Kunamneni Fires on KTR : కేటీఆర్ కు మతిభ్రమించింది, కూనంనేని సంచలన వ్యాఖ్యలు
Kunamneni Fires on KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కాంగ్రెస్ నుంచి కొందరిని లాక్కుని ప్రజా తీర్పును అగౌరవపరచాలని చూస్తున్నారని ఆరోపించారు.
Kunamneni Fires on KTR : మాజీ మంత్రి కేటీఆర్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్స్చేశారు. కేటీఆర్ కు మతిభ్రమించిందని, అందుకే రోజుకో విధంగా స్టేట్మెంట్లు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాలుగైదు రోజుల నుంచే బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీపీఐ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి వచ్చిన ఆయన ముందుగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక వైపు రాష్ట్రంలో రోజుకో శాఖ నుంచి శ్వేత పత్రం బయటికి వస్తుంటే అబద్దాలు, వంచనతో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ప్రభుత్వాన్ని ఎలా దించేయాలా అని చూస్తున్నారని విమర్శించారు. కరెంట్ బిల్లులు కట్టవద్దని, వాటిని సోనియాకు పంపాలని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 46 రోజులే కావస్తోందని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు వేచి చూడలేరా? అని కూనంనేని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, కేజీ టూ పీజీ విద్య, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత బంధు, నిరుద్యోగ భృతి లాంటి హామీలను నెర వేర్చారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులలో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఎన్నికలలో ఓడినా బీఆర్ఎస్ నాయకుల అహంకారం, నియంతృత్వ పోకడలు తగ్గలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నుంచి కొందరిని లాక్కుని ప్రజా తీర్పును అగౌరవ పరచాలని చూస్తున్నారని, అది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని స్పష్టం చేశారు.
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒకట్రెండు స్థానాలే
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ఒకటి, రెండు స్థానాల కంటే ఎక్కువ సీట్లు రావని కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణితో పాటు ఆర్టీసీ, బ్యాంకులు, అంగనవాడీ, మెడికల్ తదితర అన్ని రంగాలలో ఎర్రజెండా అభిమానులే ఉన్నారని, ప్రజల తరుపున ప్రశ్నించాలంటే చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలోనూ కాంగ్రెస్ స్నేహ ధర్మాన్ని పాటిస్తుందని భావిస్తున్నామని, రాష్ట్రంలోని ఒక పార్లమెంటు స్థానాన్ని కోరుతున్నామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. తాము కోరుతున్న ఐదు స్థానాలలో వరంగల్ పార్లమెంటు స్థానం కూడా ఉందని, అందుకే ఇక్కడే తొలి సమావేశాన్ని నిర్వహించి సీపీఐ పార్లమెంటు కమిటీని వేసుకుంటున్నామని తెలిపారు. కమ్యూనిస్టులు కలిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలు దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు.
బీజేపీది రామజపం కాదు మోదీ జపం
బీజేపీది రామజపం కాదని, మోడీ జపం అని, ప్రజలలో హిందుత్వ సెంటిమెంట్ రెచ్చగొట్టి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని కూనంనేని సాంబశివరావు అన్నారు. రాముడు అందరి దేవుడైనా బీజేపీ రాముని పేరుతో ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం