తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anam Ramanarayana Reddy : అభివృద్ధిపై ఆనం మరోసారి సంచలన వ్యాఖ్యలు ! చర్యలకు జగన్ ఆదేశం ?

Anam Ramanarayana Reddy : అభివృద్ధిపై ఆనం మరోసారి సంచలన వ్యాఖ్యలు ! చర్యలకు జగన్ ఆదేశం ?

Thiru Chilukuri HT Telugu

03 January 2023, 18:37 IST

    • Anam Ramanarayana Reddy : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు అంటున్నారని.. అవి వస్తే ఏడాది ముందే ఇంటికెళ్లడం ఖాయమన్నారు. కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్… చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

Anam Ramanarayana Reddy : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని.. అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని పరోక్షంగా ప్రభుత్వంపై మాటల అస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవలే నెల్లూరు జిల్లా రావూరులో జరిగిన వలంటీర్లు, సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతూ ... నాలుగేళ్లలో మనం ఏం చేశామని ప్రజల్ని మళ్లీ ఓట్లు అడగాలి ? అని ఆనం చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా.. మంగళవారం సైదాపురం మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని... సచివాలయాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని.. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వస్తే... తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు. అనుకున్న పనులు కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

"నియోజకవర్గంలో ఇంకా సచివాలయాల నిర్మాణం పూర్తి కాలేదు. సాంకేతిక అంశాలు కారణమా ? బిల్లుల చెల్లింపు జాప్యమా తెలియడం లేదు. ఈ అంశంపై అధికారులను అడిగితే, మొదలు పెడతాం, కడతాం, అయిపోతుందని అంటున్నారు. నిజంగా ఒకటి మాత్రం అయిపోతుంది. అందరూ గమనించాలి. మీరు ఇచ్చిన 5 సంవత్సరాల కాలం పూర్తి అయిపోతుంది. మధ్యలోనే ఎన్నికలు వస్తాయని పత్రికల్లో చూస్తున్నాం. అవే వస్తే ఇంకా ముందే ఇంటికి పోతాం" అని అన్నారు.

డిసెంబర్ 28న నెల్లూరు జిల్లా రావూరులో జరిగిన వలంటీర్లు, సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న ఆనం.. ప్రభుత్వం, అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "గ్రామాలకు రోడ్లు వేయలేదు, రోడ్లపై గుంతలు పూడ్చలేదు. కనీసం తట్టెడు మట్టి వేయలేదు. ఇళ్లు కడతామని లే అవుట్ వేశాం. అది కూడా పూర్తి చేయలేదు. మనం ఏం చేశామని ప్రజలను ఓట్లు అడగాలి ? పింఛన్లు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారా ? టీడీపీ ప్రభుత్వం కూడా పింఛన్లు ఇచ్చింది కదా ?" అని ఆనం ప్రశ్నించారు. కండలేరు ముంపు గ్రామాల సమస్యలు ఇప్పటికీ తీరలేదని, పక్కనే రిజర్వాయర్ ఉన్నా తాగు, సాగు నీరు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోమశిల, స్వర్ణముఖి లింకు కెనాల్ కు శంకుస్థాపన చేశారని... ఆయన దగ్గర పనిచేసిన తాము ఆయన కల నెరవేర్చలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నందుకు బాధపడుతున్నామని వ్యాఖ్యానించారు.

ఇలా.. కొన్నాళ్లుగా ప్రభుత్వంపై అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న ఆనం రామనారాయణ రెడ్డి తీరుపై.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జిగా నేదురమల్లి రామకుమార్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. తాజా పరిణామాలతో... రామకుమార్ రెడ్డి ఇంటి వద్ద సందడి నెలకొంది. అధిక సంఖ్యలో కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

తదుపరి వ్యాసం