Munugode Congress Candidate: స్రవంతికే సీటు ఎందుకు ఇచ్చారు..? కారణాలివేనా
congress candidate palvai sravanthi: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది కాంగ్రెస్. పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా డిక్లేర్ చేసింది. అయితే ఆమె వైపే కాంగ్రెస్ ఎందుకు మొగ్గుచూపిందనేది చూస్తే...
Munugode bypoll congress candidate: పాల్వాయి స్రవంతి, చలిమల కృష్ణారెడ్డి, పల్లె రవి కుమార్ గౌడ్, కైలాష్ నేత... ఈ పేర్ల చుట్టే మునుగోడు కాంగ్రెస్ రాజకీయం నడిచింది. వీరిలో ఎవరికి టికెట్ అనే దానిపై తెగ చర్చలు చేసింది. ఫైనల్ గా బంతిని అధిష్టానం కోర్టులోకి పంపింది. అయితే వీరిలో పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. మునుగోడు బైపోల్ వార్ ను చావోరేవోగా భావిస్తున్న హస్తం పార్టీ... స్రవంతికే సై అనటం వెనక పలు కారణాలు ఉన్నాయి.
బలమైన నేపథ్యం…
palvai sravanthi: పాల్వాయి స్రవంతి.…. ఈమె కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె. మునుగోడు నియోజకవర్గం 1967లో ఏర్పాటు కాగా... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విక్టరీ కొట్టారు. 1967-1985 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి గోవర్ధన్ రెడ్డినే వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. 1999 ఎన్నికల్లోనూ గోవర్థన్ రెడ్డి విజయఢంకా మోగించారు. ఫలితంగా ఇదే నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు గెలిచినట్లు అయింది. అయితే ఆయన రాజకీయ వారసురాలిగా స్రవంతినే ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇక ఢిల్లీ పెద్దలతోనూ గోవర్థన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండేవి. రాష్ట్ర కాంగ్రెస్ లోనూ ఆయనకంటూ ఓ గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం కూడా తాజాగా స్రవంతికి కలిసివచ్చిందనే చెప్పొచ్చు. ఇదే సమయంలో నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా స్రవంతి వైపే మొగ్గు చూపారని టాక్. గోవర్థన్ రెడ్డితో ఉన్న సంబంధాలు కూడా ఇక్కడ పని చేసినట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి వర్సెస్ పాల్వాయి
కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించేవారు. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్న సమయం నాటి నుంచే ఈ పరిస్థితి ఉంది. దీనికితోడు మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వొద్దనే భావనతో పాల్వాయి గోవర్థన్ రెడ్డి పావులు కదుపుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ మునుగోడు సీటుపై కన్నేసినప్పటికీ... తీవ్రంగా వ్యతిరేకించారు పాల్వాయి గోవర్థన్ రెడ్డి. అప్పట్నుంచి వీరి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుగా మారింది. 2017 సంవత్సరంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డి మృతి చెందటంతో సీన్ మారింది. మునుగోడుపై కన్నేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగంలోకి దిగారు. స్రవంతికి టికెట్ రాకుండా సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి టికెట్ పొంది 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.
Munugodu assembly Elections: పొత్తులో భాగంగా 2014 ఎన్నికలో మునుగోడులో కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఈ సీటును సీపీఐకి కేటాయించింది. అయితే పాల్వాయి స్రవంతి మాత్రం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆమె రెండో స్థానంలో నిలిచి సత్తా చాటారు. 27వేలకు పైగా ఓట్లు సాధించారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవటంతో ఆమెకు టికెట్ దక్కకుండా పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఆమె ప్రచారం నిర్వహించారు.
తాజాగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరటంతో ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉండటంతో ఆమె పేరు ప్రధానంగా వినిపించింది. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా పలువురి పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలించింది. అయితే నియోజకవర్గంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డికి పేరు ఉండటం, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి చెప్పుకొదగిన ఓట్లు సంపాదించటం, ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో స్రవంతి అయితేనే సరైన అభ్యర్థి అని ఓ అంచనాకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా పక్కా లెక్కలతోనే స్రవంతి అభ్యర్థితత్వానికి ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీ బైపోల్ వార్ లో విజయం సాధిస్తుందా..? అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఏ మాత్రం నిలువరిస్తారనేది వేచి చూడాలి.