TSRTC Srisailam Tour Package : శ్రీశైలానికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ- దర్శనం, కృష్ణానదిలో బోటింగ్ కూడా!-tsrtc special tour package to srisailam temple from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Srisailam Tour Package : శ్రీశైలానికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ- దర్శనం, కృష్ణానదిలో బోటింగ్ కూడా!

TSRTC Srisailam Tour Package : శ్రీశైలానికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ- దర్శనం, కృష్ణానదిలో బోటింగ్ కూడా!

Bandaru Satyaprasad HT Telugu
Jul 19, 2023 07:26 PM IST

TSRTC Srisailam Tour Package : శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండ్రోజు టూర్ ప్యాకేజీని ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నారు.

శ్రీశైలం టూర్ ప్యాకేజీ
శ్రీశైలం టూర్ ప్యాకేజీ

TSRTC Srisailam Tour Package : శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి వారాంతంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి స్పెషల్ బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్‌.. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ టూర్ ప్యాకేజీలో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి ద‌ర్శనంతో పాటు పాతాళ‌గంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.

వీకెండ్ లో ప్రత్యేక టూర్

ప్రతి శనివారం ఉదయం శ్రీశైలానికి టూర్‌ ప్రారంభమవుతుంది. ఈ టూర్ లో మొదటి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఉదయం 8 గంటలకు బస్సు ఎంజీబీఎస్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. యాత్రికుల బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. అదే రోజు మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక 3 గంటలకు పాతాళగంగకు యాత్రికులకు తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులను తీసుకెళ్తారు. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్‌లో యాత్రికుల బస ఉంటుంది.

టూర్ ప్యాకేజీలోనే దర్శనం

రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం టిఫిన్‌ చేసి హోటల్‌ నుంచి చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం విజిట్ ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను యాత్రికులు సందర్శిస్తారు. మార్గమధ్యలో భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు తిరిగి చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం టూర్ ప్యాకేజీలోనే ఉంటాయి. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులు ఏర్పాటుచేసుకోవాలి.

ప్రతి రోజు 40 సర్వీసులు

" శ్రీశైలం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని టీఎస్ఆర్టీసీ అందిస్తుంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ టూర్ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని భక్తులందరూ వినియోగించుకోవాలి. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ http://tsrtconline.in లో టికెట్లను బుక్ చేసుకోవాలి. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించవచ్చు" అని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు.

Whats_app_banner