిత్యా ఓ న్యాయవాది. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి అమె సేవలందిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన నూపూర్​ శర్మ.. 2011లో లండన్​ స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్​ నుంచి ఎల్​ఎల్​ఎం పొందారు. 2009-2010 మధ్య కాలంలో 'టీచ్​ ఫర్​ ఇండియా'కు అంబాసిడర్​గా కూడా పనిచేశారు.

Nupur Sharma BJP | చదువుకునే రోజుల్లోనే.. నూపూర్​ శర్మ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. కాగా.. ఆమె రాజకీయ జీవితం మాత్రం 2008లో మొదలైంది. నాడు.. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్​ యూనియన్​ అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. బీజేపీలోని యువజన విభాగంలో పని చేశారు.

2015 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​పై పోటీ చేసి ఓడిపోయారు.

వివాదాస్పద వ్యాఖ్యలు..

గత శుక్రావారం.. ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా.. దేశంలో మతపరమైన ఘర్షణలు ఇటీవల ఆందోళనకర రీతిలో పెరిగిపోయాయి. ఇండియాలో పరిస్థితులు, మైనారటీల సమస్యలపై ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఈ సమయంలోనే.. బీజేపీకి చెందిన నేత ముస్లింలపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. గత ఆదివారం ఓ టీవీ డిబేట్​లో పాల్గొన్న బీజేపీ నేత నూపూర్​ శర్మ.. మహమ్మద్​ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి, ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు ఉన్నాయి.

India Prophet controversy | నూపూర్​ శర్మ వ్యాఖ్యలపై నిరసనలు భగ్గుమన్నాయి. దేశంలోని విపక్షాలతో పాటు గల్ఫ్​ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేసి.. బీజేపీ నేతల వ్యవహారాన్ని తప్పుబట్టాయి. నూపూర్​ శర్మ వ్యాఖ్యలు.. కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించిన సౌదీ అరేబియా.. అన్ని మతాలను, నమ్మకాలను గౌరవించాలని హితవు పలికింది. ఖతార్​, కువైట్​, ఇరాన్​ దేశాలు.. భారత రాయబారులకు సమన్లు జారీ చేసి.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించాయి. అంతేకాకుండా.. గల్ఫ్​ దేశాల్లో భారత వస్తువులపై నిషేధం విధించాలని డిమాండ్లు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గల్ఫ్​తో వాణిజ్యపరమైన బంధాన్ని పెంచుకునే దిశగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఖతార్​లో పర్యటిస్తున్న వేళ ఈ ఘటన జరగడం ఇప్పుడు భారత అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచ దేశాల ఆగ్రహావేశాల మధ్య.. భారత్​ ప్రభుత్వం వైఖరి.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలాగే ఉంది! పరిస్థితులను అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఘటనకు గల కారణమైన నూపూర్​ శర్మను సస్పెండ్​ చేసింది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం