Munugode Bypoll : మునుగోడులో కాంగ్రెస్ గోడు… రేవంత్ ముందు ముళ్లబాటే…-congress party struggles to fight in munugode by poll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugode Bypoll : మునుగోడులో కాంగ్రెస్ గోడు… రేవంత్ ముందు ముళ్లబాటే…

Munugode Bypoll : మునుగోడులో కాంగ్రెస్ గోడు… రేవంత్ ముందు ముళ్లబాటే…

HT Telugu Desk HT Telugu
Sep 03, 2022 07:33 AM IST

Munugode Bypollతెలంగాణ రాజకీయాలను మునుగోడు ఎన్నికలు మలుపు తిప్పుతాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి రాజీనామా చేసి తిరిగి బీజేపీ తరపున ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుదలతో ఉంటే, ఎలాగైనా సరే బీజేపీకి చెక్ పెట్టాలని అధికార పార్టీ టీఆర్ఎస్ ట్రై చేస్తోంది.

మునుగోడులో రేవంత్ రెడ్డి సవాలక్ష సవాళ్లు
మునుగోడులో రేవంత్ రెడ్డి సవాలక్ష సవాళ్లు (twitter)

Munugode Bypoll మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీది విచిత్రమైన పరిస్థితి. పేరుకు మునుగోడు సిట్టింగ్ స్థానం అయినా కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పరువు ఎన్నికకు ముందే అటక ఎక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సోదరుడు సిట్టింగ్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా ఉన్నా, సొంత సోదరుడు పార్టీ మారుతుంటే ఆపలేకపోయారు.

నిజానికి కాంగ్రెస్ పార్టికి నల్గొండ జిల్లాలో బలమైన నేతలు, క్యాడర్ పునాది ఉన్నప్పటికీ, రాజగోపాల్ రెడ్డి లాంటి నేత కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. అది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలహీనతే అని చెప్పాలి. కేంద్ర స్థాయిలో పార్టీ బలహీన పడటంతో, రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు తమ భవిష్యత్తు కోసం బీజేపీ పంచన చేరుతున్నారు.

కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాత్రం Munugode Bypoll మునుగోడు ఎన్నిక ఒక అగ్ని పరీక్షగా మారింది. మునుగోడు ఎన్నిక ద్వారా కాంగ్రెస్ తన సిట్టింగ్ అభ్యర్థి రాజగోపాల్ కు చెక్ చెబితే, భవిష్యత్తులో బీజేపీ సహా ఇతర పార్టీల్లోకి కాంగ్రెస్ నేతల వలసలకు అడ్డుకట్ట వేయవచ్చు. నిజానికి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుపు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ నియోజకవ వర్గం గత కొన్ని దశాబ్దాలుగా వామ పక్ష పార్టీలకు కంచుకోటగా ఉంది. వామ పక్ష పార్టీలకు చెందిన సురవరం సుధాకర్ రెడ్డి వంటి వారు నల్గొండ పార్లమెంటుకు ఎన్నిక అయ్యారు అంటే దాని వెనుక మునుగోడు, దేవరకొండ లాంటి శాసన సభ నియోజక వర్గాల్లో సీపీఐ పార్టీకి వచ్చే మెజారిటీతోనే ఇది సాధ్యం అయ్యింది.

అయితే ఈ సారి వామపక్షాలు తమ సహజ మిత్రుడు అయిన కాంగ్రెస్ పార్టీని కాదని, బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ తో జతకట్టాయి. ఇది ఒకరకంగా రేవంత్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా మునుగోడు సీటును సీపీఐ పార్టీ కాంగ్రెసుకు వదులుకుంది. దీంతో వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ విజయం సాధించింది.

ఈ సారి వామపక్షాల మద్దతు లేదు, అలాగే సొంత పార్టీ నేత కమలం గూటికి చేరాడు. దీంతో కాంగ్రెస్ కేడర్ డీలా పడింది. అలాగే నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కొనే బలమైన లీడర్లు కూడా కరువయ్యారు. పాల్వాయి స్రవంతి రెడ్డి లాంటి వారు రెడీగా ఉన్నా, మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయి వనరులను సిద్ధం చేసుకోలేకపోవచ్చు. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పెద్దగా సీరియస్ గా లేదు. అసలు రాహుల్ గాంధీకి ఈ విషయం తెలుసోలేదో అనే సందేహం కలుగుతోంది.

మరోవైపు తెలంగాణ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీకి తెలంగాణ రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు. ఇది కూడా కాంగ్రెస్ పాలిట శాపంగా మారనుంది. సిట్టింగ్ ఎంపీ వెంకట్ రెడ్డి శల్య సారథ్యం వహించే అవకాశం ఉందని, పార్టీలోని కేడర్ నుంచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వెరసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాలం కలిసి రావడం లేదు. మునుగోడు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోతే మాత్రం రేవంత్ ఇమేజ్ కు గట్టి దెబ్బపడటం ఖాయం.

అధికార టీఆర్‌ఎస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొని బలంగా నిలబడటం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము అనే చెప్పాలి. 2014లో ఆంధ్రలో ఆవిరి అయినట్లే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిరి అవడం ఖాయంగా కనిపిస్తోంది.

WhatsApp channel