Voters List: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. అలాంటి ఓటు హక్కు పొందేందుకు ఎలక్షన్ కమిషన్ మరో అవకాశం కల్పించింది. కొత్త ఓటర్ల నమోదు, ఇదివరకు ఉన్న ఓటర్ జాబితాలో తప్పోప్పులను సరిదిద్దేందుకు ఈరోజు నుంచి సంబంధిత అధికారులు శ్రీకారం చుడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఈరోజు నుంచి చేపడుతుంది. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్ నమోదు, ఓటర్ జాబితాలో తప్పోప్పులను సరిదిద్దేందుకు అధికారులు సిద్దమయ్యారు.
ఈనెల 20 నుంచి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించనున్నారు. అర్హత కలిగిన వారిని ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు అవసరమైన వారి చిరునామాను మార్చనున్నారు. మృతుల వివరాలను జాబితానుంచి తొలగించి... ఫొటో లేనివారివి చేర్చనున్నారు. అందుకు ఇప్పటికే సంబందిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 29,80,447 మంది ఓటర్లు ఉన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయా కళాశాలల యాజమాన్యం విద్యార్థులకు ఓటరు నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. దీంతో ఓటరు నమోదు శాతం పెరిగేందుకు అవకాశముంది. యువతీ, యువకులు బూత్ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనూ అర్జీ చేసుకోవడానికి వీలుంది.
డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో ఏటా సుమారు 6 వేల మంది విద్యార్థులు చేరుతుంటారు. ఈ లెక్కన వేలమంది విద్యార్థులు ఓటు హక్కు అర్హత కలిగి ఉంటారు. కానీ నమోదు శాతం ఆ స్థాయిలో కనిపించడం లేదు. ఇటీవలి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే తరహాలో యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
కొత్తగా ఓటరు నమోదుకు ఫారం 6 నింపాలి. ఫారం 6బి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం, ఫారం 7 జాబితా నుంచి పేరు తొలగింపు, ఫారం 8 తప్పు, ఒప్పుల సవరణలు చేయడానికి పనిచేస్తుంది.
కరీంనగర్ జిల్లాలో ఓటర్లు 10,77,336 మంది, పెద్దపల్లి జిల్లాలో 7,17,258 మంది, జగిత్యాల జిల్లాలో 7,12,947 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 472906 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరగనున్నదని అధికారులు భావిస్తున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)