తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  తాతా నువ్వు కేక.. 102ఏళ్ల వయస్సులోనూ..

తాతా నువ్వు కేక.. 102ఏళ్ల వయస్సులోనూ..

Sharath Chitturi HT Telugu

04 March 2022, 15:26 IST

    • నేటి యువత.. రెండు ఫ్లోర్లు ఎక్కేసరికే.. ‘అమ్మో.. కాళ్లు నొప్పులు’ అనేస్తోంది. అలాంటిది ఓ 102ఏళ్ల వృద్ధుడు.. పరుగులో రికార్డ్​ సృష్టించారు. థాయ్​లాండ్​లో జరిగిన పోటీల్లో.. 100మీటర్ల పరుగు పందేన్ని కేవలం 27.08 సెకన్లలో ముగించి అందరిని ఆశ్చర్యపరిచారు.
సవాంగ్​ జనప్రామ్​
సవాంగ్​ జనప్రామ్​ ( Reuters)

సవాంగ్​ జనప్రామ్​

102 year old man running | థాయ్​లాండ్​కు చెందిన 102ఏళ్ల సవాంగ్ జనప్రామ్ అనే వృద్ధుడు.. తన పరుగుతో దుమ్మురేపుతున్నారు. ఆ వయస్సులోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. తన వయస్సు వారితో జరిగిన పోటీల్లో.. 100మీటర్ల పరుగును 27.08 సెకన్లలో పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

థాయ్​లాండ్​లోని సముట్​ సొంగ్​క్రమ్​ రాష్ట్రంలో గత వారం.. థాయ్​లాండ్​ మాస్టర్స్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​ జరిగింది. 100-105 ఏళ్ల వయస్సున్న వారి విభాగంలో సవాంగ్​ పోటీచేశారు. ఆ పరుగులో గోల్డ్​ మెడల్​ సాధించారు.

థాయ్​లాండ్​లోనే అతిపెద్ద వయస్సున్న స్ప్రింటర్​గా జనప్రామ్​కు గుర్తింపు ఉంది. ఇప్పటికి ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. ఎన్నో పతకాలను వెనకేసుకున్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇక తాజా పోటీలకు సంబంధించిన వీడియోను ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ.. ట్విట్టర్​లో షేర్​ చేసింది.

"క్రీడలంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే.. వాటి వల్లే నేను బలంగా ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఎంత శ్రమిస్తే.. అంత ఆకలేస్తుంది. అందుకే నేను చాలా ఎక్కువ తింటాను," అని జనప్రామ్​ చెప్పుకొచ్చారు.

Thailand masters athletics championships | పరుగు పందేలతో పాటు జావెలిన్​, డిస్కస్​ త్రో ఈవెంట్​లలో కూడా జనప్రామ్​ పాల్గొననున్నారు. వాటిల్లో తన సత్తా చాటాలని భావిస్తున్నారు. అందుకు తగ్గ కసరత్తులు కూడా చూస్తున్నారు.

జనప్రామ్​ ఫిట్​నెస్​పై ఆయన కుమార్తె, 70ఏళ్ల సిరిపాన్​ స్పందించారు.

"మా నాన్న ఎప్పుడూ పాజిటివ్​గానే ఆలోచిస్తారు. అందుకే ఆయన మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇక భౌతిక ఆరోగ్యం గురించి చెప్పాలంటే.. ఆయన ఇప్పడే చాలా బలంగా ఉన్నారు. ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు," అని సిరిపాన్​ వెల్లడించారు.

102 year old man runs race | 25ఏళ్లు వచ్చేసరికే నేటి యూవత ఏ పనిచేయాలన్నా చేతులెత్తేస్తోంది. ఇక నడక, పరుగు వంటి వ్యాయామాలతో కూడిన విషయాలకు చాలా దూరంగా ఉంటోంది. రెండు ఫ్లోర్లు ఎక్కేసరికే.. 'ఆమ్మో.. నడుము నొప్పి, అమ్మో కాళ్ల నొప్పులు' అని బాధపడిపోతోంది. అలాంటిది 102ఏళ్లలో ఈ వృద్ధుడు పరుగులో గోల్డ్​ మెడల్​ సాధించడం చాలా గొప్ప విషయమే అని చెప్పాలి.

జనప్రామ్​ రికార్డులు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. చూసిన వారందరూ.. 'వావ్​' అంటున్నారు.

అయితే వృద్ధుల పోటీపై నిర్వాహకులు సైతం స్పందించారు. పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య ప్రతియేటా పెరుగుతోందంటున్నారు. 1996లో కేవలం 300మంది ఉండేవారని.. ఇక ఇప్పుడు 35-102ఏళ్ల మధ్య వయస్కులు.. 2000 కన్నా ఎక్కువ ఉంటారని వివరించారు.

తదుపరి వ్యాసం