TS Rajiv Aarogyasri Scheme : మీ -సేవలో నిలిచిపోయిన "ఆరోగ్య శ్రీ" సేవలు..!
Telangana Rajiv Aarogyasri Scheme 2023: రాజీవ్ ఆరోగ్య శ్రీలో పలు మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవలే వైద్య సాయాన్ని కూడా పది లక్షలకు పెంచింది. అయితే ఇందుకు సంబంధించిన సేవలు… మీ- సేవా కేంద్రాల్లో నిలిచిపోయాయి.
Telangana Rajiv Aarogyasri Scheme 2023 "రూ. 2 లక్షల వైద్య పరిమితి కలిగిన ఆరోగ్యశ్రీ కార్డు రూ.10 లక్షలకు పెంపు.." ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ప్రచార క్రమంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. ఆరోగ్య శ్రీని ప్రచార అస్త్రంలా తీసుకున్న హస్తం పార్టీ ఈ పథకాన్ని ఆరు గ్యారంటీల్లో ఒకటిగా చేర్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే రెండు హామీలను నెరవేరుస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన కొత్త సర్కారు మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చింది. ఇక అమల్లోకి తెచ్చిన మరో పథకంగా రూ.10 లక్షల ఆరోగ్యశ్రీని చూపించారు. కాగా ఈ పథకానికి ఎలాంటి నిధుల కేటాయింపు అవసరం లేకపోయినా ఓ ప్రకటనతోనే పని పూర్తయినట్లు కొత్తగా కొలువైన కాంగ్రెస్ పార్టీ భావించింది.
ఆర్భాటమే అమలేదీ..?
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అమల్లోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట పెన్నిధిలా మారి ప్రజలను ఆదుకుంది. ఆ తర్వాత వైయస్ మరణానంతరం ఈ పథకానికి దిశా నిర్దేశం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎంతో బృహత్తరమైన ఆరోగ్యశ్రీని నీరుగారుస్తూ వచ్చింది. కాగా తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ ప్రకటన చేసింది. అధికార పగ్గాలు చేపట్టిన రెండో రోజు నుంచే ఆరు గ్యారంటీల్లో ఒక పథకమైన ఆరోగ్య శ్రీని అమల్లోకి తెచ్చినట్లు ప్రకటించింది.
మీసేవకు వెళితే చుక్కెదురు..
ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీపై పెద్దగా శ్రద్ధ చూపని రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి ఊపిరి పోసిందని తెలియగానే ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వెంపర్లాట మొదలు పెట్టారు. రూ.10 లక్షల పరిమితి పెంచిన ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు చేసే క్రమంలో జనం మీసేవ కేంద్రాల వద్దకు పరుగు తీస్తున్నారు. ఇదిలా ఉండగా మీసేవ కేంద్రాల్లో ప్రజలకు మొండిచెయ్యే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి జవసత్వాలు తెచ్చిందని భావిస్తున్న క్రమంలోనే ఆ పథకం ఇంకా పట్టాలపైకి ఎక్కలేదన్న చేదు నిజం ప్రజల చెవిన పడుతోంది. ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించి తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ పథకానికి మీ సేవలో దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది.
ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కార్డులు దరఖాస్తు చేసే సమయంలో, డౌన్లోడ్ చేసే క్రమంలోనూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోతో ఉండేవి. తాజాగా అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం పది రోజులుగా కేసీఆర్ ఫోటోతో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసింది. ప్రభుత్వం మారిన క్రమంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోతో ఉన్న పత్రాలను నిలిపివేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన దరఖాస్తులు, డౌన్లోడ్ పత్రాలను వెంటనే రూపొందించి సాఫ్ట్ వేర్ ను పునరుద్ధరించకపోవడం వల్ల మీసేవ కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా మీసేవ కేంద్రాల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించిన సేవలను నిర్వాహకులు పూర్తిగా నిలిపివేశారు. సాఫ్ట్వేర్ లో సంబంధిత వివరాలు చూపించక పోయేసరికి నిర్వాహకులు ఆరోగ్యశ్రీ కార్డుల దరఖాస్తులను స్వీకరించడం లేదు. కాగా ఈ సాఫ్ట్ వేర్ ను కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ఫోటోతో ఎప్పుడు పునరుద్ధరిస్తారో అంతుచిక్కని అంశంగా మారింది. ఈ ఫలితంగా 10 లక్షల వైద్య పరిమితికి ఆరోగ్య శ్రీ సేవలను పెంచినట్లే పెంచిన ప్రభుత్వం ఆ సేవలను ప్రజల చెంతకు ఇంకా తీసుకురాకపోవడం శోచనీయం.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.
సంబంధిత కథనం