తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bald Head And Hat: నిత్యం తలకు టోపీ, హెల్మెట్లు పెట్టుకునే వారికి బట్టతల త్వరగా వచ్చేస్తుందా?

Bald Head and Hat: నిత్యం తలకు టోపీ, హెల్మెట్లు పెట్టుకునే వారికి బట్టతల త్వరగా వచ్చేస్తుందా?

Haritha Chappa HT Telugu

21 February 2024, 19:00 IST

    • Bald Head and Hat: ఎంతోమందిలో ఒక అభిప్రాయం ఉంది... టోపీ లేదా హెల్మెట్ ఎక్కువ సమయం పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందని అనుకుంటారు. దానివల్ల బట్టతల వస్తుందని భావిస్తారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
బట్టతల ఎందుకు వస్తుంది?
బట్టతల ఎందుకు వస్తుంది? (pexels)

బట్టతల ఎందుకు వస్తుంది?

Bald Head and Hat: వేసవికాలం వచ్చిందంటే బయటికి వెళ్తే టోపీ పెట్టుకునే వారి సంఖ్య ఎక్కువే. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించేందుకు, ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకునేందుకు హెల్మెట్‌ను నిత్యం తలకు ధరించాలి. అయితే టోపీ, హెల్మెట్లను ధరించడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ అవుతుందని, తద్వారా బట్టతల వస్తుందని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. నిజానికి ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోదని వైద్యులు చెబుతున్నారు. బట్టతల రావడానికి అనేక కారణాలు ఉంటాయని దానికి, ఈ టోపీలకు ఎలాంటి సంబంధం లేదని వివరిస్తున్నారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టుకు రక్షణ లభిస్తుంది.

జుట్టు ఎందుకు రాలుతుంది?

ఆరుబయట ఎండలోకి వెళ్ళినప్పుడు... ఆ ఎండకి మాడు వేడెక్కిపోతుంది. అలా వేడెక్కకుండా ఉండడం కోసమే టోపీని ధరిస్తూ ఉంటారు. అంతే తప్ప టోపీ వల్ల జుట్టు రాలిపోవడం జరగదు. అయితే మరీ బిగుతుగా ఉండే టోపీలు వాడకపోవడమే మంచిది. కాస్త జుట్టుకు గాలి తగులుతూ ఉండడం చాలా అవసరం. జుట్టు తీవ్రంగా రాలిపోవడానికి, బట్టతల రావడానికి టోపీ ఏనాటికే కారణం కాదు.

జుట్టు హఠాత్తుగా రాలిపోతుంటే మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అది మీకు జన్యుపరంగా వచ్చిన బట్టతల కావచ్చు. తాతలకు బట్టతల ఉన్నా, తండ్రికి బట్టతల ఉన్నా... భవిష్యత్తులో కొడుకులకు, మనవళ్లకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే హార్మోన్లలో హఠాత్తుగా విపరీతమైన మార్పులు వచ్చినా కూడా జుట్టు రాలిపోతుంది. ధూమపానం,మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు కూడా జుట్టును కోల్పోతారు. జుట్టు వెంట్రుకల మూలాలకు రక్తప్రసరణ సరిగా జరగకపోయినా జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసుకోవడం కోసం డెర్మటాలజిస్ట్‌ను కలవాల్సిందే.

ఒత్తిడి తగ్గించుకోండి

జుట్టు చక్కగా పెరగాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లను వదిలేయాలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి తినడం చాలా ముఖ్యం. మీ జీవన శైలి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే జుట్టు కూడా అంతే బలంగా పెరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల తలకు రక్తప్రసరణ చక్కగా అవుతుంది. దీనివల్ల జుట్టు మరింతగా పెరుగుతుంది. గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో హార్మోన్ల మార్పులు అధికంగా వస్తాయి. ఇలాంటి వారికి వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. అలాగే వాతావరణ కాలుష్యం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడే మహిళలు, పురుషల్లో జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంది.

జుట్టు రాలిపోకుండా ఉండాలంటే... ముందుగానే వైద్యులను సంప్రదించి సంరక్షించుకునే పనిని చేపట్టాలి. వారు చెప్పిన ఆహారాన్ని తినడం, ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చేయాలి. జుట్టుకు మురికి పట్టకుండా వారానికి మూడుసార్లు తల స్నానం చేయాలి. అలాగే నూనెలతో మర్దనా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందంగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం