తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Box Office Collections: ఐదు రోజుల్లో రూ.542 కోట్లు.. పఠాన్ కలెక్షన్ల సునామీ

Pathaan Box office collections: ఐదు రోజుల్లో రూ.542 కోట్లు.. పఠాన్ కలెక్షన్ల సునామీ

Hari Prasad S HT Telugu

30 January 2023, 15:08 IST

google News
    • Pathaan Box office collections: ఐదు రోజుల్లో రూ.542 కోట్లు.. ఇదీ బాక్సాఫీస్ దగ్గర పఠాన్ క్రియేట్ చేస్తున్న కలెక్షన్ల సునామీ. గత బుధవారం (జనవరి 25) రిలీజైన రోజు నుంచే అంచనాలకు మించి వసూలు చేస్తున్న ఈ మూవీ.. ప్రతి రికార్డునూ తిరగరాస్తోంది.
పఠాన్ మూవీకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు
పఠాన్ మూవీకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు (HT_PRINT)

పఠాన్ మూవీకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

Pathaan Box office collections: బాక్సాఫీస్ బాద్ షా షారుక్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సునామీ సృష్టిస్తున్నాడు. రోజుకో కొత్త రికార్డుతో దూసుకెళ్తున్నాడు. తాజాగా పఠాన్ మూవీ ఐదు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.542 కోట్లు వసూలు చేయడం విశేషం. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ లేటెస్ట్ కలెక్షన్ల వివరాలను వెల్లడించాడు.

ఇండియాలో రూ.335 కోట్లు రాగా.. విదేశాల్లో రూ.207 కోట్లు వసూలు చేసింది. పఠాన్ కలెక్షన్లను సునామీగా అభివర్ణిస్తూ తరణ్ మరో ట్వీట్ చేశాడు. ఇక ఐదు రోజుల్లో రూ.542 కోట్ల పూర్తి లెక్కను కూడా విడివిడిగా అతడు బయటపెట్టాడు. మొత్తంగా ఇప్పటి వరకూ హిందీ వెర్షన్ లోనే పఠాన్ మూవీ రూ.271 కోట్లు వసూలు చేసినట్లు తరణ్ చెప్పాడు.

ఇక తెలుగు, తమిళ వెర్షన్లు కలిపి ఐదు రోజుల్లో రూ.9.75 కోట్లు మాత్రమే వచ్చాయి. హిందీ వెర్షన్ లెక్క చూస్తే రిలీజైన బుధవారం (జనవరి 25) రోజు రూ.55 కోట్లు, రెండో రోజు రూ.68 కోట్లు, మూడో రోజు రూ.38 కోట్లు, నాలుగో రోజు రూ.51.5 కోట్లు, ఐదో రోజు రూ.58.5 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి చూస్తే తొలి రోజు రూ.2 కోట్లు, రెండోరోజు రూ.2.5 కోట్లు, మూడో రోజు రూ.1.25 కోట్లు, నాలుగో రోజు రూ.1.75 కోట్లు, ఐదో రోజు రూ.2.25 కోట్లు వచ్చాయి.

హిందీ బెల్ట్ లో అయితే పఠాన్ అన్ని రికార్డులను తుడిచి పెట్టేసింది. అత్యంత వేగంగా రూ.250 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2, బాహుబలి 2, దంగల్, సంజూ, టైగర్ జిందా హై రికార్డులను తిరిగరాసింది. పఠాన్ రిలీజైన తొలి రోజే 5.5 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడయ్యాయి. కేజీఎఫ్ 2 తర్వాతి రికార్డు పఠాన్ దే కావడం విశేషం.

ప్రపంచంలో వంద దేశాల్లో 8వేలకుపైగా స్క్రీన్లలో పఠాన్ రిలీజైంది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలన్న పిలుపు ఉన్నా.. ఇది అంచనాలకు అందని విజయం సాధించింది. ఈ మూవీలో రా ఏజెంట్ గా షారుక్ కనిపించాడు.

తదుపరి వ్యాసం