Medak Tragedy: ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు.. షాక్‌లో వారి స్నేహితుడు
Medak Tragedy: మెదక్ జిల్లాలో విషాదం జరిగింది. ముగ్గురు యువకులు ఈతకు వెళ్లగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మూడో వ్యక్తి షాక్‌లో ఉండి.. ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఎట్టకేలకు ఆ యువకుడు నోరు విప్పడంతో.. అసలు విషయం తెలిసింది.
మెదక్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ముగ్గురు స్నేహితులు కలిసి సరదాగా ఈత కొట్టడానికి ఓ క్వారీ గుంతలోకి వెళ్లారు. ఆ క్వారీ గుంతలో నీరు నిండుగా ఉంది. దీంతో ఈత కొడుతున్న వారిలో ఇద్దరు యువకులు మునిగిపోయారు. వారి స్నేహితుడు భయంతో ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్లాడు. ఎవరికైనా చెబితే తనను ఏమంటారోననే భయంతో.. నోరు విప్పలేదు. అయితే.. ఈతకు వెళ్లిన యువకులు ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని నిలదీశారు. దీంతో 18 గంటల తర్వాత నోరు విప్పాడు .
ఈత రాకపోయినా..
మాసాయిపేట గ్రామానికి చెందిన రాజు, తన స్నేహితులైన డప్పు నవీన్ (22), నెల్లూరు రాము (26).. గ్రామ శివారులో ఉన్న క్వారీ గుంత దగ్గరకి మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఇటీవల వచ్చిన వర్షాలకు క్వారీ గుంత నిండింది. దీంతో నవీన్, రాము ఇద్దరు ఉత్సాహంగా అందులోకి దూకారు. ఈత రాకపోయినా వారు చాల దూరం ఈదుకుంటూ వెళ్లారు. తిరిగి రావటానికి ఇబ్బంది పడ్డారు. మధ్యలోనే మునిగిపోయారు. వారిని కాపాడుదామంటే.. రాజుకు ఈత రాదు. దీంతో తన స్నేహితులు మునిగిపోతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. గ్రామానికి క్వారీ దూరంగా ఉండటంతో.. సాయం కోసం పిలిచినా ఎవ్వరు రాలేదు.
షాక్‌లో రాజు..
ఈ ఘటనతో రాజు షాక్‌లోకి వెళ్లాడు. ఏమి తెలియనట్టుగానే ఇంటికెళ్లాడు. నవీన్, రాము తల్లితండ్రులు వారి కుమారులిద్దరు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. తమ కుమారులు ఎవరితో వెళ్లారో కనుక్కుంటూ.. రాజు దగ్గరికి వచ్చారు. చివరకు జరిగిన ఘటన గురించి రాజు వివరించడంతో.. మృతుల తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొన్ని గంటల ప్రయత్నం తర్వాత.. నవీన్, రాముల మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం బయటకు తీశారు.
వారి కుటుంబాలని ఆదుకోవాలి..
వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఒకేరోజు గ్రామంలో ఇద్దరు యువకులు మరణించడంతో.. విషాదఛాయలు అలుముకున్నాయి. నవీన్, రాము వాళ్లవి పేద కుటుంబాలు. ఎదిగిన కొడుకులను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)