KCR National Party: ఇవాళే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన... జెండా, అజెండా ఖరారు..!
kcr new party: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్...జాతీయ స్థాయిలో విస్తరించబోతుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు.
Today KCR Announced National Party: కేసీఆర్....ఈ పేరుకు కేరాఫ్ తెలంగాణ.! తెలంగాణ అంటే కేసీఆర్...!! మరోమాటలో చెప్పాలంటే తెలంగాణ అంటే టీఆర్ఎస్...! టీఆర్ఎస్ అంటే తెలంగాణ... !!కేవలం ప్రత్యేక రాష్ట్రమనే ఏకైక అజెండాతో పుట్టుకొచ్చిన పురుడు పొసుకున్న టీఆర్ఎస్.... 2 దశాబద్ధాలుకు పైగా రాడకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. కేసీఆర్ దీక్ష తర్వాత తిరుగులేని పార్టీగా మారిన గులాబీ పార్టీ... అనుకున్నట్లు రాష్ట్రాన్ని సాధించటంలో అగ్రభాగాన నిలిచింది. కొత్త రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాన్ని పొంది అధికారపీఠంపై కొలువుదీరింది. బలమైన ఉద్యమ, రాజకీయ నేపథ్యంగా పేరొందిన తెలంగాణ రాష్ట్ర సమితి... రూపాంతరం చెందబోతుంది.
విజయదశమి వేళ కొత్త చరిత్రకు పురుడుపోయబోతున్నారు కేసీఆర్. పండగవేళ ప్రగతిభవన్ సాక్షిగా జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు. భారతీయ రాష్ట్ర సమితి అని పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఇది టీఆర్ఎస్ రూపాంతరమా...? లేక బీఆర్ఎస్ అనేది జాతీయ రాజకీయాల కోసమే ఏర్పాటు చేస్తున్నారా..? బీఆర్ఎస్ ప్రకటిస్తే టీఆర్ఎస్ విలీనం చేస్తారా..? కొత్త పార్టీ జెండా... అజెండా ఏంటి...? అనేది స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారు. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 1.19 నిమిషాలకు వివరాలను వెల్లడిస్తారు.
జేడీఎస్ నేతల హాజరు....
ఇక ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సహా పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు పలకనున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న తదితర జేడీఎస్ నేతలకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర టీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. మరోవైపు తమిళనాడులో దళిత ఉద్యమ పార్టీగా పేరున్న విడుదలై చిరుత్తయిగల్ కచ్చి (వీసీకే) పార్టీకి ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన వీసీకే అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌కు ఎమ్మెల్యే బాల్కా సుమన్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్వాగతం పలికారు. మరో 3 పార్టీల నేతలు కూడా హాజరయ్యే అవకాశముందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
మీడియా సమావేశం...
మరోవైపు ఇవాళ్టి భేటీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు ముఖ్య నాయకులందరూ హాజరుకానున్నారు. రాజకీయ తీర్మానంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. అందరి ఆమోదంతో కేసీఆర్ ప్రకటన చేస్తారు. పార్టీ ప్రకటన తర్వాత మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మొత్తంగా విజయదశమి పండగ రోజున భారత రాజకీయాల్లోకి కొత్త పార్టీతో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరిపిన కేసీఆర్... పక్క రాష్ట్రమైన ఏపీ నేతలతోనూ టచ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇతర పార్టీల నుంచి వలసలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. ఇక కేసీఆర్ జాతీయ పార్టీపై పలు పక్షాలు స్వాగతిస్తే... మరికొన్ని పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.