తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: రబాడను ఎదుర్కొనేందుకు ఆ భారత బౌలర్‌తో రోహిత్ శర్మ ప్రాక్టీస్

Rohit Sharma: రబాడను ఎదుర్కొనేందుకు ఆ భారత బౌలర్‌తో రోహిత్ శర్మ ప్రాక్టీస్

30 December 2023, 20:24 IST

google News
    • Rohit Sharma - IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడను దీటుగా ఎదుర్కొనేందుకు కసరత్తులు చేస్తున్నాడు. వివరాలివే..
 రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం
రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం (PTI)

రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం

Rohit Sharma - IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం భారత్ సిద్ధమవుతోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించే అవకాశాన్ని మరోసారి చేజార్చుకుంది. రెండు టెస్టుల సిరీస్‍లో తొలి మ్యాచ్ ఓడి 0-1తో వెనుకబడింది భారత్. ఇక రెండో టెస్టులో గెలిస్తేనే సిరీస్‍ను సమం చేసుకోగలుగుతుంది. జనవరి 3వ తేదీ నుంచి కేప్‍టౌన్‍లో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు.

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ బౌలింగ్‍లోనే రోహిత్ శర్మ ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా బౌల్డ్ అయ్యాడు. డకౌట్‍గా వెనుదిరిగాడు. దీంతో రెండో టెస్టులో రబాడను దీటుగా ఎదుర్కొనేందుకు రోహిత్ కసరత్తులు చేస్తున్నాడు. భారత పేసర్ ముకేశ్ కుమార్ బౌలింగ్‍లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేడు రెండు గంటల సెషన్‍లో 45 నిమిషాల పాటు ముకేశ్ బౌలింగ్‍లోనే రోహిత్ ఆడాడు. రబాడ వేసిన లైన్, లెంగ్త్‌లోనే నెట్స్‌లోనే రోహిత్‍కు బంతులు సంధించాడు ముకేశ్ కుమార్.

4-6 మీటర్ల లెంగ్త్‌లో బంతి లోపలికి వచ్చే యాంగిల్‍లో బంతులు వేయాలని ముకేశ్‍కు రోహిత్ శర్మ సూచించాడు. ఇన్‍స్వింగింగ్ బంతులు వేయాలని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో రబాడ బౌలింగ్‍లో ఫుల్త్ లెంగ్త్ లోపలికి వచ్చిన బంతికే రోహిత్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముకేశ్ కుమార్‌ నుంచి ప్రాక్టీస్‍లో అలాంటి బంతులే ఎక్కువగా ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ. ముకేశ్‍ను రోహిత్ మెచ్చుకున్నట్టు కూడా తెలుస్తోంది.

మరోవైపు, తొలి టెస్టులో విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో రెండో టెస్టు భారత తుది జట్టులో ముకేశ్ కుమార్‌కు స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వెన్ను నొప్పి నుంచి స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా పూర్తి కోలుకున్నాడు. దీంతో ఈ టెస్టులో అతడు కూడా ఆడే ఛాన్స్ ఉంది. ప్రాక్టీస్‍లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ భుజానికి బంతి బలంగా తగిలింది. దీంతో అతడు ఐస్‍ప్యాక్‍తో కనిపించాడు.

తదుపరి వ్యాసం