తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Digestive Health In Monsoon। వర్షాకాలంలో మీ కడుపును ఇబ్బంది పెట్టకండి, ఈ చిట్కాలను పాటించండి!

Digestive Health in Monsoon। వర్షాకాలంలో మీ కడుపును ఇబ్బంది పెట్టకండి, ఈ చిట్కాలను పాటించండి!

HT Telugu Desk HT Telugu

04 August 2023, 12:13 IST

    • Digestive Health in Monsoon: వర్షాకాలంలో జీర్ణశయాంతర సమస్యలు నివారించడానికి, మీ పేగు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి
Digestive Health in Monsoon
Digestive Health in Monsoon (istock)

Digestive Health in Monsoon

Digestive Health in Monsoon: ఈ వర్షాకాలంలో తాజాగా వండిన వేడివేడి ఆహారాన్ని తినడానికే ప్రాధాన్యత ఇవ్వండి, స్ట్రీట్ ఫుడ్ నివారించడమే మేలు. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ల సీజన్. పరిసరాలు కలుషితంగా ఉంటాయి, నీటి నిల్వలు పెరుగుతాయి, దీనికి తోడు వాతావరణంలో తేమ కారణంగా అనేక హానికర బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇతర సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ఇవి ఈగలు, దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మీ సులభంగా అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అపరిశుభ్ర వాతావరణంలో మీరు తినే ఆహారం కూడా మిమ్మల్ని అనారోగ్యంలోకి నెట్టవచ్చు.

ముఖ్యంగా కలుషిత ఆహారం కారణంగా జీర్ణశయాంతర (GI) వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. దీంతో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం, అలసట మొదలైనవి వేధించవచ్చు. ఈ సీజన్‌లో GI సమస్యలను నివారించడానికి, మీ పేగు రోగనిరోధక శక్తిని పెంచడానికి మెరుగైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. పోషకాహార నిపుణుల ప్రకారం, వర్షాకాలంలో మీ కడుపు ఆరోగ్యంగా ఉండటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

చెడిపోయిన ఆహారాలు తినకండి

వానాకాలంలో అధిక తేమ కారణంగా, ఆహార పదార్థాలు త్వరగా చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తాజాగా వండిన, బాగా ఉడికించిన ఆహారాలను తినండి. ఎక్కువ సమయం పాటు ఆహారాలను నిల్వ చేయకండి. మిగిలిపోయిన ఆహారాన్ని తినడం మానుకోండి.

స్ట్రీట్ ఫుడ్‌ను నివారించండి

వర్షాల సమయంలో స్ట్రీట్ ఫుడ్ మరింత రుచికరంగా అనిపిస్తుంది. కానీ వాటిని చూసి టెంప్ట్ కాకండి, తినకుండా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ తినడం ద్వారానే ఇన్‌ఫెక్షన్‌లు సంక్రమించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంట్లో వండిన ఆహారం తినడానికి కట్టుబడి ఉండండి.

ప్రోబయోటిక్స్ తీసుకోండి

మీ ఆహారంలో ప్రోబయోటిక్స్, పులియబెట్టిన ఆహారాలను చేర్చండి. ఈ ఆహారాలలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది, ఇవి మీ పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, హానికరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా మరింత స్థితిస్థాపకంగా పని చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచే మూలికలు

ఎచినాసియా, ఆండ్రోగ్రాఫిస్, వేప , తులసి వంటి రోగనిరోధక శక్తిని పెంచే మూలికలను ఏదో రూపంలో ఆహారంగా తీసుకోండి. ఈ మూలికలు శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి వ్యాధికారక క్రిములతో పోరాడటానికి , మీ జీర్ణవ్యవస్థను రక్షించడంలో సహాయపడతాయి.

హైడ్రేటెడ్ గా ఉండండి

ఈ సీజన్ లో ఎక్కువ దాహం వేయకపోవచ్చు. కానీ మీ శరీరానికి తగినంత నీరు అవసరం అవుతుంది. కాబట్టి శుద్ధమైన, ఫిల్టర్ చేసిన నీరు తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండటానికి ప్రయత్నించండి. సరైన జీర్ణక్రియ కోసం, శరీరం నుండి విషాన్ని తొలగించడానికి నీరు తాగడం చాలా అవసరం.

వీటితో పాటు బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటానికి రోజు రాత్రికి తగినంత నిద్ర, సరిపడా విశ్రాంతి తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం వంటి అలవాట్లను కలిగి ఉండండి.

తదుపరి వ్యాసం