తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Credit Limit Increase | క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం మంచిదేనా?

Credit Limit increase | క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం మంచిదేనా?

11 February 2022, 9:12 IST

  • Credit limit increasing | క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతున్నాం.. అనుమతించండి అంటూ తరచూ మీ క్రెడిట్ కార్డు సంస్థలు మెసేజ్‌లు పంపిస్తుంటాయి. కానీ దీనిపై మనలో అనేక భయాలు ఉంటాయి. పెంచుకోవాలా? వద్దా? పెంచుకుంటే లాభం ఏంటి? నష్టం ఏంటి?

క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభమేనా?
క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభమేనా? (unsplash)

క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభమేనా?

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని మెసేజ్ రాగానే ఆలోచనలో పడిపోయారా? స్థూలంగా చెప్పాలంటే లిమిట్ పెంచుకుంటే మంతచిదే. కానీ కంట్రోలింగ్ కెపాసిటీ చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డుపై క్రెడిట్ లిమిట్ పెంచడం వల్ల ప్రయోజనం ఏంటి? నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.

క్రెడిట్ లిమిట్ పెరిగితే ప్రయోజనాలు ఇవీ..

మన క్రెడిట్ స్కోరు ఎప్పుడు పెరుగుతుందంటే మన క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండి, మనం తక్కువగా వాడుకుంటే మన స్కోరు పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30 శాతానికి మించి మనం క్రెడిట్ వాడకూడదు. వాడితే మనం ఎక్కువగా రుణంపై ఆధారపడుతున్నామనే కదా. సో మన క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. ఇలాంటి సమయంలో మన క్రెడిట్ లిమిట్ పెరిగి, మన వాడకం అదేరీతిలో ఉంటే మనం బాధ్యతాయుతంగా వాడుతున్నట్టు లెక్క. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండి తక్కువగా వినియోగిస్తే ఆర్థిక సంస్థల దృష్టిలో మనం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టే. దీని వల్ల మన క్రెడిట్ స్కోరూ నిలకడగా ఉంటుంది. లేదా పెరుగుతుంది. కానీ తగ్గదు. ఈ రకంగా చూస్తే క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం ప్రయోజనమే.

రుణం దొరకడం చాలా సులభం..

మీరు బాధ్యతాయుతంగా ఖర్చు చేస్తూ, మీ సిబిల్ స్కోరు 700లకు పైగా ఉంటే ఆయా క్రెడిట్ కార్డు సంస్థలు లేదా బ్యాంకులు మీ క్రెడిట్ కార్డు వాడకాన్ని చూసి మీకు రుణాలు ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు క్రెడిట్ లిమిట్ ఒక రూ. 4 లక్షలు ఉందనుకుందాం. ఆయా క్రెడిట్ కార్డు సంస్థలు మీకు రూ. 10 లక్షల వరకు పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తాయి. క్రెడిట్ కార్డు వడ్డీ రేట్ల మీద కాదు. కేవలం పర్సనల్ లోన్ వడ్డీ రేట్లపైనే రుణాలు ఆఫర్ చేస్తాయి. అంటే మీ క్రెడిట్ లిమిట్‌కు అంత విలువ ఉందన్నమాట. ఈ రకంగా చూస్తే క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల మీ రుణ పరపతి పెరుగుతుంది. అవసరమైనప్పుడు ఇట్టే రుణం పొందుతారు.

ఎక్కువ సంఖ్యలో కార్డులు అవసరం ఉండదు

క్రెడిట్ కార్డు సంస్థలు అపరిమితంగా ఉన్నందున కార్డులు ఆఫర్ చేసే సంస్థల సంఖ్య ఎక్కువైపోయింది. వాటి ఆకర్షణకు లోనై పరిమితికి మించి వాడితే మన క్రెడిట్ స్కోరు డమాల్ అవుతుంది. అందువల్ల రెండు మూడు క్రెడిట్ కార్డులకు పరిమితమై బాధ్యతాయుతంగా ఖర్చు చేసుకుంటే స్కోరు పెరుగుతుంది. మీ ఆర్థిక సంస్థల వద్ద మీ పరపతి పెరుగుతుంది. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే మీ క్రెడిట్ లిమిట్ పెరిగితే మీకు ఎక్కువ సంఖ్యలో కార్డుల అవసరం లేదన్నట్టు.

ఆపదలో ఆదుకుంటుంది..

అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై లేదా ప్రమాదానికి గురై ఆస్పత్రి బారిన పడితే మీరు ఊహించని ఖర్చు అయినప్పుడు క్రెడిట్ కార్డు ఆదుకుంటుంది. అఫ్ కోర్స్.. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ క్రెడిట్ కార్డు అవసరం రాకపోవచ్చు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేనప్పుడు క్రెడిట్ కార్డే వాడాల్సి వస్తుంది. సో.. ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉంటే ఇలాంటి అత్యవసరాలకు ఉపయోగపడుతుంది.

రివార్డులు కూడా ఎక్కువే..

క్రెడిట్ కార్డు లిమిట్ ఎక్కువగా ఉండి, చాలా తక్కువ యుటిలైజేషన్ ఉంటే ఆయా క్రెడిట్ కార్డు సంస్థలు మీకు భారీ రివార్డులు ఆఫర్ చేస్తుంటాయి. మీరు వారి దృష్టిలో విలువైన కస్టమర్లు కాబట్టి, మీరు ఖర్చు చేసినా తిరిగి కట్టేస్తారు కాబట్టి మీరు వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, లేదా హోటళ్లు, విమాన టికెట్లు బుక్ చేసినప్పుడు ఎక్కువ రాయితీలు ఇస్తాయి. ఇవి రివార్డుల రూపంలో ఉంటాయి. మీ క్రెడిట్ లిమిట్ పెరిగినప్పుడు మీకు మీ క్రెడిట్ కార్డు స్థాయిని పెంచుతాయి. ఆయా విలువైన కార్డుల ద్వారా ఈ రాయితీలు కల్పిస్తాయి. మీకు ఎయిర్ పోర్ట లాంజ్‌లలో ఎక్కువసార్లు డైనింగ్ ఆఫర్ ఇవ్వడం వంటివి ఇందులో ఉంటాయి.

క్రెడిట్ కార్డు లిమిట్ పెరగడం వల్ల నష్టాలేంటి?

నష్టాలు నేరుగా ఉండవు. ఇవి మన బిహేవియర్‌ను బట్టి ఉంటాయి. అంటే మనం ఎక్కువ లిమిట్ ఉంది కదా అని ఎక్కువ ఖర్చు చేస్తే మన స్కోరు దెబ్బతింటుంది. ఎంత లిమిట్ ఉన్నా 30 శాతానికి మించకుండా వాడుకుంటే మీ స్కోరు పెరుగుతుంది. అత్యవసర సమయాల్లో ఎలాగూ తప్పదు. కానీ మన వద్ద ఆదాయం లేకున్నా క్రెడిట్ లిమిట్ ఉందని విలాసాలకు అలవాటు పడి వాటిని అదే నెలలో కట్టలేకపోతే వచ్చే నెల నుంచి మీరు క్రెడిట్ కార్డు అసలు వడ్డీ దెబ్బ రుచి చూస్తారు. భారీ వడ్డీ రేటు వడ్డింపునకు గురవుతారు.

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచండని మీరు అడగకూడదు. వాళ్లు అన్నీ చెక్ చేసి మీ ఎలిజిబులిటీని బట్టి వాళ్లే ఆఫర్ చేస్తుంటారు. అప్పుడు పెంచుకోవడం ఉత్తమం. అంతేాగానీ పెంచండని అడిగితే మీ క్రెడిట్ స్కోరు తగ్గే ప్రమాదం ఉంది. క్రెడిట్ కోసం మీరు ప్రయత్నించినప్పుడల్లా మీ స్కోరు తగ్గతుందని గుర్తుంచుకోండి.

క్రెడిట్ కార్డు ఫ్రాడ్ జరిగితే మీరు మీ క్రెడిట్ లిమిట్ మేర నష్టపోతారు. దీని నివారణకు మీరు ఆయా క్రెడిట్ కార్డులు సూచించే జాగ్రత్తలు తప్పకపాటించాలి. క్రెడిట్ కార్డు యూసేజ్‌ను తగిన రీతిలో మేనేజ్ చేయాలి.

 

తదుపరి వ్యాసం