Telangana Govt White Paper : తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు - శ్వేతపత్రాన్ని విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్-ts govt released a white paper on the economic situation of the state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Govt White Paper : తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు - శ్వేతపత్రాన్ని విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్

Telangana Govt White Paper : తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు - శ్వేతపత్రాన్ని విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 20, 2023 01:07 PM IST

Telangana Govt White Paper : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి… శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర మొత్తం అప్పులను రూ 6,,71,757 కోట్లుగా పేర్కొన్నారు.

శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి
శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి

Telangana Govt White Paper : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 42 పేజీలతో శ్వేతపత్రాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లుగా ఉందని తెలిపింది. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లుగా ఉండగా.. పదేళ్లలో సగటున 24.5 శాతం పెరిగాయని తెలిపింది. ప్రస్తుత రాష్ట్ర రుణం రూ.3లక్షల 89 వేల కోట్లుగా ఉందని వెల్లడించిన సర్కార్.. ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లుగా ఉన్నట్లు వివరించింది.

బీఆర్‌ఎస్‌ పాలనలో గత పదేళ్లలో తెలంగాణ అప్పులు రూ.72,658 కోట్ల నుంచి రూ.6,71,757 కోట్లకు పెరిగినట్లు శ్వేతపత్రంలో పేర్కొంది ప్రభుత్వం. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో పెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం బడ్జెట్‌ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే చేసినట్లు వెల్లడించింది. బడ్జెట్‌కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందన్న సర్కార్.. పదేళ్లలో చేసిన ఖర్చుకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని స్పష్టం చేసింది.

శ్వేతపత్రంలోని ముఖ్య అంశాలు:

-తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు.

- 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ 72,658 కోట్లు.

- తెలంగాణ బడ్జెట్ వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది.

-ప్రస్తుతం 6, 71, 757 కోట్లకు అప్పు పెరిగింది.

-పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు

-2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది.

-2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.

-2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం. అదే 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.

-కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం రూ. 97,449 కోట్లు మంజూరు కాగా… ఇందులో రూ. 79,287 కోట్లు విడుదలయ్యాయి. రూ. 74,950 కోట్లు చెల్లించాల్సి ఉంది.

-గృహనిర్మాణశాఖకు సంబంధించి 6,470 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. తాగునీటి కార్పొరేషన్ కు సంబంధించి రూ. 20,200 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి రూ. 2,951 కోట్ల బకాయిలు ఉన్నట్లు శ్వేతపత్రంలో పేర్కొంది.

-2014 - 15లో జీతాలు, పెన్షన్ల వ్యయం రూ. 17, 130 కోట్లు ఉండగా... 2021 - 22లో రూ. 48,809 కోట్లుగా ఉంది. దాదాపు మూడు రెట్లు పెరిగిందని ప్రభుత్వం తెలిపింది.

-ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది.

-2021-22లో ద్రవ్యలోటు, జీఎస్డీపీ నిష్పతిపరంగా.. ఇతర జనరల్ కేటగిరి రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పనితీరు చాలా తక్కువగా ఉంది.

-పీఆర్ఎస్ అక్టోబరు 2023 ప్రచురించిన స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ నివేదిక ప్రకారం... 2023 -24లో రాష్ట్రాలు తమ బడ్జెట్లో సగటును 14.7 శాతం విద్యపై ఖర్చు చేస్తామని అంచనా వేయగా... తెలంగాణ మాత్రం 7.6 శాతం ఖర్చు చేస్తుందని అంచనా వేయబడింది. ఇది అత్యల్పంగా ఉందని ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో తెలిపింది.

-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 57 ఏళ్లలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రూ. 4,98 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దీనికి విరుద్ధంగా గత పదేళ్లలో రాష్ట్రం మరియు ఎస్పీవీల మొత్తం అప్పు 2014 -15లో రూ. 72,658 కోట్ల నుంచి రూ. 6,71,757 కోట్లకు పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.

Whats_app_banner