TSPSC Paper Leak Case: 'సిట్' కు చిక్కిన అన్నా చెల్లి - 39కి చేరిన అరెస్టులు!-three more arrested tspsc question paper leak case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Paper Leak Case: 'సిట్' కు చిక్కిన అన్నా చెల్లి - 39కి చేరిన అరెస్టులు!

TSPSC Paper Leak Case: 'సిట్' కు చిక్కిన అన్నా చెల్లి - 39కి చేరిన అరెస్టులు!

Maheshwaram Mahendra Chary HT Telugu
May 25, 2023 11:03 AM IST

TSPSC Paper Leak Case Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ లపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఫలితంగా పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టుల సంఖ్య 39కి చేరింది.

పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

TSPSC Paper Leak Updates: టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్స్‌(TSPSC Paper Leak) వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా... మరికొందరిని విచారిస్తోంది. తవ్వేకొద్ది అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది సిట్. ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్) పరీక్షలో టాప్ స్కోర్ సాధించిన నల్గొండకు చెందిన అన్నా చెల్లెళ్లయిన రాయపురం విక్రమ్, రాయపురం దివ్యలను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కిశోర్ అనే వ్యక్తి కూడా ఉన్నారు.

అరెస్ట్ అయిన రవి కిశోర్ నల్గొండలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. డ్రైవర్ గా పని చేస్తున్న విక్రమ్, అతడి సోదరి దివ్య... మధ్యవర్తి సురేశ్(గతంలో అరెస్ట్ చేయబడిన) నుంచి డీఏవో(Divisional Accountant Officer) మరియు ఏఈ(Assistant Engineer) పేపర్లను కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఈ కేసులోని ప్రధాన నిందితులైన రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌ల నుంచి పేపర్‌ను తీసుకున్న సురేష్‌కు ఈ ముగ్గురూ కొంత నగదును చెల్లించారు.

ఈ పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ అధికారులకు నోటీసులిచ్చినా తగిన సమాచారం ఇవ్వడంలేదని సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తునకు సహకరించకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా కాన్ఫిడెన్షియల్ ఇన్ ఛార్జి శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారాన్ని రాబట్టింది. ఈ లీకేజీలో శంకర్ లక్ష్మీ హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. 2017 నుంచి టీఎస్పీఎస్సీలో శంకర్ లక్ష్మీ విధులు నిర్వర్తిస్తున్నారు. పేపర్ల వాల్యుయేషన్ చేయలేదని పలువురు అధికారులు సిట్ కు తప్పుడు వివరాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో ముఖ్య నిందితురాలు రేణుక రాథోడ్ కు సంబంధించి కీలక సమాచారాన్ని సిట్ సేకరించింది. న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌ ను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని సిట్ అధికారులు తెలిపారు.

నేడు గ్రూప్- 1పై విచారణ…

మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని 36 మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. రెండు నెలల పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై ఇవాళ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారించనుంది. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకుంటే… గ్రూప్ 1 మరోసారి వాయిదా పడే అవకాశం ఉంటుంది. దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

IPL_Entry_Point