TRS to BRS: భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్.. తీర్మానం ఆమోదం
KCR National Party: టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
bharat rashtra samithi party: ఈ తీర్మానాన్ని సమావేశం ముందు పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశం జరిగింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరంపై కేసీఆర్ మాట్లాడారు. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ సహా సభ్యులందరూ ప్రగతిభవన్ వెళ్లి భోజనం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. ఇందుకోసం హైదరాబాద్ లోని జలదృశ్యం వేదికైంది. 2001 ఏడాదిలో ఏప్రిల్ 27 కొంతమంది తెలంగాణవాదుల సమక్షంలో పార్టీని ప్రకటించారు కేసీఆర్. టీడీపీకి రాజీనామా ప్రకటించిన కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక అజెండాగా టీఆర్ఎస్ వస్తుందని స్పష్టం చేశారు. అయితే పార్టీ ఏర్పడిన కొద్దిరోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందులో పోటీ చేసిన టీఆర్ఎస్.. పలు స్థానాల్లో విజయం సాధించింది. ఇదే క్రమంలో తెలంగాణలోని పది జిల్లాల్లోనూ సభలు.. పాదయాత్రల పేరుతో రాష్ట్ర ఏర్పాటు విషయంలో భావజాలవ్యాప్తికి ఎంతో కృషి చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా మారింది. బీఆర్ఎస్ అజెండా, జెండా ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. పలు ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ లో విలీనం అవుతాయనే వార్తలు కూడా వస్తున్నాయి.