Adultery : అక్రమ సంబంధం పెట్టుకుంటే.. మహిళలను రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేస్తాము!
Taliban women Adultery : తాలిబన్లు.. మరో కఠిన నిర్ణయాన్ని అమలు చేసేందుకు రెడీ అయ్యారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలను రోడ్డు మీదకు తీసుకొచ్చి.. రాళ్లతో కొట్టి చంపుతామని ప్రకటించారు.
Women rights in Afghanistan : అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కుల వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో.. తాలిబన్లు మరో సంచలన ప్రకటన చేశారు. వివాహేతర సంబంధాలు పెట్టుకునే మహిళలను.. బహిరంగంగా, రోడ్ల మీదకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేస్తామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు.. తాలిబన్ సుప్రీమో.. ముల్లా హిబాతుల్లా అఖుంద్జాదా.. టీవీల్లో వాయిస్ మెసేజ్ ఇచ్చారు.
'రోడ్ల మీద రాళ్లతో కొట్టి చంపేస్తాము..'
అంతర్జాతీయ సమాజంలో ఉన్న మహిళా హక్కులు.. తాలిబన్లు పాటించే కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని అఖుంద్జాదా ఆరోపించారు. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్య ఆలోచనలపై తాలిబన్లు పోరాడతారని పేర్కొన్నారు.
"పాశ్చాత్య ప్రజలు మాట్లాడుతున్న మహిళా చట్టాలు.. అఫ్గాన్ మహిళలకు అవసరమా? వాళ్లందరు షరియాకు విరుద్ధం. పాశ్చాత్య దేశాలపై 20ఏళ్ల పాటు పోరాడి మేము విజయం సాధించాము. ఆ పోరాటం ఇంకా ముగియలేదు. మేము కూర్చు టీ తాగుతూ ఉండిపోము. షరియాను మళ్లీ ఈ భూమిపైకి తీసుకొస్తాము. కాబుల్‌ని మా వశం చేసుకున్నంత మాత్రాన.. పోరాటం ఆగినట్టు కాదు. షరియా చట్టాలను కచ్చితంగా తీసుకొస్తాము," అని అఖుంద్జాదా తెలిపారు.
Taliban latest restriction on women : "మహిళలను రాళ్లతో కొట్టి చంపితే, మహిళా హక్కుల ఉల్లంఘన అని మీరు అంటారు. కానీ దీనిని మేము త్వరలోనే అమలు చేస్తాము. అక్రమ, వివాహేతర సంబంధాలు పెట్టుకునే మహిళలను రోడ్డు మీదకు తీసుకొస్తాము. వాళ్లని రాళ్లతో కొట్టి చంపేస్తాము," అని వాయిస్ మేసేజ్‌లో తాలిబన్ సుప్రీమో ప్రకటించారు.
తాలిబన్ల పాలనలో ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న మహిళలు.. తాజా ప్రకటనతో మరింత భయపడిపోతున్నారు. మరోవైపు.. అరాచక చట్టాలను దూరం పెట్టాలని పాశ్చాత్య దేశాలు చెబుతున్నా.. తాలిబన్లు మాత్రం వినడం లేదు. ఎప్పటికప్పుడు కఠిన, అమానవీయ చట్టాలను అమలు చేస్తూ, ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నారు.
Taliban latest news : "ఒక మహిళగా.. అఫ్గానిస్థాన్‌లో నాకు భద్రత లేదనిపిస్తోంది. ప్రతి రోజు ఉదయం.. నోటీసులు, ఆర్డర్లతో రోజు మొదలవుతుంది. చిన్న చిన్న ఆనందాలను కూడా దూరం చేసే విధంగా.. కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏదో జైలులో బతుకుతున్నట్టు మహిళలు భావిస్తున్నారు. మా ప్రపంచం చిన్నదైపోతోంది. తాలిబన్లు మా ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు," అని సివిల్ సర్వెంట్ తలా.. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.
2021లో మళ్లీ అఫ్గానిస్థాన్‌ని తన వశం చేసుకుంది తాలిబన్ బృందం. ఆ సమయంలో అక్కడి ప్రజలు హడలెత్తిపోయారు. భయపడాల్సిన అవసరం లేదని, అందరికి అనుకూలమైన పాలనను సాగిస్తామని హామీనిచ్చారు తాలిబన్లు. కానీ ఆ మాటల్లో నిజం లేదని తెలియడానికి ఎక్కువ రోజుల సమయం పట్టలేదు!
సంబంధిత కథనం