తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chocolate Day 2023 । చాక్లెట్ ఇడ్లీతో బ్రేక్‌ఫాస్ట్.. మీ ప్రియమైన వ్యక్తికి తియ్యని ప్రేమ కానుక!

Chocolate Day 2023 । చాక్లెట్ ఇడ్లీతో బ్రేక్‌ఫాస్ట్.. మీ ప్రియమైన వ్యక్తికి తియ్యని ప్రేమ కానుక!

HT Telugu Desk HT Telugu

09 February 2023, 6:45 IST

    • Happy Chocolate Day 2023: వాలెంటైన్స్ వీక్ 2023లో ఫిబ్రవరి 9న చాక్లెట్ డేగా జరుపుకుంటారు. అందుకే వెరైటీగా స్పెషల్ చాక్లెట్ ఇడ్లీ రెసిపీ (Chocolate Idli Recipe)ని ఇక్కడ అందించాం. మీరూ మీ ప్రియమైన వారితో కలిసి తినండి.
Happy Chocolate Day 2023- Chocolate Idli Recipe
Happy Chocolate Day 2023- Chocolate Idli Recipe (YT Screengrab)

Happy Chocolate Day 2023- Chocolate Idli Recipe

Happy Chocolate Day 2023: ప్రతిరోజూ ఉదయం ఎప్పుడూ ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ చేయడం బోర్ కొడుతుందా? అయితే వెరైటీగా ఏదైనా ట్రై చేయండి. రసగుల్లా బోండాం, గులాబ్ జామూన్ పూరీలు తినిచూడండి. ఇది వాలెంటైన్స్ వీక్ 2023, అందులోనూ ఫిబ్రవరి 9 చాక్లెట్ డే (Chocolate Day) గా జరుపుకుంటారు. కాబట్టి చాక్లెట్ దోశ, చాక్లెట్ ఇడ్లీ లాంటి బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు ట్రై చేయకూడదు. మీకోసమే ప్రత్యేకంగా చాక్లెట్ ఇడ్లీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.

వాలెంటైన్ వీక్‌‌లోని చాక్లెట్ డే సందర్భంగా ప్రేమికులు చాక్లెట్‌లను ఇవ్వడం, తీసుకోవడం కూడా ఎంతో విలువైనదిగా చెప్తారు. చాక్లెట్లు పంచుకోవడం వల్ల బంధం బలపడుతుందనే నమ్మకం ఈరోజు కల్పిస్తుంది. మరి ఇలాంటి ప్రత్యేకమైన రోజును ఎందుకు మిస్ చేసుకుంటారు. మీ ప్రియమైన వ్యక్తి కోసం ఈరోజు చాక్లెట్ ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ తినిపించండి. బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లు ఉంటుంది, చాక్లెట్ తిన్నట్లు ఉంటుంది.

ఈ చాక్లెట్ ఇడ్లీ రెసిపీ చాలా సింపుల్, కేవలం 15 నిమిషాల్లో ఇన్‌స్టంట్‌గా రెడీ అయిపోయే రెసిపీ ఇది. మీకొక బంపరాఫర్ ఏమిటంటే ఈ చాక్లెట్ ఇడ్లీ తినడానికి మీకు చట్నీ గానీ, కారం పొడి గానీ అవసరం లేదు. వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా అదే టేస్ట్. మెత్తగా స్పాంజీలాగా మధురమైన రుచిలో ఉంటుంది.

Chocolate Idli Recipe కోసం కావలసినవి

  • 1/4 కప్పు మైదా పిండి
  • 1/4 కప్పు రవ్వ
  • 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్
  • 2 టేబుల్ స్పూన్లు నూనె
  • 1/2 కప్పు పెరుగు
  • 3 నుండి 4 టేబుల్ స్పూన్లు చక్కెర
  • 1/4 కప్పు పాలు
  • 1/4 స్పూన్ బేకింగ్ సోడా - ¼ స్పూన్
  • 1 స్పూన్ వెనీలా ఎసెన్స్
  • చాక్లెట్ సాస్ ఐచ్చికం

చాక్లెట్ ఇడ్లీ తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో పెరుగు, పంచదార తీసుకుని బాగా కలిపి క్రీములాగా చేయాలి.
  2. ఇప్పుడు అందులోనే నూనె, వెనీలా ఎసెన్స్ కూడా వేసి బాగా గిలకొట్టండి.
  3. ఆపైన అందులో రవ్వ, కోకో పౌడర్ వేసి బాగా కలపాలి, ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు పక్కన పెట్టండి.
  4. ఇప్పుడు మళ్లీ ఆ మిశ్రమం తీసుకొని అందులో కొన్ని నీళ్లు లేదా పాలు వేసి బాగా కలపాలి.
  5. ఆపైన బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి, అనంతరం మైదాపిండి కూడా వేసి మెత్తగా కలపాలి.
  6. ఇప్పుడు తయారైన చాక్లెట్ ఇడ్లీ పిండిని ఇడ్లీ పాత్రల్లోకి వేయాలి.
  7. ఇడ్లీలు అతుక్కోకుండా పాత్రలను నూనెతో గ్రీజ్ చేసి పిండి వేయాలి, అనంతరం 5 నుండి 7 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
  8. ఇప్పుడు బయటకు ఇడ్లీలను తీసి ఒక నిమిషం చల్లబరచండి.

అంతే, చాక్లెట్ ఇడ్లీలు రెడీ. చాక్లెట్ సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు. మీ ప్రియమైన వ్యక్తికి తినిపించండి , ప్రేమను వేడుక చేసుకోండి.

తదుపరి వ్యాసం