Warangal BRS : అసంతృప్త సెగ్మెంట్లపై సీఎం కేసీఆర్ ఫోకస్, రెండు చోట్ల ప్రజా ఆశీర్వాద సభలు-warangal cm kcr focus on brs dissident constituencies wardhannapet mahabubabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Brs : అసంతృప్త సెగ్మెంట్లపై సీఎం కేసీఆర్ ఫోకస్, రెండు చోట్ల ప్రజా ఆశీర్వాద సభలు

Warangal BRS : అసంతృప్త సెగ్మెంట్లపై సీఎం కేసీఆర్ ఫోకస్, రెండు చోట్ల ప్రజా ఆశీర్వాద సభలు

HT Telugu Desk HT Telugu
Oct 24, 2023 09:29 PM IST

Warangal BRS : వరంగల్ జిల్లాలో అసమ్మతి చెలరేగిన స్థానాలపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. వర్ధన్నపేట, మహబూబాద్ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార సభలు ఖరారయ్యాయి. సీఎం కేసీఆర్ పర్యటనతో పరిస్థితి మారుతుందని స్థానిక నేతలు భావిస్తున్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

Warangal BRS : అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సీఎం కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. ఈ నెల 26 నుంచి రెండో విడత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు అసంతృప్త నియోజకవర్గాలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేలపై నిరసనలు, పార్టీ క్యాడర్ లో అసమ్మతి చెలరేగిన నియోజకవర్గాల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 27న వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గాలకు సీఎం రానున్నారు. రెండు చోట్లా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సభ నిర్వహణకు స్థలాలను మంగళవారం సాయంత్రం పరిశీలించారు.

yearly horoscope entry point

అసంతృప్తిని చల్లార్చేందుకేనా?

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలపై కొద్దిరోజుల కిందట తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలోని కొందరు నేతలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. మహబూబాబాద్ మండలం ముడుపుగల్లు, కేసముద్రం, మదనకుర్తి గ్రామాల్లోని మామిడితోటల్లో అసమ్మతి నేతలంతా మీటింగులు పెట్టుకుని శంకర్ నాయక్కు టికెట్ ఇవ్వద్దంటూ తీర్మానాలు చేసుకున్నారు. ఇక వర్ధన్నపేట నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, హసన్ పర్తి పీఏసీఎస్ ఛైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి, ఉద్యమకారులు, ఇతర నేతలు అసమ్మతి రాజేసి.. అరూరికి టికెట్ ఇవ్వొద్దంటూ మంత్రి దయాకర్రావుతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో వినోద్ కుమార్ తో పాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇరువర్గాలకు సర్ది చెప్పి తాత్కాలికంగా అసమ్మతిని చల్లార్చారు. కాగా ఇప్పటికీ కొందరిలో అసంతృప్తి రగులుతుండగా.. ఆ ప్రభావం ఓటర్లపై పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ జనాల్లో సీఎం కేసీఆర్ అంటే అభిమానం ఉండగా.. ఆయన మాటల మ్యాజిక్కు ప్రభావం చూపిస్తే.. అంతా సెట్ అయిపోతుందనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నారట. అందుకే సీఎం కేసీఆర్ ను పట్టుబట్టి మరీ తమతమ నియోజకవర్గాలను తీసుకెళ్లేందుకు పోటీ పడుతున్నట్లు తెలిసింది.

స్టేషన్ ఘన్ పూర్ కట్

సీఎం కేసీఆర్ మొదటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 ఖమ్మం జిల్లా పాలేరుతో పాటు స్టేషన్ ఘన్ పూర్ లో పర్యటించి, ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ మధ్యే స్టేషన్ ఘన్ పూర్ లో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి కూల్ చేశారు. దీంతో ఆయన కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరికి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. అక్కడి పరిస్థితి అంతా సెట్ అవడంతో స్టేషన్ ఘన్ పూర్ ను సీఎం షెడ్యూల్ లో నుంచి తీసేసినట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు.

27న రెండు చోట్ల ప్రజా ఆశీర్వాద సభలు

మంగళవారం విడుదలైన సీఎం కేసీఆర్ రెండో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఖమ్మం జిల్లా పాలేరుతో పాటు మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు వర్ధన్నపేట సభను గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ పరిధిలోని భట్టుపల్లి ఎస్సార్ కాలేజీ పక్కనున్న గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. దీంతో సభా స్థలాన్ని మంగళవారం సాయంత్రం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఇతర స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. 27న మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా పార్టీ నాయకులకు సూచించారు. కాగా అసంతృప్తి చెలరేగిన నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.

(రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner