Revanth Reddy : కేసీఆర్ అధికారం మరో 6 నెలలే : రేవంత్ రెడ్డి-tpcc president revanth reddy fires on telangana government on sarpanch finance issues ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy : కేసీఆర్ అధికారం మరో 6 నెలలే : రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేసీఆర్ అధికారం మరో 6 నెలలే : రేవంత్ రెడ్డి

Thiru Chilukuri HT Telugu
Jan 02, 2023 07:21 PM IST

Revanth Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్య పోరులో సర్పంచ్‌లు సమిధలు అవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 35 వేల కోట్ల గ్రామ సర్పంచుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. మంత్రులను అడ్డుకోవాలని సర్పంచులకి పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు నిధులు లేకుండా చేసి గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సర్పంచుల నిధులు, విధులను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంటోందని... ఇప్పటి వరకు రూ. 35 వేల కోట్ల గ్రామ సర్పంచుల నిధులను ప్రభుత్వం తీసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ అక్రమంగా వాడేసుకుంటోందని.. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, కరెంటు బిల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు.

సర్పంచుల నిధుల సమస్య పరిష్కారం కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం విడుదల చేసిన అనంతరం.. బొల్లారం పీఎస్ వద్ద మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ మరో 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటారని.. బిల్లుల కోసం సర్పంచ్‌లు మంత్రులను నిలదీయాలని రేవంత్ పిలుపునిచ్చారు.

"పంచాయతీ నిధులపై సర్పంచ్‌లకు సర్వాధికారాలను ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటోంది. సర్పంచ్‌లకు చట్టపరంగా నిధులు, విధులు కేటాయించారు. గతంలో రిజిస్ట్రేషన్లు, ఇసుక ద్వారా గ్రామాలకు ఆదాయం వచ్చేది. కేసీఆర్ సర్కార్ వాటిని కూడా గ్రామాలకు రాకుండా చేసింది. బడా కాంట్రాక్టర్ల కోసం సర్పంచ్‌లకు నిధులు లేకుండా చేశారు. రూ. లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సర్పంచ్‌ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ధర్నాకు పిలుపునిచ్చాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు. నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారు" అని రేవంత్ ఫైర్ అయ్యారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 6 నెలలు మాత్రమే ఉంటారని ఈ సందర్భంగా రేవంత్ జోష్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులను పంచాయతీ ఖాతాల్లో వెంటనే జమచేయాలని... ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్య పోరులో సర్పంచ్‌లు సమిధలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల కోసం సర్పంచ్‌లు మంత్రులను నిలదీయాలని.. మంత్రులను అడ్డుకునే కార్యక్రమానికి తాము పిలుపునిస్తున్నామని వెల్లడించారు. మంత్రుల కార్యక్రమాలను అడ్డుకోవాలని సర్పంచ్‌లకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ లకు న్యాయం జరిగే వరకు ధర్నా చౌక్‌ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అంతకముందు... సర్పంచుల నిధుల సమస్య పరిష్కారం కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునివ్వడంతో పలువురు నాయకుల్ని పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ నాయకులు జీవన్‌ రెడ్డితో పాటు మల్లు రవి, అద్దంకి దయాకర్‌ తదితరుల్ని ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పీసీసీ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పోలీసులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Whats_app_banner