Police Recruitment : ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు విడుదల-telangana police recruitment 2022 si and constables preliminary written test dates release ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Police Recruitment : ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు విడుదల

Police Recruitment : ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు విడుదల

HT Telugu Desk HT Telugu
Jul 04, 2022 04:19 PM IST

పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు.. కీలక అప్ డేట్ వచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తేదీలను విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయి. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వైబ్‌సైట్‌ www.tslprb.inలో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అంతేగాకుండా.. 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 28న నోటిఫికేషన్‌ విడుదలైంది. 2.54 లక్షల మంది అభ్యర్థులు ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం.. 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని బోర్డు తెలిపింది. ఎస్సై పోస్టులకు హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కానిస్టేబుల్‌ పరీక్షలకు హైదరాబాద్‌తోపాటుగా.. 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు.

పోలీస్, ఎస్‌పీఎఫ్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లో 17,516 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చాయి. వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల గడువు మే 26తో ముగిసింది. 52 శాతం మంది ఒకే ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. 29 శాతం మంది రెండు ఉద్యోగాలకు, 15 శాతం మంది మూడింటికి, 3 శాతం మంది నాలుగు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.

మొత్తం దరఖాస్తుల్లో 21 శాతం అంటే 2,76,311 మహిళా అభ్యర్థుల నుంచి వచ్చాయి. ప్రభుత్వం నోటిఫికేషన్‌ సమయంలో ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరో రెండేళ్ల వయోసడలింపుతో 1.4లక్షల మంది అభ్యర్థులకు పోటీలో అవకాశం దక్కింది. ప్రిలిమినరీ రాతపరీక్షకు 67 శాతం మంది తెలుగు మీడియం, 32.8శాతం మంది ఆంగ్లం, 0.2శాతం మంది ఉర్దూ మీడియాన్ని ఎంచుకున్నారు.

IPL_Entry_Point