Journalist Yogi Reddy : వరంగల్ లో యువ జర్నలిస్ట్ఆత్మహత్య, కూతురుకు ఉరేసి తానూ సూసైడ్
Journalist Yogi Reddy : ఇన్నాళ్లు ప్రజా సమస్యలపై గొంతెత్తిన గళం మూగబోయింది. ఆర్థిక ఇబ్బందులతో ఓరుగల్లు యువ జర్నలిస్ట్ యోగి రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొమ్మిదేళ్ల కుమార్తెకు ఉరేసి, తానూ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనతో జర్నలిస్ట్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Journalist Yogi Reddy : నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసే ఓ యువ జర్నలిస్ట్ అర్థాంతరంగా తనువు చాలించాడు. తొమ్మిదేళ్ల తన కూతురుకు ఉరేసి, తానూ ఉరి పెట్టుకుని చనిపోయాడు. తన వ్యక్తిగత ఆఫీస్రూమ్లో ఇంతటి దారుణానికి పాల్పడగా, ఓరుగల్లు జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన గట్టికొప్పుల యుగంధర్ రెడ్డి అలియాస్ యోగి (38) కెమెరా మెన్ గా మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనకు భార్య స్వప్న, కూతురు ఆద్యా రెడ్డి(9) ఉన్నారు. కాగా ఓ ప్రముఖ యూ ట్యూబ్ఛానల్లో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేసిన యోగి.. రెండు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల కిందట హనుమకొండ బాల సముద్రంలోని ఏకశిలా పార్కు ఎదురుగా ఓ ఇంట్లో రూమ్ అద్దెకు తీసుకుని తన సొంతంగా ఆఫీస్రన్చేస్తున్నాడు.
నక్కలగుట్టలోని ఓ ప్రైవేటు స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్న తన కూతురు ఆద్యాను శుక్రవారం ఉదయం యోగి బయటకు తీసుకుని వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి చేరకపోవడంతో స్వప్న వారికి చాలాసార్లు ఫోన్ ట్రై చేసింది. కానీ లిఫ్ట్ చేయకపోవడంతో స్వప్న యోగితో కలిసి ఉండే మిత్రులకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చింది. ఆ తరువాత సాయంత్రం సమయంలో ఆఫీస్ కు వెళ్లినట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఆఫీస్ కు డోర్ వేసి కనిపించింది. కిటికీలోంచి చూడటంతో యోగి, మరో వైపు ఆద్యా చీరకు ఉరి వేసుకుని కనిపించడంతో వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తలుపులు తొలగించి యోగి, ఆద్యాను కిందికి దించి చూడగా, అప్పటికే యోగి ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. ఆద్యా కొన ఊపిరితో ఉన్నట్టు గ్రహించి, హుటాహుటిన బాలసముద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన డాక్టర్లు చిన్నారి కూడా మరణించినట్లు నిర్ధారించారు.
కూతురంటే ప్రాణం..!
యోగి రెడ్డికి తన కూతురంటే ఎంతో ప్రేమ. ఆద్యా కూడా తండ్రి అడుగుజాడల్లోనే మెదులుతూ వస్తోంది. ప్రతి విషయంలోనూ తండ్రినే ఫాలో అయ్యేది. ఈ క్రమంలోనే ఇద్దరి మనస్తత్వం కూడా ఒకేలా ఉండేదని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దాదాపు రెండు నెలల కిందట యూ ట్యూబ్ ఛానల్ లో ఉద్యోగం మానేసిన యోగి.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇతర ఛానల్స్ లో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా ఓ వైపు ఇంటి అద్దె భారం, మరో వైపు ప్రస్తుతం వేతనం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాను చనిపోతే తాను ప్రాణంగా చూసుకునే కూతురు ఆద్యా రెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయపడి పోయిన యోగి.. ముందుగా కూతురుకు ఉరివేశాడు. ఆ తరువాత ఆయనా అదే చీరతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
అనతికాలంలోనే ఫైర్ఉన్న జర్నలిస్ట్ గా..
కొంతకాలం వివిధ మీడియా సంస్థల్లో కెమెరా మెన్ గా పనిచేశాడు యోగి. ఆ తరువాత ఓ పేరు గాంచిన యూట్యూబ్ ఛానల్ లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, విద్యా, వైద్య రంగాలు, తదితర సామాజిక సమస్యలపై తనదైన శైలిలో గళం విప్పేవాడు. దీంతో అనతికాలంలోనే ఓరుగల్లు జర్నలిస్టుల్లో తనకూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వ్యక్తిగా జనాల్లోనూ మంచి పేరు సంపాదించాడు. సీనియర్ జర్నలిస్టుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.
స్వగ్రామంలో అంత్యక్రియలు
యోగి కుటుంబంతో కలిసి బాలసముద్రంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆయన మరణించిన విషయం తెలిసిన తరువాత ఇంటి యజమానులు అక్కడ అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు నిరాకరించారు. వారి ఇంట్లో ఓ శుభకార్యం ఉండటంతో అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. కాగా శనివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం యోగి, ఆద్యా రెడ్డి డెడ్ బాడీలను బాలసముద్రంలోని వరంగల్ ప్రెస్ క్లబ్ కు తరలించారు. అక్కడ జర్నలిస్టులంతా నివాళులర్పించిన అనంతరం యోగి స్వగ్రామం జనగామ జిల్లా వనపర్తి గ్రామానికి తీసుకెళ్లారు. కాగా సాటి జర్నలిస్టుల అశ్రు నయనాల నడుమ యోగి, ఆయన కూతురు ఆద్యారెడ్డి అంతిమ యాత్ర నిర్వహించారు.
తీవ్ర విషాదంలో జర్నలిస్ట్ లోకం
అందరితో కలివిడిగా ఉండే జర్నలిస్ట్ యోగి.. అర్థాంతరంగా తనువు చాలించడంతో ఓరుగల్లు జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆర్థిక ఇబ్బందుల వల్లే యోగిలాంటి నిఖార్సైన జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడని, ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలవకపోవడం కూడా యోగి ఆత్యహత్యకు కారణమని వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు ఇళ్లు, ప్లాట్లు ఇస్తామని నమ్మిస్తూ వస్తున్న ప్రభుత్వాలు.. జర్నలిస్టుల ఆకలి చావులకు కారణమవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే ఎంతో మంది జర్నలిస్టులు గూడు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం కలగ జేసుకుని వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం