Sangareddy : నారింజ వాగులో ఇద్దరు కర్ణాటక వాసులు గల్లంతు.. ఒకరిని కాపాడిన స్థానికులు-two karnataka natives drowned in the narinja river in sangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy : నారింజ వాగులో ఇద్దరు కర్ణాటక వాసులు గల్లంతు.. ఒకరిని కాపాడిన స్థానికులు

Sangareddy : నారింజ వాగులో ఇద్దరు కర్ణాటక వాసులు గల్లంతు.. ఒకరిని కాపాడిన స్థానికులు

HT Telugu Desk HT Telugu
Sep 26, 2024 07:11 PM IST

Sangareddy : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జహీరాబాద్ మండలంలోని నారింజ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కర్ణాటక, జహీరాబాద్ ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వాగు దాటే ప్రయత్నం చేయగా.. అదుపుతప్పి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

నారింజ వాగులో ఇద్దరు గల్లంతు
నారింజ వాగులో ఇద్దరు గల్లంతు

కర్ణాటకలోని బీదర్ పట్టణం మైలూరుకు చెందిన షాకీర్ (40) హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (60) కొన్నేళ్ల కిందటే బీదర్‌లో స్థిరపడ్డాడు. వీరిద్దరూ కలిసి బుధవారం ద్విచక్ర వాహనంపై బీదర్ నుండి జహీరాబాద్‌కు బయల్దేరారు. బుచనెల్లి గ్రామ సమీపంలో నారింజ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నారింజ వాగు వంతెనపై నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా.. వారు బైక్‌ను ముందుకు పోనిచ్చారు. వంతెనపై కొంతదూరం ప్రయాణించాక వీరి బైక్ అదుపుతప్పి నీటిలో పడిపోయింది. వరద ప్రవాహంలో బైక్ తోపాటు ఇద్దరు కొట్టుకుపోయారు.

ఒకరిని కాపాడిన స్థానికులు..

ఇస్మాయిల్‌కు ఈత రావడంతో కొంతదూరం ఈదుకుంటూ వచ్చి చెట్లకొమ్మలు పట్టుకొని అరిచారు. గమనించిన గ్రామస్థులు అక్కడికి వచ్చి అతడిని కాపాడారు. షాకీర్ నీటిలో గల్లంతయ్యాడు. ఈ విషయాన్నీ గ్రామస్థులు అధికారులకు చెప్పారు. వెంటనే జహీరాబాద్ తహశీల్ధార్ రవీందర్, ఎంపీడివో మహేందర్ రెడ్డి, ఆర్ఐ రుక్మొద్దీన్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రాణాలతో బయటపడ్డ ఇస్మాయిల్‌ను పరామర్శించారు. జహీరాబాద్, కర్ణాటక పోలీసులు, అధికారులు.. నీటిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ ఇంకా లభించలేదు.

మెదక్‌లో మరో ఘటన..

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి, మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఇంట్లో నుండి వెళ్లి గ్రామా శివారులోని చెక్ డ్యామ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని శబాష్ పల్లి గ్రామంలో బుధవారం జరిగింది. శబాష్ పల్లి గ్రామానికి చెందిన పగిడే బాబు (35) ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిసై బాబు.. తరచూ భార్యతో గొడవపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికొచ్చిన బాబు.. భార్యతో గొడవపడ్డాడు.

అనంతరం ఇంట్లో నుండి వెళ్లిపోయి గ్రామ శివారులో ఉన్న పిల్లిగుండ్ల మత్తడి చెక్ డ్యామ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి వెళ్లిన భర్త ఉదయం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో.. భార్య చుట్టుపక్కల మొత్తం వెతికింది. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు కలిసి వెతకగా.. చెక్ డ్యామ్‌లో మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్ రెడ్డి చెప్పారు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)