తెలుగు న్యూస్  /  బిజినెస్  /  America News: 2024లో అమెరికాలో లక్షలాది ఉద్యోగాల కోత; భారతీయులకు కూడా కష్టమే; ఆర్థిక మాంద్యం తప్పదా..?

America news: 2024లో అమెరికాలో లక్షలాది ఉద్యోగాల కోత; భారతీయులకు కూడా కష్టమే; ఆర్థిక మాంద్యం తప్పదా..?

HT Telugu Desk HT Telugu

16 December 2023, 19:06 IST

    • Americans will lose their jobs: అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక దుర్వార్తను సీబీఓ వెల్లడించింది. బలహీన ఆర్థిక వృద్ధి సహా వివిధ అనివార్య కారణాల వల్ల అమెరికాలో 2024లో లక్షలాది ఉద్యోగాలకు కోత పడనుందని తెలిపింది. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Americans will lose their jobs: 2024 లో అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి వివరాలతో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (Congressional Budget Office CBO) ఒక నివేదికను విడుదల చేసింది. వచ్చే సంవత్సరం అమెరికా ఆర్థిక రంగంలో అమెరికా ప్రతికూల ఫలితాలను చవి చూస్తుందని సీబీఓ నివేదిక వెల్లడించింది.

నిరుద్యోగం..

2024 లో అమెరికాలో నిరుద్యోగిత రేటు (unemployment rate) ప్రస్తుతమున్న 3.9% నుంచి 4.4 శాతానికి పెరుగుతుందని సీబీఓ వెల్లడించింది. అమెరికాలోని లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశముందని వెల్లడించింది. 2024లో ఎగుమతులు తగ్గుతాయని, వినియోగదారులు వ్యయం చేసే మొత్తం తగ్గుతుందని, నాన్ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (Congressional Budget Office CBO) అంచనా వేస్తోంది. దాంతో, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, నిరుద్యోగిత పెరుగుతుందని వివరించింది.

నిరుద్యోగ భృతి కోరుతూ..

ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాలు పొందుతున్నవారు సుమారు 18.70 లక్షల మంది ఉన్నారు. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు నిరుద్యోగ భ‌ృతి కోరుతూ అదనంగా, 2.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. భవిష్యత్తులో అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరిస్థితిని ఈ గణాంకాలు స్పష్టంగా వివరిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫెడరల్ రిజర్వ్ అంచనా..

CBO కంటే కొంచెం ఎక్కువ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, 2024 సంవత్సరం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఫెడరల్ రిజర్వ్ అంచనా కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. 2024లో అమెరికా వాస్తవ GDP వృద్ధి 1.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2024 చివరి నాటికి నిరుద్యోగిత రేటు 4.1 శాతానికి పెరుగుతుందని ఫెడ్ అంచనా వేసింది. అయితే, ఇది CBO అంచనా కంటే తక్కువగా ఉంది.

ఆర్థిక మాంద్యం తప్పదా?

2024లో ద్రవ్యోల్బణం రేటు 2.1 శాతానికి తగ్గుతుందని CBO అంచనా వేసింది. అయితే, ఇది ఫెడ్ లక్ష్యం అయిన 2 శాతానికి చేరువలో ఉండడం విశేషం. కాగా, అమెరికా ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తోందన్న వాదన సీబీఓ, ఫెడ్ అంచనాలతో బలపడుతోంది. వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్ నిర్ణయం ఆర్థిక మాంద్యం తప్పదని స్పష్టం చేస్తోందని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు జెఫ్రీ బుచ్బైండర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ 2024 లో ఆర్థిక మాంద్యం వస్తే, అమెరికా ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నందున, అది అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఆయన అంచనా వేశారు.

తదుపరి వ్యాసం