Theft in Police station: ఠాణాలో దొంగలు పడ్డారు.. నిర్ఘాంతపోయిన పోలీసులు
Theft in Police station: ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించే పోలీసులనే దొంగలు నిర్ఘాంతపోయేలా చేసిన ఉదంతమిది.
Theft in Policestation: నిత్యం పోలీసులు విధులకు హాజరయ్యే పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.
స్థానికంగా పకడ్బందీగా రెక్కీ నిర్వహించిన దొంగలు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కే కన్నం పెట్టారు. పోలీసులు ఇటీవల కాలంలో సీజ్ చేసిన గంజాయి, బైకుల చోరీకి పథకం పన్నారు. అయితే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కదా.. అందుకే బయటి దొంగకి ఇంటి దొంగ ఒకరు సహకారం అందించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదీ సంగతి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఇటీవల సీజ్ చేసిన గంజాయితో పాటు రెండు బైకులు మాయమైన ఉదంతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీస్ స్టేషన్లో ఉంచిన గంజాయి వివిధ కేసులలో సీజ్ చేసిన ద్విచక్ర వాహనలు చోరికి గురికావటంతో పోలీసు వర్గాల్లో ఈ అంశం సంచలనంగా మారింది.
పోలీస్ స్టేషన్ లో చోరీ జరగడం ఒకింత సిగ్గు చేటైన అంశం. ఇది ఎంత దాచిపెడదామని చూసినా ఆనోటా, ఈనోటా పడి పది మంది నోట్లో పడింది. దీంతో పోలీస్ స్టేషన్లో చోరీ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
జిల్లా ఉన్నతాధికారులు హుటాహుటిన బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కు చేరుకొని కొంతమంది అనుమానితులైన యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. పోలీస్ స్టేషన్ కే భద్రత లేదంటే మండలంలో నివసిస్తున్న సామాన్యుల పరిస్థితి ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని స్థితిలో పోలీసులు ఉండిపోయారు.
ఇంటి దొంగ సహకారం..
పోలీస్ స్టేషన్ లో దాచిన గంజాయి, ద్విచక్ర వాహనల చోరీ ఘటనపై బయటి దొంగలతో పాటు ఎవరైనా ఇంటి దొంగ సహకారం ఉండి ఉంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడిన విషయం పోలీసులకు ముక్కున వేలేసుకునే స్థితిని కల్పించింది. బయటి వ్యక్తుల పాత్రతో పాటు సొంత శాఖకు చెందిన వారి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఖాకీ చొక్కా వేసుకుని పని చేసే ఠాణాకే అప్రతిష్ట తెచ్చే ఉద్యోగులు ఉన్నారన్న వార్తతో తోటి ఉద్యోగులు ఉలికిపాటుకు గురవుతున్నారు.
దీనిపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తొలుత బయటి దొంగ మాటేమో గానీ, ఈశ్వరుడైనా పట్టలేని ఇంటి దొంగ గుట్టును రట్టు చేయడాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)