తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugadi Pachadi Recipe : ఉగాది పచ్చడి ఈజీగా తయారు చేసే విధానం ఇదే..

Ugadi Pachadi Recipe : ఉగాది పచ్చడి ఈజీగా తయారు చేసే విధానం ఇదే..

Anand Sai HT Telugu

09 April 2024, 6:00 IST

    • Ugadi Pachadi Recipe In Telugu : హిందూవులకు అతి ముఖ్యమైన పండుగ ఉగాది. ఈరోజున ఉగాది పచ్చడి చేసుకుని తింటారు. దీనిని చాలా ఈజీగా తయారు చేయవచ్చు.
ఉగాది పచ్చడి తయారీ విధానం
ఉగాది పచ్చడి తయారీ విధానం (Unsplash)

ఉగాది పచ్చడి తయారీ విధానం

Ugadi Pachadi Recipe Making Process : ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఇది లేకుండా పండగ పూర్తి అవ్వదు. ఉగాది రోజున కచ్చితంగా ఈ పచ్చడి చేసుకోవాల్సిందే. దీని వెనక ఆధ్యాత్మికతతోపాటుగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉగాది పచ్చడి రెసిపీ చేసేందుకు సమయం ఎక్కువగా పట్టద్దు. ఈజీగా చేసేయెుచ్చు. షడ్రుచులతో ఉండే ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులోని తీపి, చేదు, కారం, ఉప్పు, వగరు, పులుపు జీవితానికి సంబంధించిన పాఠాలు కూడా చెబుతాయి. ఉగాది పచ్చడి ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం..

ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు

మామిడి కాయ-1, వేప పువ్వు 1/2 కప్పు, చింతపండు 100 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, ఉప్పు సరిపోయేంత, మిరపకాయలు 2( అయితే కొందరు కారంపొడి కూడా వేసుకుంటారు. మరికొందరు నల్ల మిరియాలు కూడా ఇందుకోసం వాడుతారు)

ఉగాది పచ్చడి తయారీ విధానం

ఒక చిన్న కప్పు తీసుకుని అందులో మెుదట కొంత నీరు పోసి చింతపండును పది నిమిషాలు నానబెట్టాలి.

తర్వాత వడకట్టి చింతపండు గుజ్జును తీసేసి రసాన్ని తీయాలి.

తర్వాత మూడు పావు కప్పు నీళ్లు కలపండి.

బెల్లాన్ని పొడి చేసుకుని అందులో వేయాలి.

మామిడికాయను తరిగి అందులో కలుపుకోవాలి.

ఇప్పుడు కాడల నుంచి వేప పువ్వును వేరు చేసి వేసుకోవాలి.

మిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు కావాలంటే కారం లేదా నల్ల మిరియాలతో కూడా ఉగాది పచ్చడి చేసుకోవచ్చు.

చివరగా ఉప్పు వేసుకోవాలి. చిక్కదనాన్ని బట్టి మీరు నీటిని కలుపుకోవచ్చు. దీనిని బాగా కలపాలి. అంతే షడ్రుచులతో ఉండే ఉగాది పచ్చడి తయారీ అయినట్టే. ఇది అన్నింటికంటే సింపుల్ మార్గం.

ఉగాది ప్రత్యేకత

ఉగాదిని కొత్త సంవత్సరం ప్రారంభంగా చూస్తారు. హిందూ గ్రంధాల ప్రకారం ఈ రోజున బ్రహ్మ జీవులను సృష్టించడం ప్రారంభించాడని నమ్ముతారు. దక్షిణ భారతదేశం అంతటా ఉగాదిని ఘనంగా నిర్వహిస్తారు. చెట్లు ఫలాలు, పువ్వులు కాయడం ప్రారంభించిన కొత్త జీవితం ప్రారంభానికి ఉగాది కారణమని దీని వెనుక ఉన్న నమ్మకం.

ప్రతి ఒక్కరి జీవితం బాధతో నిండి ఉంటుంది. అన్నింటిని సమానంగా చూడాలని ఉగాది పచ్చడి రుచులు చెప్పే సత్యం. బాధ వచ్చినప్పుడు భయపడకూడదు. కానీ పరిస్థితులలో సమతుల్యతను కాపాడుకోవాలి, జీవితాన్ని గడపాలి. ఒక సంవత్సరం అంటే 365 రోజులు. ఈ రోజుల్లో ప్రతీ రోజు సంతోషంగా ఉండదు, విచారం కూడా ఉంటుంది. సుఖ దుఃఖాల చక్రం తిరుగుతుంది. ఉగాది పండుగ అంటే అన్నింటినీ సమానంగా స్వీకరించమని చెబుతుంది.

అందుకే ఉగాది రోజున తయారు చేసే పచ్చడి కూడా అలాంటి సత్యాన్ని వివరిస్తుంది. ఉప్పు, తీపి, పులుపు, చేదు, కారం, వగరుతో కూడినదే జీవితం. ఉగాది సందర్భంగా ఉదయాన్నే స్నానాలు చేస్తారు. దీపావళి మాదిరిగానే ఈ పండుగలో నూనె స్నానం కూడా ప్రత్యేకత. ఈ రోజున ముఖానికి నూనె రాసుకుని స్నానం చేయాలి. ఇంటి గుమ్మానికి కొత్త మామిడి ఆకు కట్టాలి. గణేశుడు, కార్తికేయుడు మామిడిపండ్లను చాలా ఇష్టపడతారని నమ్ముతారు. వీరి ఆశీర్వాదం కోసం ప్రజలు తమ ఇళ్లను మామిడికాయలతో అలంకరించుకుంటారు.

తదుపరి వ్యాసం