TSPSC Group 4 : ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష, 80 శాతం మంది హాజరు!
TSPSC Group 4 : తెలంగాణ గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
TSPSC Group 4 : టీఎస్పీఎస్సీ శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8180 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 80శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కమిషన్ పేర్కొంది. పేపర్-1 జనరల్ స్టడీస్ కు 7,62,872 మంది హాజరు కాగా, పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు సరైనా సమయానికి చేరుకోలేకపోవడంతో పరీక్ష రాసేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో కొందరు అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.
బలగం సినిమాపై ప్రశ్న
గ్రూప్-4 పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ఆర్థిక స్థితిగతులపై ఎక్కువ ప్రశ్నలొచ్చాయి. అయితే గ్రూప్ 4 పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న వైరల్‌గా అవుతోంది. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బలగం మూవీ గురించి గ్రూప్-4లో ఒక ప్రశ్న వచ్చింది. బలగం సినిమాను జబర్దస్త్ కమెడియన్ యెల్దండి వేణు దర్శకత్వం వహించారు. దిల్ రాజు, హన్షితా రెడ్డి, హర్షిత్‌రెడ్డి ఈ సినిమానకు నిర్మాతగా ఉన్నారు. బలగం సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. బలగం సినిమాపై గ్రూప్-4 పరీక్షలో ప్రశ్న అడగడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు చిత్ర బృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. డైరెక్టర్ యెల్దండి వేణు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు.
సెల్ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి
పేపర్ల లీకేజీ వ్యవహారం అనంతరం టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తుంది. అయినా కొందరు అభ్యర్థులు అధికారుల కళ్లుగప్పి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-4 పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి సెల్ ఫోన్ పట్టుబడడం సంచలనం రేపింది. హైదరాబాద్ సరూర్ నగర్ లోని సక్సెస్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. పరీక్ష మొదలైన అరగంట తర్వాత అభ్యర్థి వద్ద ఫోన్ ను గుర్తించిన ఇన్విజిలేటర్...ఫోన్ తీసుకుని సీజ్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మాల్ ప్రాక్టీస్ కింద అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మినహా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో ఒకరోజు ముందు వరకు 95 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొన్నది గ్రూప్-4కు మాత్రమే అని అధికారులు చెబుతున్నారు.