తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kinetic Green E-luna: భారతీయ మార్కెట్లోకి కైనెటిక్ గ్రీన్ ఈ -లూనా; ధర కూడా మీరు ఊహించలేనంత తక్కువ..

Kinetic Green E-Luna: భారతీయ మార్కెట్లోకి కైనెటిక్ గ్రీన్ ఈ -లూనా; ధర కూడా మీరు ఊహించలేనంత తక్కువ..

HT Telugu Desk HT Telugu

08 February 2024, 10:09 IST

    • Kinetic Green E-Luna: కైనెటిక్ గ్రీన్ ఇ- లూనా ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఇది 1.7 kWh, 2 kWh, 3 kWh బ్యాటరీ ప్యాక్‌లతో, బహుళ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ లూనాపై సింగిల్ ఛార్జ్‌ తో 150 కిమీల వరకు ప్రయాణించవచ్చు.
కైనెటిక్ గ్రీన్ ఈ లూనా
కైనెటిక్ గ్రీన్ ఈ లూనా

కైనెటిక్ గ్రీన్ ఈ లూనా

Kinetic Green E-Luna variants: వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కైనెటిక్ ఈ లూనా ను ఎట్టకేలకు భారత్ లో లాంచ్ చేశారు. కైనెటిక్ గ్రీన్ సంస్థ ఈ ఎలక్ట్రిక్ లూనాను రూపొందించింది. ఈ కొత్త కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా రూ. 69,990 (ఎక్స్-షోరూమ్, FAME II సబ్సిడీతో సహా) ప్రారంభ ధర (Kinetic Green E-Luna price) తో లభిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఈ లూనాను రూపకల్పన చేశారు. ఈ ఎలక్ట్రిక్ లూనాను పూర్తిగా భారతదేశంలో రూపొందించారు.

హెవీ డ్యూటీ కార్యకలాపాల కోసం

కొత్త కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా (Kinetic Green E-Luna) లో డ్యూయల్ ట్యూబ్యులర్ హై-స్ట్రెంగ్త్ స్టీల్ చట్రం ఉపయోగించారు. ఇది ఎలక్ట్రిక్ మోపెడ్ హెవీ డ్యూటీ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ లూనా మోడల్ 150 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్త కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా లో వెనుక సీటును తొలగించి, ఆ ప్రదేశంలో లగేజ్ ను పెట్టుకునే వీలు కూడా ఉంటుంది.

లూనా ప్రేమికులకు శుభవార్త

కొత్త కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా ను లాంచ్ చేస్తున్న సందర్భంగా కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు, సీఈఓ సులాజ ఫిరోడియా మోత్వాని మాట్లాడుతూ.. ‘ ఈ ఇ-లూనా ఆవిష్కరణ కైనెటిక్ గ్రీన్‌కి గర్వకారణం. ఎలక్ట్రిక్ రూపంలో ఇది పునరాగమనం చెందడం లూనా ప్రేమికులకు శుభవార్త. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ఇ-లూనా ప్రవేశం విప్లవానికి తక్కువేమీ కాదు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు ఆటోమొబైల్ మార్కెట్‌లో కేవలం 5 నుండి 6 శాతం మాత్రమే ఉన్నాయి. అందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి ఎలక్ట్రిక్ వాహనాల అధిక ధర. రెండవది వాటితో చాలా వరకు మెట్రో లేదా పెద్ద నగరాలను దాటి ప్రయాణించడం సాధ్యం కాకపోవడం. ఈ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో కైనెటిక్ గ్రీన్ E-లూనా ను రూపొందించాం. ఇది భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ సరసమైన ఎంపికగా మారుతుంది’’ అన్నారు.

మూడు బ్యాటరీ ప్యాక్ లలో..

ఈ కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా మూడు బ్యాటరీ ప్యాక్ లతో లభిస్తుంది. అవి 1.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్. ఇందులో 2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జ్ తో 110 కిమీల వరకు ప్రయాణించవచ్చు. 3 kWh బ్యాటరీ ప్యాక్‌ తో ఒకే ఛార్జ్‌పై 150 కిమీల వరకు ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీలు "సమర్థవంతమైన థర్మల్ మేనేజ్‌మెంట్‌తో అత్యధిక భద్రతా ప్రమాణాలకు" అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, E-Luna ఫాస్ట్ ఛార్జింగ్ మరియు స్వాప్ చేయగల బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

కైనెటిక్ గ్రీన్ ఈ లూనా

గంటకు 50 కిమీలు..

కొత్త E-Luna గరిష్ట వేగం గంటకు 50 కిమీలు. బ్యాటరీ, మోటారు మరియు కంట్రోలర్ అన్నీ IP 67 రేటింగ్‌తో వాటర్, డస్ట్ ప్రూఫ్ అని కైనెటిక్ గ్రీన్ చెబుతోంది. మోడల్ రియల్ టైమ్ DTE (డిస్టెన్స్ టు ఎంప్టీ) ఇండికేటర్‌తో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా ఇందులో పొందుపర్చారు. కాంబి-బ్రేకింగ్, USB ఛార్జింగ్ పోర్ట్, మూడు రైడింగ్ మోడ్‌లు, సైడ్-స్టాండ్ సెన్సార్ మొదలైన ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి. E-లూనాలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, 16-అంగుళాల వైర్-స్పోక్డ్ వీల్స్‌ ను అమర్చారు.

నెలకు రూ. 2500 లోపే..

కొత్త ఇ-లూనా భారత్ లోని చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదారులకు అవసరమైన సేవలను అందించగలదు. సరసమైన ధరలో లభించడం ఈ కైనెటిక్ గ్రీన్ ఈ లూనా ప్రత్యేకత. ఈ లూనా నిర్వహణ ఖర్చు ప్రతి కిమీకి 10 పైసలు మాత్రమేనని కంపెనీ చెబుతోంది. రుణంతో తీసుకుంటే, దాదాపు రూ. 2,000 నెలవారీ వాయిదా, నెలకు రూ. 300 ఛార్జింగ్ ఖర్చుతో నెలకు రూ. 2,500 లోపు వ్యయంతో ఈ వాహనాన్ని వాడుకోవచ్చు.

ఐదు రంగుల్లో..

ఇ-లూనా ఐదు మెటాలిక్ రంగులలో లభిస్తుంది. అవి మల్బరీ రెడ్, పెర్ల్ ఎల్లో, నైట్ స్టార్ బ్లాక్, ఓషన్ బ్లూ, స్పార్క్లింగ్ గ్రీన్. కైనెటిక్ గ్రీన్ డీలర్‌షిప్‌ల ద్వారా మరి కొన్ని రోజుల్లో డెలివరీలు ప్రారంభం అవుతున్నాయి. కాగా, ఈ కైనెటిక్ గ్రీన్ ీ లూనాను రూ. 500 టోకెన్ అమౌంట్ తో బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ మోడల్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌తో సహా పలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

తదుపరి వ్యాసం