తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : కలిసి ఉన్నా విడిగా ఉండటం కంటే.. విడిపోయి కలిసి ఉండటం బెటర్

Monday Motivation : కలిసి ఉన్నా విడిగా ఉండటం కంటే.. విడిపోయి కలిసి ఉండటం బెటర్

Anand Sai HT Telugu

08 April 2024, 5:00 IST

    • Monday Motivation On Relationship : చాలా మంది బంధంలో విడిపోదాం అనుకుంటారు. కానీ ఏవేవో కారణాలతో కలిసే ఉంటారు. అయితే కలిసి ఉన్నా విడిపోయినట్టుగా వేరు వేరుగానే ఉంటారు.
సోమవారం మోటివేషన్
సోమవారం మోటివేషన్ (Unsplash)

సోమవారం మోటివేషన్

ఒక బంధంలో విడిపోవడం వల్ల కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని విషపూరిత సంబంధాలలో విడిపోవడం మాత్రమే హాయిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ సంబంధంలో ప్రేమ కంటే మోసం, బాధ, హింస, అభద్రత ఎక్కువ. అలాంటి బంధంలో ఉంటే రోజూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కానీ మనశ్శాంతి ఉండదు. మీ సంబంధం ఇలాగే ఉంటే అది విషపూరిత సంబంధం, దాని నుంచి దూరంగా ఉండటం బెటర్.

రోజూ గొడవపడని జంట ఉండదు. కొందరు రోజూ గొడవపడరు.. కానీ దూరం దూరంగానే ఉంటారు. శారీరక హింస, మానసిక హింస అనుభవిస్తారు. కొన్నిసార్లు విడిచిపెట్టి వెళ్లిపోదాం అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ రావాలి అనిపిస్తుంది. అయితే మీ బంధం కలిసి ఉన్నా విడిగా ఉందా అని ఆలోచించాలి. ఈ రకమైన సంబంధం విషపూరిత సంబంధం, అటువంటి సంబంధానికి దూరంగా ఉండటం మంచిది.

మీరు ప్రేమించిన వారి కోసం అన్ని త్యాగాలు చేసినా వాళ్ల నుంచి ప్రేమ లభించకపోతే మీ ఎమోషన్ వృథా అన్నట్టే. ప్రేమ కోసం కుటుంబాన్ని, ఆస్తిని, హోదాను త్యాగం చేసేవాళ్లను చూస్తాం. అయితే ఆ వ్యక్తి కోసం మీరు ఎంతో త్యాగం చేసినప్పటికీ ఆ వ్యక్తి మీ పట్ల ప్రేమగానో, గౌరవంగానో మాట్లాడకపోతే విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవాలి.

మీరు ప్రతిసారీ బ్రేకప్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ సంబంధంలో మీరు సుఖంగా లేరని అర్థం. మన భావాలను గౌరవించడం లేదని, మనల్ని ప్రేమించడం లేదని అర్థం. అయితే ఇలాంటి రిలేషన్ షిప్ వదిలివేయడం మంచిది. మనం తరచూ ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యక్తి మన హృదయానికి దగ్గరగా లేరని అనుకోవాలి. అది ప్రేమ కాదు కాబట్టి అలాంటి బంధం నుంచి బయటపడితే ఇద్దరికీ మేలు జరుగుతుంది.

మనం ఎంతగానో విశ్వసించే వ్యక్తి మోసం చేసినా వారి మోసం గురించి మీకు తెలిసి మీకు క్షమాపణలు చెప్పి, అదే తప్పును పదే పదే చేస్తే వారికి దూరంగా ఉండాలి. లేకపోతే మీరు చాలా మానసికంగా బాధపడవలసి ఉంటుంది. రిలేషన్ షిప్ లో నిబద్ధత లేకపోతే అలాంటి రిలేషన్ షిప్ లో కొనసాగడం బాధ తప్ప మరేమీ మిగలదు.

మీరు ప్రేమించిన వ్యక్తితో భవిష్యత్ ప్రణాళికలు లేకుంటే కచ్చితంగా ఆలోచించాలి. మీరు ప్రేమికులుగా మారితే భవిష్యత్తు గురించి కలలు కంటారు. కానీ మీరు భవిష్యత్ ప్రణాళికలలో లేరని మీకు తెలిసినప్పుడు, అలాంటి సంబంధంలో కొనసాగడం గురించి ఆలోచించడం కూడా చేయాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు అలాంటి సంబంధం గురించి జాగ్రత్తగా ఉండాలి. బంధం మెుదలైనప్పుడు భవిష్యత్ గురించి కూడా ఆలోచిస్తారు. హ్యాపీగా బ్రతకాలని ప్రణాళికలు వేస్తారు. అలాంటప్పుడు దూరంగా ఉండటం మంచిది.

మనం ఎంతగానో ఇష్టపడే వృత్తిని మన భాగస్వామి గౌరవించనప్పుడు వారి గురించి ఆలోచించాలి. మన భావాలను గౌరవించరు, చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. అలాంటి సంబంధం గురించి జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారితో రిలేషన్ షిప్ కొనసాగించాలా వద్దా అని ఆలోచిస్తే మంచిది.. లేకుంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.

చివరగా చెప్పేది ఏంటంటే.. ఏదైనా బంధంలో కలిసి ఉన్నా విడిగా ఉండటం కంటే.. విడిపోయి అప్పుడప్పుడు శ్రేయభిలాషిలా కలుస్తూ హ్యాపీగా ఉండటం ఇద్దరి జీవితాలకు మంచిది.

తదుపరి వ్యాసం