DISCOM Employees Transfers : తెలంగాణ డిస్కమ్ లలో బదిలీలు- ఉద్యోగుల జాబితా, షెడ్యూల్ విడుదల-tg discom employees transfers started lists schedule for transfers released in website ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Discom Employees Transfers : తెలంగాణ డిస్కమ్ లలో బదిలీలు- ఉద్యోగుల జాబితా, షెడ్యూల్ విడుదల

DISCOM Employees Transfers : తెలంగాణ డిస్కమ్ లలో బదిలీలు- ఉద్యోగుల జాబితా, షెడ్యూల్ విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Sep 29, 2024 06:47 AM IST

DISCOM Employees Transfers : తెలంగాణ డిస్కమ్ లలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఒకేచోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీలకు డిస్కమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీ జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో పేరున్న ఉద్యోగులు అక్టోబర్ 2 నుంచి 4 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ డిస్కమ్ లలో బదిలీలు- ఉద్యోగుల జాబితా, షెడ్యూల్ విడుదల
తెలంగాణ డిస్కమ్ లలో బదిలీలు- ఉద్యోగుల జాబితా, షెడ్యూల్ విడుదల

DISCOM Employees Transfers : తెలంగాణ డిస్కమ్ లలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మొదలైంది. తాజాగా డిస్కమ్‌లలో బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ నాటికి ఒకే చోట రెండేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు ట్రాన్స్ ఫర్ అయ్యే ఉద్యోగుల లిస్ట్ ను శనివారం డిస్కమ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తెలియజేయాలని అధికారులు సూచించారు. అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ లేదా అంతకు ముందు పదవీ విరమణ చేసేవారికి ఉద్యోగులకు బదిలీలు వర్తించవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

బదిలీల షెడ్యూల్ ఇలా

మొత్తం 16 కేటగిరీల్లో ఉద్యోగుల బదిలీల జాబితాను డిస్కమ్ వెబ్ సైట్(https://tgsouthernpower.org/) లో అందుబాటులో ఉంచారు. భార్యాభర్తలిద్దరూ డిస్కమ్‌లో పనిచేస్తుంటే వారిలో ఒకరికి 70 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారికి లేదా మానసిక వైకల్యం కలిగిన పిల్లలు లేదా తల్లిదండ్రులకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెప్పారు. అలాగే ఈ లిస్ట్ లో పేరున్న ఉద్యోగులు పోస్టింగ్ కోసం అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులను అక్టోబరు 7న విడుదల చేయనున్నారు. ట్రాన్స్ ఫర్ అయిన ఉద్యోగులు అక్టోబరు 10వ తేదీ లోపు ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్ బదిలీలు

తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ మండలిలో అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలైంది. ఇటీవల పదోన్నతులు కల్పించిన టీజీ ఎన్పీడీసీఎల్‌ తాజాగా బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల జాబితాలను వెబ్ సైట్(https://tgnpdcl.com/) లో అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌ విధానంలో బదిలీలు చేపట్టనున్నారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌, ప్రొవిన్షియల్‌ ఉద్యోగులకు గత విధానంలో బదిలీలు నిర్వహించనున్నారు. సిటీ, టౌన్, జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను గ్రామీణ ప్రాంతాలకు... గ్రామాల్లో పనిచేస్తున్న వారిని నగరం, పట్టణం, జిల్లా, మండల కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. అయితే 2025 సెప్టెంబర్‌ 30వ తేదీ లేదా ఆ లోపు పదవీ విరమణ చేసే వారికి బదిలీల నుంచి ఉపశమనం కల్పించారు.

ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న జూనియర్‌ లైన్‌మెన్‌లు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, డివిజనల్‌ ఇంజినీర్‌లను బదిలీలు చేయనున్నారు. సబ్‌ ఇంజినీర్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగంలోని సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫోర్‌మెన్‌, ఇతర సిబ్బందిని, సర్కిల్‌ స్థాయిలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌లను ట్రాన్స్ ఫర్ చేయనున్నారు. శనివారం ఉద్యోగుల బదిలీల జాబితాలు విడుదల అయ్యాయి. ఈ నెల 30 వరకు ఉద్యోగుల అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్‌ 2-4 మధ్య దరఖాస్తులకు అవకాశం కల్పించారు.

ఈ ఏడాది జూన్‌ 30 వరకు ఒకేచోట రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాత పద్ధతిలో బదిలీలు నిర్వహంచేవారికి సర్కిల్‌, డివిజన్‌ ఆఫీసుల్లో జాబితాలు ప్రదర్శిస్తారు. అక్టోబర్‌ 7న ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. 8వ తేదీ నుంచి బదిలీలపై బ్యాన్ అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం