Telangana Congress : మైనంపల్లి ఎఫెక్ట్...! తెరపైకి 'ఒకే కుటుంబానికి 2 టికెట్లు'-two tickets for one family became a hot topic in telangana congress after mynampally joined the party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress : మైనంపల్లి ఎఫెక్ట్...! తెరపైకి 'ఒకే కుటుంబానికి 2 టికెట్లు'

Telangana Congress : మైనంపల్లి ఎఫెక్ట్...! తెరపైకి 'ఒకే కుటుంబానికి 2 టికెట్లు'

Mahendra Maheshwaram HT Telugu
Sep 29, 2023 03:12 PM IST

TS Assembly Elections 2023: మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ లో రెండు టికెట్ల అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. తమకు కూడా రెండు టికెట్లు ఇవ్వాలని పలువురు సీనియర్ నేతలు… హైకమాండ్ ను కోరే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

రాహుల్ గాంధీాతో మైనంపల్లి
రాహుల్ గాంధీాతో మైనంపల్లి

Telangana Assembly Elections 2023 : త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరంలోకి దిగింది. నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది.మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్…ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే కార్యాచరణను సిద్ధం చేయటంతో పాటు… విజయభేరి సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. అంతేకాదు కీలకమైన ఆరు హామీలతో గ్యారెంటీ కార్డును ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది. ఇక అభ్యర్థుల జాబితాను ప్రకటించటమే మిగిలి ఉంది. ఇదే సమయంలో అధికార పార్టీలోని అసంతృప్తులకు గాలం వేసి… తమవైపు తిప్పుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ చేరిక అంశం… పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తాము అడిగిన రెండు టికెట్లు ఇవ్వకపోవటంతో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన మైనంపల్లి… కారు దిగేశారు. కొద్దిరోజుల పాటు వేచి చూసిన ఆయన… తాజాగా ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా హస్తం గూటికి చేరారు. అయితే రెండు టికెట్ల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే… మైనంపల్లి కాంగ్రెస్ లో చేరారని తెలుస్తోంది. మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లికి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ కు ఛాన్స్ ఇవ్వటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదే విషయంపై రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగా హింట్ ఇచ్చారు. సీట్లపై హైకమాండ్ నుంచి హామీ వచ్చిన తర్వాతే…. మైనంపల్లి కాంగ్రెస్ లో చేరారనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరి పేరు కాంగ్రెస్ జాబితాలో ఉండటం ఖాయమే అని టాక్ జోరుగా నడుస్తోంది.

తెరపైకి మరికొందరు…?

కొద్దిరోజుల క్రితమే ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశం తెలంగాణ కాంగ్రెస్ లో చర్చకు వచ్చింది. ఈ విషయంలో ఉత్తమ్, రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగినట్లు వార్తలు కూడా వచ్చాయి. కట్ చేస్తే….తాజాగా మైనంపల్లి చేరికతో మళ్లీ ఈ ఇష్యూ తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి… రెండు టికెట్లను గట్టిగా కోరుతున్నారు. తాను పోటీలో ఉండటం లేదని… తన ఇద్దరు కుమారులకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రెండు టికెట్లు కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆయనే కాకుండా… ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా మొదట్నుంచి రేసులో ఉన్నారు. అందోల్‌ నుంచి దామోదర రాజనరసింహతో ఆయన కూతురు త్రిష, ములుగు నుంచి సీతక్క, పినపాక నుంచి ఆమె కుమారుడు సూర్యం కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కూడా రెండు టికెట్లు ఆశిస్తున్నారు. ఇక కొండ మురళీ దంపతులకు రెండు టికెట్లు కావాలని కోరుతున్నారు. పరకాల నుంచి కొండ మురళీకి, వరంగల్‌ తూర్పు నుంచి కొండ సురేఖ టికెట్‌ ఆశిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన మరోనేత అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇదే జాబితాలో ఉన్నారు.

ఒకే కుటుంబంలో ఇద్దరిద్దరికి టికెట్లు కావాలంటూ పట్టుబడుతుండటంతో పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన వారికి రెండు టికెట్లపై హామీ ఇస్తే… పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమకు ఎందుకు ఇవ్వరనే వాదనను పలువురు నేతలు తెరపైకి తీసుకువస్తున్నారు. మరోవైపు కుటుంబానికి ఒకే టికెట్ అన్న విషయంపై ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో క్లియర్ గా ఉంది. ఈ డిక్లరేషన్ ప్రకారం చూస్తే…. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వటం కష్టమే. కానీ ఈ విషయంలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది…!

టీ20 వరల్డ్ కప్ 2024