TS Govt Pleader: మహిళను వేధిస్తున్న పోకిరి ప్లీడర్ ఆటకట్టు, నిందితుడు మాజీ గవర్నమెంట్‌ ప్లీడర్-the rogue pleader who is harassing the woman is arrested accused is a former government pleader ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Pleader: మహిళను వేధిస్తున్న పోకిరి ప్లీడర్ ఆటకట్టు, నిందితుడు మాజీ గవర్నమెంట్‌ ప్లీడర్

TS Govt Pleader: మహిళను వేధిస్తున్న పోకిరి ప్లీడర్ ఆటకట్టు, నిందితుడు మాజీ గవర్నమెంట్‌ ప్లీడర్

Sarath chandra.B HT Telugu
May 03, 2024 07:12 AM IST

TS Govt Pleader: న్యాయం చేయాల్సిన న్యాయవాది దారి తప్పాడు. మహిళను లైంగికంగా వేధిస్తూ కటకటాల పాలయ్యాడు. కోర్టు ప్రాంగణంలోనే మహిళను తీవ్రంగా వేధిస్తున్న నిందితుడ్ని పక్కా సాక్ష్యాలతో అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లో న్యాయవాదిపై షీటీమ్స్‌ కేసు నమోదు
హైదరాబాద్‌లో న్యాయవాదిపై షీటీమ్స్‌ కేసు నమోదు

TS Govt Pleader: కోర్టు ప్రాంగణంలోనే మహిళపై అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్న పోకిరి ప్లీడర్‌ ఆగడాలకు షీటీమ్స్‌ అడ్డుకట్ట వేశాయి. న్యాయం వైపు నిలవాల్సిన న్యాయవాది, బాధ్యత మరిచి కోర్టు ప్రాంగణంలోనే మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించింది.

న్యాయస్థానం ఆవరణలోనే మహిళను లైంగికంగా వేధిస్తూ వాంఛ తీర్చాలని వెంటపడుతున్న పోకిరిని హైదరాబాద్‌ షీ టీమ్స్‌ పట్టుకున్నాయి. న్యాయవాదిగా, గతంలో ప్రభుత్వ ప్లీడర్‌గా పనిచేసిన ఏ.సంజయ్‌ కుమార్‌ దారి తప్పి వికృత చేష్టలకు పాల్పడటాన్ని సాక్ష్యాలతో సహా రుజువు చేశారు.

న్యాయవాది, మాజీ ప్రభుత్వ ప్లీడర్‌‌గా విధులు నిర్వర్తించిన సంజయ్ కుమార్‌పై ఇటీవల హైదరాబాద్‌ షీ టీమ్స్‌కు ఫిర్యాదు అందింది. సంజయ్ కుమార్ కుమార్ కోర్టు ఆవరణలో మహిళా ఫిర్యాదు దారునితో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, కోరిక తీర్చాలని బలవంతం చేస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

నిందితుడు నిత్యం ఆమెను వెంబడిస్తూ, తన అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే షీ టీమ్స్ న్యాయవాదిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టింది. ఫిర్యాదుదారురాలి వ్యక్తిగత భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని విచారణ చేపట్టారు. బాధితురాలిని వేధింపుల నుంచి కాపాడటానికి రంగంలోకి దిగిన షీటీమ్స్‌ నిందితుడు ఆగడాలు నిజమేనని గుర్తించారు.

ఈ ఘటనపై చార్మినార్ పిఎస్‌లో క్రైమ్ నంబర్ 97/2024 కింద ఐపీసీ సెక్షన్లు 354, 354D,506 IPC కింద సంజయ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. సాక్ష్యాలు మరియు సాక్షుల వాంగ్మూలాలను సేకరించే పనిలో ఉన్నట్లు షీటీమ్స్‌ డీసీపీ తెలిపారు. షీ టీమ్స్ హైదరాబాద్‌లో జరిగిన న్యాయవాది కేసును నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు దారురాలైన మహిళకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రకటించారు.

షీ టీమ్స్ ద్వారా ప్రత్యేకించి మహిళల భద్రత మరియు భద్రతకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలపై ఎలాంటి వేధింపులు ఉన్నా వాటిని అడ్డుకోడానికి కృషి చేస్తామని ప్రకటించారు. మహిళలు ఎలాంటి సాయం కోసమైనా తమపై జరుగుతున్న వేధింపులు, దాడులు, అఘాయిత్యాలపై సహాయం కోసం లేదా సంఘటనలపై ఫిర్యాదు చేయడానికి షీ టీమ్స్ హెల్ప్‌లైన్‌ని WhatsAppలో 9490616555లో సంప్రదించవచ్చన్నారు. మహిళల వివరాలను పూర్తి గోప్యత పాటిస్తామని తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం