Siddipet District : 20 ఆలయాల్లో చోరీ..! సిద్ధిపేట పోలీసులకు చిక్కిన ముఠా-two arrested for stealing in temples in siddipet district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet District : 20 ఆలయాల్లో చోరీ..! సిద్ధిపేట పోలీసులకు చిక్కిన ముఠా

Siddipet District : 20 ఆలయాల్లో చోరీ..! సిద్ధిపేట పోలీసులకు చిక్కిన ముఠా

HT Telugu Desk HT Telugu
Aug 28, 2024 04:33 PM IST

గ్రామ దేవత ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి బంగారం, వెండితో పాటు రెండు బైకులను స్వాధీనం చేశారు. దాదాపు 20 ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఇద్దరిని అరెస్ట్ చేయగా… మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్,
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్,

గ్రామ దేవత ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట పోలీసులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 20 దేవాలయాలలో దొంగతనాలు చేసినట్లు  వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5. 5 తులాల పుస్తె మెట్టెలు, 182 తులాల వెండి కిరీటం, శ్రీ చక్రం, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ రూ. 7 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

సిద్దిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం… కొహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బోదాసు యాదగిరి, కొమిరె శ్రీనివాస్, ధాల్మిట్ట మండలానికి చెందిన వల్లెపు శేఖర్ అనే ముగ్గురు ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముగ్గురు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ దేవాలయాలల్లో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

20 ఆలయాల్లో చోరీ .....

చిన్నకోడూర్ మండల కేంద్రంలోని రామునిపట్ల గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై SI బాలకృష్ణ, సిబ్బంది తో కలిసి మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇబ్రహీంనగర్ నుండి సిద్దిపేట వైపు టీవీఎస్ ఎక్సెల్ మీద బోదాసు యాదగిరి,వల్లెపు శేఖర్ వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారించగా గ్రామాల్లో ఊరు బయట ఉన్న గ్రామ దేవాలయాలలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. మరో నిందితుడు కొమిరె శ్రీనివాస్ పరారీలో ఉన్నట్టు వారు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని ఏసీపీ మధు తెలిపారు.

నిందితులు సిద్దిపేట జిల్లా కమిషనరేట్ పరిధిలోని 20 గ్రామ దేవతల ఆలయాల్లో చోరీకి పాల్పడ్డట్టు పేర్కొన్నారు. నిందితుల నుండి 5.5 తులాలు పుస్తె మట్టలు, 182 తులాల వెండి పట్టు కిరీటం,శ్రీ చక్రం, రెండు మోటార్ బైక్ లను స్వాధీన పర్చుకున్నట్లు వెల్లడించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని ఏసీపీ మధు అభినందించారు.

మెదక్ లో మరో ఘటన :

తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ చేసి రెండున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మర్పల్లి గ్రామానికి చెందిన మన్నే లక్ష్మి ఈ నెల 22 న ఇంటికి తాళం వేసి మల్లన్న గుట్ట ఆశ్రమానికి వెళ్ళింది. కాగా మంగళవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి వేసిన తాళం వేసినట్టుగానే ఉంది. కానీ ఇంట్లో బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలు ఎవరో దొంగిలించినట్లు గుర్తించింది. బాధితురాలు వెంటనే పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.