Student Dies in US : అమెరికాలో జెట్ స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి-telangana student venkataramana pittala dies in jet ski accident at florida in usa ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Student Dies In Us : అమెరికాలో జెట్ స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి

Student Dies in US : అమెరికాలో జెట్ స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 14, 2024 02:48 PM IST

Venkataramana Pittala : వరంగల్ నగరానికి చెందిన పిట్టల వెంకటరమణ(27) అనే విద్యార్థి అమెరికాలో జెట్ స్కీ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయాడు. మార్చి 9వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

Venkataramana Pittala
Venkataramana Pittala (Pixbay)

Telangana student Dead in USA: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాజీపేట నగరానికి చెందిన వెంకటరమణ పిట్టల(Venkataramana Pittala 27) అనే విద్యార్థి జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనలో ఫ్లోరిడా నగరంలో జరిగింది.

మార్చి 9న ప్రమాదం….

27 ఏళ్ల వెంకటరమణ(Venkataramana Pittala) ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో((IUPUI)) మాస్టర్స్ డిగ్రీని చదువుతున్నాడు.  ఈ సంఘటన మార్చి 9న విస్టేరియా ద్వీపం వైపు ఉన్న ఫ్యూరీ ప్లేస్ పార్క్‌లో జరిగింది. యమహా పర్సనల్‌ వాటర్‌క్రాఫ్ట్‌(జెట్‌స్కీ)ను అద్దెకు తీసుకొని అక్కడి ఫ్లోటింగ్ ప్లే గ్రౌండ్‌లో నడుపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడగా... స్వల్ప గాయాలయ్యాయి.

మే 2024లో వెంకటరమణ మాస్టర్స్ డిగ్రీ(Masters Degree) పూర్తి కానుంది. ఇంతలోనే అతను ప్రమాదానికి గురై చనిపోవటం తీవ్ర విషాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ(NTR University in AP) నుండి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించాడు.

వెంకటరమణ ఆకస్మిక మరణంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు వెంకటరమణ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వెంకటరమణ మరణానికి సంబంధించి  భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మృతదేహాం తరలింపునకు కూడా చర్యలు చేపట్టలేదని తెలిసింది.