KMC Ragging: కేఎంసీలో ర్యాగింగ్ కలకలం, నార్త్,సౌత్ విద్యార్ధుల మధ్య వార్, ఏడుగురు సీనియర్లపై వేటు
KMC Ragging: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. జూనియర్ విద్యార్ధిపై దాడికి పాల్పడిన ఘటనలో ఏడుగురు సీనియర్లపై వేటు పడింది. మరికొందరికి సంజాయిషీ నోటీసులిచ్చారు.
KMC Ragging: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్ధిపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై సస్పెన్షన్ వేటు పడింది. బాధిత విద్యార్ధి యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు తక్షణం చర్యలు చేపట్టారు. బాధిత విద్యార్ధి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కమిటీ.. కేఎంసీలో సీనియర్లు జూనియర్‌పై ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేల్చింది.
ర్యాగింగ్ ఘటనకు బాధ్యులైన ఏడుగురు వైద్య విద్యార్థులపై మూడు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. వారిని ఏడాదిపాటు వసతి గృహంలోకి అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. కేఎంసీ ప్రిన్సిపల్ డా.మోహన్‌దాస్ అధ్యక్షతన మంగళవారం కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నెల 14వ తేదీన అర్ధరాత్రి వరకు కాలేజీ లైబ్రరీలో చదువుకుని హాస్టల్‌కు వెళ్తున్న రాజస్థాన్‌కు చెందిన ఫస్టియర్ ఎంబిబిఎస్ విద్యార్థిని సీనియర్ విద్యార్ధి అడ్డుకున్నాడు.
తనకు మంచి నీళ్లు తీసుకురావాాలని పురమాయించడంతో జూనియర్ విద్యార్ధి అందుకు నిరాకరించాడు. దీంతో అతడు సీనియర్ల దృష్టికి తీసుకెళ్లి వారితో కలిసి తనపై దాడి చేశారని బాధితుడు మర్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రిలో చేరేలా తీవ్రంగా గాయపరచినట్లు పేర్కొన్నాడు.
ఈ ఘటనపై ర్యాగింగ్ సెల్‌కు సైతం ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రాంభించారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించాక..దాడి ఘటనలో ఇతరుల పాత్ర ఉందని తేలితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ డా.మోహన్‌దాస్ తెలిపారు. ఎవరైనా ర్యాగింగ్ బారిన పడినా, ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు దాడి ఘటనకు ఉత్తరాది, దక్షిణాది అంటూ విద్యార్ధులు విడిపోవడమే కారణమని ప్రచారం జరుగుతోంది. నీట్ అడ్మిషన్లలో దేశ వ్యాప్తంగా ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉండటంతో రాజస్తాన్ విద్యార్ధికి ఇక్కడ సీటు లభించింది. లోకల్, నాన్ లోకల్ వివాదం కారణంగానే ఈ గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.