Kishan Reddy : కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ నాటకాలు, కేసీఆర్ అసెంబ్లీకి రారు సభలకు మాత్రమే వెళ్తారు-కిషన్ రెడ్డి సెటైర్లు-warangal news in telugu bjp chief kishan reddy criticizes congress kcr on medigadda nalgonda tours ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kishan Reddy : కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ నాటకాలు, కేసీఆర్ అసెంబ్లీకి రారు సభలకు మాత్రమే వెళ్తారు-కిషన్ రెడ్డి సెటైర్లు

Kishan Reddy : కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ నాటకాలు, కేసీఆర్ అసెంబ్లీకి రారు సభలకు మాత్రమే వెళ్తారు-కిషన్ రెడ్డి సెటైర్లు

HT Telugu Desk HT Telugu
Feb 13, 2024 05:10 PM IST

Kishan Reddy : రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మైలేజ్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో రచ్చ చేస్తున్నాయన్నారు.

కిషన్ రెడ్డి ప్రెస్ మీట్
కిషన్ రెడ్డి ప్రెస్ మీట్

Kishan Reddy : బీఆర్ఎస్​పార్టీ కృష్ణా జలాలపై, కాంగ్రెస్​ పార్టీ కాళేశ్వరంపై రచ్చ చేస్తూ లోక్ సభ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి(Kishan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్​మేడిగడ్డ(Medigadda) ప్రాజెక్టు విజిట్​చేస్తుంటే, కృష్ణా జలాలపై నల్గొండలో సభ పెట్టి రెండు పార్టీలు ఎన్నికల వేళ మైలేజ్​ కోసం కొట్లాడుకుంటున్నాయని విమర్శించారు. వరంగల్ నగరంలో మంగళవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంట్ ఆఫీస్​ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పార్లమెంట్ ఆఫీస్​ ఓపెనింగ్ చేసి, అనంతరం హంటర్ రోడ్డులోని వేద ఫంక్షన్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతికి పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్(KCR) సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్​ చేశారు.

డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు

గత సంవత్సరం అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు వచ్చిన వెంటనే అక్టోబర్ 22న కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశానన్నారు. ఆ తర్వాతి రోజే భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి మేడిగడ్డకు పంపిందని, అక్టోబర్ 24, 25న రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర అధికారులను వివరాలు అడిగిందన్నారు. ఆ తరువాత నవంబర్ 1న డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందని, ప్రాజెక్టు సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్ఠంగా ఉన్నాయని వెల్లడించిందన్నారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్​ ఇచ్చిన తర్వాత నాటి బీఆర్ఎస్(BRS) సర్కారుకు ఉత్తరాలు రాశామని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేకుండా పోయిందని విమర్శించారు.

కాంగ్రెస్​ మాటలు తప్ప.. చేతల్లేవు

డ్యామ్ కు సంబంధించిన నాణ్యత, ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ అక్రమాలను బయటపట్టడానికి విజిలెన్స్ కు అవకాశం ఉండదని, డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాత్రమే దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల రక్షణ చూస్తుందని కిషన్​ రెడ్డి చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, మళ్లీ సందర్శనకు వస్తామన్నా అనుమతి ఇవ్వడం లేదన్నారు. మేడిగడ్డ ప్రమాదంలో ఉందని తెలిసినా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రెండు నెలల సమయం వృథా చేసిందని మండిపడ్డారు. విజిలెన్స్ దర్యాప్తు అంటున్న రాష్ట్ర సర్కారు.. అసలు విజిలెన్స్ ఏం చేయగలదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. కాంగ్రెస్​మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే వాడుకుటోందని, అసెంబ్లీ బంద్ పెట్టి మేడిగడ్డకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంతకుముందే ప్రాజెక్టును మంత్రులు, సీఎం రేవంత్, రాహుల్ గాంధీ చూశారని, ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే వ్యవహరిస్తోందని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్ నల్గొండ బహిరంగ సభకు వెళ్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రారో ఆయనకే తెలియదన్నారు. గతంలో సచివాలయానికి వెళ్లేవారు కాదని, ఇప్పుడు అసెంబ్లీకి రావడంలేదన్నారు. కేవలం సభలకు మాత్రమే కేసీఆర్‌ వెళ్తారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ పేరుతో కాంగ్రెస్‌ నాటకాలు ఆడుతోందని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

కృష్ణా జలాలపై బీఆర్ఎస్​ సర్కారు చేసిందేమిటి?

కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులపై పెత్తనం చెలాయిస్తోందని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, నాగార్జున సాగర్ డ్యామ్ పై ఏపీ పోలీసులు(AP Police) చేరి ముళ్లకంచెలు వేసి తుపాకులతో ఉంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల వివాదం బచావత్​ ట్రిబ్యునల్ సమక్షంలోనే పరిష్కారం కావాలని, కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. ఆంధ్ర పోలీసులను పెట్టి బలవంతంగా నీళ్లు తీసుకుపోతే ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ ఏంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదన్నారు. ప్రాజెక్టుల సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకుంటే కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత నిర్వర్తిస్తే.. ఒక మాట, నిర్వహించకుంటే మరొక మాట మాట్లాడతున్నారన్నారు.

కాంగ్రెస్​, బీఆర్ఎస్​ కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా ఆ ఓటు మూసీ నదిలో వేసినట్లేనని కిషన్​రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీని నమ్మి ఓట్లు వేస్తే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే అవుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో వారికి ఉన్న 40 సీట్లు కూడా రావని, బీజేపీకి తెలంగాణలో డబుల్ డిజిట్ వస్తుందని, హైదరాబాద్(Hyderabad) లోని ఓవైసీని కూడా సవాల్ చేస్తున్నామన్నారు. ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం ఏమీ లేదని, దేశంలో బలమైన, సమర్థమైన నాయకత్వం ఒక్క బీజేపీ మాత్రమే ఇవ్వగలుగుతుందన్నారు. దేశంలో ప్రజల సొమ్ము తిన్నవారిని ఎవరినీ మోదీ ప్రభుత్వం వదలబోదన్నారు. అనంతరం హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శించారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం